ముందుగా సందర్భం ఏమిటో చూద్దాం… సినిమా జర్నలిస్టు ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం ఆవిష్కరణ… ముఖ్య అతిథి చిరంజీవి… కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు బొకే ఇచ్చి, సెల్ఫీ అడిగారు… ఈ సందర్భంగా చిరంజీవి ‘ఇక్కడ వారు లేరు కదా’ అన్నాడు… అంటే గరికపాటిని పరోక్షంగా ఉద్దేశించి… అక్కడున్నవాళ్లంతా పడీ పడీ నవ్వారు…
మొన్నమొన్నటిదాకా వివాదం నడిచిందే కదా… దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ ప్రోగ్రాంలో వివాదం రేగిందే సేమ్, ఇలా మహిళల సెల్ఫీల ఎపిసోడ్ తరువాతే కదా… సో, చిరంజీవి వ్యాఖ్య గరికపాటిని ఉద్దేశించిందే… అబ్బ, ఏం టైమింగ్, అబ్బ, ఏం సెన్సాఫ్ హ్యూమర్ అనిపిస్తోందా..? కాదు… గోకడం..! అంతా అయిపోయిన రచ్చను మళ్లీ గెలకడం… అక్కడ ఆ వ్యాఖ్య అవసరం ఏముంది..? మరీ గరికపాటి అంత చిల్లర మనిషి అయిపోయాడా..? జనంలోకి ఈ సంకేతం ఇలాగే వెళ్తుంది… సో, చిరంజీవి ఇంకా చల్లబడలేదు అని అర్థం చేసుకోవాలా..? గరికపాటే చిరంజీవి ఇంటికి వెళ్లి, ఇకనైనా క్షమించి మరిచిపొండి అంటూ సాగిలబడాలా..?!
విద్వత్తు ఉండగానే సరిపోదు… పురాణాలు, పద్యాలు, శ్లోకాలు ఔపోసన పట్టగానే సరిపోదు… అసాధారణ ధారణ, సాధన సామర్థ్యం ఉండగానే సరిపోదు… వేయి మందికి జవాబు చెప్పిన సహస్రావధానానికి గరికపోచ పాటి విలువ లేదు… ఎవరున్నచోట ఉండకూడదో తెలియాలి… ఎలా నిష్క్రమించాలో తెలియాలి… అది తెలియకపోతే ద్విసహస్రావధానం చేసినా దండుగే… ఆ విద్యకు పద్మశ్రీ కూడా దండుగే…
Ads
చిరంజీవి సెల్ఫీలు డిస్ట్రబ్ చేస్తుంటే మౌనంగా వెళ్లిపోవాలి అంతేగానీ… మీరు సెల్ఫీలు ఆపితే మాట్లాడతా, లేదంటే వెళ్లిపోతా అంటాడా… ఆయ్ఁ, అహంభావం చంపుకోలేని వ్యక్తిత్వం కాదా ఇది… ఇక తన ప్రవచనాలకు పవిత్రత ఏమున్నట్టు..? పైగా అక్కడున్నది చిరంజీవి అనే సినిమా దేవుడని గుర్తించలేకపోయాడు… దేవుడి పట్ల ధిక్కారమా ఓ ప్రవచనకర్తకు..? తప్పు కాదా… చేతనైతే ఆశువుగా అప్పటికప్పుడు అక్కడే ఓ పొగడపూవు అర్పించుకోవాలి గానీ…
ఆఫ్టరాల్ ప్రవచనాలు చెప్పుకునేవాడు తనను ఉద్దేశించి అలయ్ బలయ్‌లో అంత మాట అంటాడా అనే అహం, కోపం, అసంతృప్తి చిరంజీవిలో ఇంకా రగులుతూనే ఉన్నట్టుంది… అది కడుపులోనే ఉండలేక ఇలా తన్నుకొస్తోంది… కానీ నిజానికి ఆ వివాదాస్పద వ్యాఖ్య అనంతరం చిరంజీవి గరికపాటి దగ్గరకు వెళ్లాడు… రెండు చేతులూ పట్టుకున్నాడు… మీ ప్రవచనాలు వింటుంటాను, స్పూర్తిగా తీసుకుంటాను, వీలయితే మిమ్మల్ని ఇంటికి పిలుస్తాను అన్నాడు… తరువాత గరికపాటి, చిరంజీవి, దత్తాత్రేయ అక్కడేమీ జరగనట్టుగానే కనిపించారు… చిరంజీవి కనబరిచిన సంస్కారానికి, మర్యాదకు, పద్ధతికి అక్కడున్నవాళ్లు ముగ్ధులయ్యారు…
మళ్లీ ఇదేమిటి..? ఆ వివాదం మరుసటిరోజున నాగబాబు కావాలని పెట్రోల్ పోశాడు… చాలామంది రెచ్చిపోయారు… గరికపాటిని పరుషపదజాలంతో దూషించారు… ఎవరెవరో ఏదేదో మాట్లాడేశారు… తరువాత గరికపాటే క్షమాపణ చెప్పినట్టు వార్తలొచ్చినయ్… తరువాత ఎక్కడో చిరంజీవే మాట్లాడుతూ పెద్దాయన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు… నిజానికి అక్కడ ఫుల్ స్టాప్ పడాలి…
మరి మళ్లీ చిరంజీవే గోకడం దేనికి..? తను ఆఫ్టరాల్ గరికపోచపాటి కావచ్చుగాక… కానీ చిరంజీవికి ఎవరూ చెప్పినట్టు లేరు… చెప్పినా వినడానికి సంసిద్ధతతో ఉంటాడో లేడో కూడా తెలియదు… తరాల చరిత్ర చూస్తే… పెద్ద పెద్ద చక్రవర్తులు సైతం విద్యాసంపన్నులకు గండపెండేరాలు తొడిగారు… పల్లకీలు మోశారు… సత్కరించారు… అంతేతప్ప వెటకరింపులతో, ఇలాంటి గోకుళ్లతో ఛీత్కరించలేదు…
ఇప్పుడు చిరంజీవి చేసిన ‘ఇక్కడ వారు లేరు కదా’ అని చేసిన వ్యాఖ్య మళ్లీ వైరల్ అయ్యింది… కానీ చిరంజీవి వంటి ఓ రేంజ్ ఉన్న ప్రముఖుడికి ఇలాంటి వ్యాఖ్యలు శోభనివ్వవు…! అది గరికపాటి కావచ్చు, మరొకరు కావచ్చు…!! అబ్బే, తనను అవమానించే ఉద్దేశం ఏమీ లేదని, సరదాగా అన్నానని రేపు చెప్పవచ్చుగాక, కానీ జనంలోకి ఎలా వెళ్తుందనేదే ముఖ్యం కదా…
Share this Article