Sai Vamshi ……… Choice of a Woman – The Dog’s Shadow… ఇలస్ట్రేటర్, రచయిత సృజన్ గారితో ఇటీవల మాట్లాడినప్పుడు కన్నడ సినిమాల ప్రస్తావన వచ్చింది. ‘కన్నడ వాళ్లు సాహిత్యం నుంచి సినిమాలకు కథల్ని బాగా Adopt చేసుకుంటారని’ అన్నాను. నిజానికి కన్నడ సినిమా రంగమంతా అలా లేదు. కానీ అక్కడున్న Sensible Directors ఇప్పటికీ కనీసం సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు సాహిత్యం ఆధారంగా తీస్తున్నారు. అదొక పరంపరలా కొనసాగిస్తున్నారు. అందులో అందరూ చూడాల్సిన సినిమాగా నేను చెప్పేది ‘నాయి నెరళు’.
‘వంశవృక్ష’, ‘పర్వ’, ‘దాటు’ లాంటి ప్రఖ్యాత నవలలు రాసి, ‘ఆవరణె’ నవలతో అనేక విమర్శలు అందుకున్న ఎస్.ఎల్.భైరప్ప గురించి తెలుగు వారికి ఎంత తెలుసనేది నాకు తెలియదు. ఇప్పటిదాకా ఎనిమిది మంది కన్నడ రచయితలు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. తొమ్మిదో పురస్కారం అందుకోగలిగే అవకాశం ఉన్న 90 ఏళ్ల రచయిత భైరప్ప. కారణాలు ఏవైనా, ఇప్పటిదాకా ఆయనకు పురస్కారం రాకపోవడం కొంత వింతగానే అనిపిస్తుంది నాకు.
Ads
1968లో ఆయన రాసిన నవల ‘నాయి నెరళు’. అంటే ‘కుక్క నీడ’ అని అర్థం. ఏంటి కథ? పునర్జన్మల గురించి. 20 ఏళ్ల క్రితం మరణించిన భర్త మరో రూపంలో తిరిగొస్తే ఆ భార్య ఎలా స్పందిస్తుంది? వచ్చింది తన భర్తే అని నమ్ముతుందా? పునర్జన్మ మీద నమ్మకంతో అతణ్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా? తన కూతురు వయసున్న యువకుడిని భర్తగా స్వీకరిస్తుందా? వితంతువు వేషం తీసేసి సుమంగళిగా మారుతుందా? దీన్ని సమాజం, ఆమె కుటుంబం ఎలా తీసుకుంటుంది? వాళ్ల బంధాన్ని ఆమోదిస్తుందా?
చెప్పడానికి చాలా చిన్న అంశం. కానీ చర్చించే కొద్దీ చాలా అంశాలు ఇందులో కీలకం అవుతాయి. ముఖ్యంగా ఆమెకు ఈ విషయంలో ఉన్న స్వేచ్ఛ. అది కీలకమవుతుంది. 2006లో ఈ నవలను ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి సినిమాగా తెరకెక్కించారు. ప్రస్తుతం తెలుగులో తల్లి పాత్రలతో పాపులర్ అయిన నటి పవిత్రా లోకేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తన కెరీర్లో దొరికిన అతి విలువైన పాత్రగా నేటికీ ఆమె ఈ సినిమా గురించి చెప్పుకుంటారు.
ఈ సినిమాకుగానూ కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నామినేట్ అయినా పురస్కారం రాలేదు. తనకన్నా వయసులో 20 ఏళ్ల చిన్న వ్యక్తిని తన భర్తగా భావించే స్థితిలో పడ్డ మహిళ పాత్ర. ఇలాంటివి చేయాలంటే చాలా నేర్పు, ఓర్పు కావాలి.
ఈ సినిమా చాలా స్లోగా ఉంటుంది. అయినా పూర్తిగా చూడమని అంటాను. కారణం, ఇందులోని మూల అంశం. భార్యాభర్తల అనుబంధాన్ని ‘ఏడేడు జన్మల బంధం’ అనడం సులువు. కానీ నిజంగా భర్తో, భార్యో పునర్జన్మ ఎత్తి వస్తే దొరికే Acceptance ఎంత? ఈ చిత్రంలో ఇది ప్రధాన అంశం అనిపిస్తుంది కానీ, అసలు చూడాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. అది a women Choice. ఇతను నా భర్త అని ఒక స్త్రీ నిర్ధారణ చేసుకున్నాక కాదనడానికి మనం ఎవరం? మనకేమి హక్కు ఉంది? అది మనకు సంబంధించిన అంశమా?
సినిమా చివర్లో కూతురు తల్లిని అడుగుతుంది. “నిజంగా నాన్నే మరో జన్మ ఎత్తి వచ్చాడని నువ్వు నమ్ముతున్నావా?” అని. దానికి తల్లి నవ్వి “నేనెప్పుడు నమ్మాను?” అంటుంది. మరి? ఎందుకు అతనితో కలిసి ఉంది? ఒక బిడ్డను కంది? తెలియలేదా? It’s her Choice. వితంతువుగా ఉన్న ఆమెకు కొత్త జీవితం ప్రారంభించాలని అనిపించి ఉండొచ్చు. దానికి ఇదొక మార్గంలా కనిపించి ఉండొచ్చు. ఆ వచ్చిన వ్యక్తి నచ్చి ఉండొచ్చు.
ఆమె జీవితానికి ఏం కావాలో ఆమె నిర్ణయించుకుని అడుగు ముందుకు వేసింది. దానితో మనకేమి నష్టం. సినిమాలోని ఆ ఒక్క సన్నివేశం అర్థమైతే, సినిమా మూలం ఏమిటో తెలుస్తుంది. Every individual has their Choice. Every woman has her Choice. దానికి తగ్గ నిర్ణయాలు ఆమె తీసుకుంటుంది. కాదనేందుకు మనం ఎవరం? అడ్డుకునే హక్కు మనకేది?
ఈ సినిమా Hotstarలో Subtitlesతో అందుబాటులో ఉంది. In YouTube(without English Subtitles): https://youtu.be/Hdi92wUHCmM (‘సినిమా అన్వేషి’ గ్రూప్‌లో నేను రాసిన వ్యాసం)… (అలాగే సీనియర్ నరేష్‌ను చేసుకోవడం కూడా పవిత్రా లోకేష్ చాయిస్, కాదనడానికి, నవ్వడానికి మనం ఎవ్వరం..?)
Share this Article