చుక్కా రామయ్యగారి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో? ఎంత రాయాలో? నాకు అంతుచిక్కదు. ఎంత రాసినా… ఇంకా ఎంతో రాయాల్సింది మిగిలిపోయే చుక్కాని. ప్రస్తుతం ఆయన వయసు దాదాపు వందేళ్లు. నడవలేరు. ఒకటీ అరా మాటలు మాట్లాడగలరు. వినగలరు. ఇప్పటికీ టీ వీ లో వార్తలను ఫాలో అవుతున్నారు.
1995 లో హైదరాబాద్ విద్యానగర్లో ఆయన పక్కవీధిలో ఉంటున్న ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, జోతిశ్శాస్త్రవేత్త కొల్లేగళ్ ఆర్ సుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటిసారి నాకు రామయ్యసార్ గురించి పులకింతగా చెప్పారు. అప్పుడు నా వయసు పాతికేళ్లు. నాయనా నువ్ రామయ్య సార్ ను కలవాలి. సార్ కు పోతన పద్యాలంటే ప్రాణం- అన్నారు. నాకు లెక్కలంటే భయం. పదో తరగతి లెక్కల పేపర్లో ఫెయిల్ కాకుండా పాస్ ఎలా అయ్యానో అని ఇప్పటికీ నైతికంగా విచారిస్తుంటాను…అలాంటిది రామయ్య సార్ ను నేనెలా కలుస్తాను? వద్దు అన్నాను. సుబ్రహ్మణ్యం గారు రామయ్య సార్ కు ఫోన్ చేసి నా గురించి చెప్పారు. వెళ్లాను.
సార్ ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష కోచింగ్ క్లాసులో ఉన్నారన్నారు. పీరియడ్ అయ్యేవరకు బయటే ఉన్నాను. రాగానే అయ్యో ఎండలో ఉన్నావు…లోపలికొచ్చి కూర్చోవాలి కదా! అంటూ కిటికీ దగ్గర కూజాలో నీళ్లు గ్లాసులోకి ఒంపి… చేతికిచ్చి… ఎప్పటినుండో బాగా పరిచయమున్న వ్యక్తిలా ఆత్మీయంగా పలకరించారు. నీ పద్యాల గురించి సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు అంటూ వెంటనే చర్చను సాహిత్యంవైపు తిప్పబోతే…సార్ నాకు లెక్కలంటే మహా భయం. మీతో మాట్లాడాలన్నా బెరుకుగా ఉంటుంది… అన్నాను. నీ పద్యంలో గణాలు, ఛందస్సు, యతి ప్రాసల లెక్కల ముందు ఈ లెక్కలు ఒక లెక్కలోనివే కావు అని తేల్చిపారేశారు.
Ads
“శారద నీరదేందు తుషారాహార”
“క్షోణి తలంబునన్…”
“ఏ దేవి వర్ణాంబుజ…”
“తల్లీ నిన్ను తలంచి…”
“యాకుందేందు తుషారాహార…”
పద్యాలు, శ్లోకాలు పాడాను. ఆ పద్యాలు నేనే రాసినంత గొప్పగా పొగిడి… కాఫీ తెప్పించి… చేతికందించారు. ఇంటి అడ్రస్ చెప్పి… అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉండమన్నారు. ఆరోజు నుండి విద్యానగర్లో ఆ విద్యామూర్తి ఇంట్లో ఎన్ని వందల, వేల పద్యాలు, శ్లోకాలు, పాటలు పాడానో నాకు గుర్తేలేదు. కలిసిన ప్రతిసారీ ఎన్ని పద్యాలు పాడినా ఆయన అడిగి పాడించుకునేవి మాత్రం- 1. తల్లీ నిన్ను తలంచి పుస్తకమున్ చేతన్ పూనితిన్; 2. యాకుందేందు తుషారహార…; 3. దాశరథి ఆ చల్లని సముద్ర గర్భం ; 4. విద్వాన్ విశ్వం పెన్నేటి పాట.
ఈమధ్య రెండేళ్లుగా సార్ ను కలవలేదు. మొన్న ఒకరోజు నేను, నా భార్య, మా అబ్బాయి కలిసి వెళ్లాము. చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. ముప్పయ్యేళ్లపాటు కలిసిన ప్రతిసారీ సార్ అడిగిన పద్యాల సంగతి గుర్తు చేశాను. అవును అని పులకింతగా అన్నారు. నిలుచుని సార్ ముందు తల్లీ నిన్ను తలంచి… యాకుందేందు… ఆ చల్లని సముద్రగర్భం పాడాను. ఆ చల్లని సముద్రగర్భం వింటున్నప్పుడు సార్ కళ్లల్లో నీళ్లు నిండాయి. మీకు అత్యంత ఇష్టమైన పాట సార్ అన్నాను. అవును అని నా చేయి పట్టుకుని మౌనముద్రలోకి వెళ్లిపోయారు.
నేనెప్పుడైనా వెళ్ళినప్పుడు సార్ ను కలవడానికి వచ్చిన పెద్దవారుంటే వారిని కూర్చోబెట్టి… నన్ను పరిచయం చేసి… మా మధు పద్యాలు పాడతాడు. తెలుగు ఎంత అందమైనదో మీకు తెలుస్తుంది… కూర్చోండి… అని బలవంతపెట్టేవారు. ఆ సంగతులన్నీ సార్ సహాయకుడు పులకింతగా గుర్తుచేసుకుంటూ నా భార్యకు, మా అబ్బాయికి చెబుతున్నాడు. వీరికేమైనా ఇవ్వు అని సార్ గుర్తు చేశారు.
సార్ ను కలవడానికొచ్చినవారు తెచ్చి ఇచ్చిన పళ్లు, స్వీట్లను నా ముందు పెట్టి నీ పద్యాలకు ప్రతిఫలంగా తీసుకెళ్లు అనేవారు.
మా అబ్బాయి అక్షరాభ్యాసానికి మా నాన్న ముహూర్తం పెట్టారు. బాసరకు వెళ్లాలి. రామయ్య సార్ మాతోపాటు వస్తామన్నారు. ఈలోపు విద్యాసంస్కరణల మీద పార్లమెంటరీ స్థాయీ సంఘం హైదరాబాద్ వస్తోంది- సరిగ్గా ఆ ముహూర్తం రోజు సార్ హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మీకు కుదిరినప్పుడే పెట్టుకుందాం సార్ అన్నాను. సార్ దగ్గరికే వెళ్లి ఆ ముహూర్తానికి అక్షరాభ్యాసం చేయించేస్తే… అన్నారు మా నాన్న. సార్ ను అడిగాను. దానికేమి భాగ్యం? అన్నారు. సారే మా ఇంటికొచ్చారు. మా వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని సారే పురోహితుడిగా శాస్త్రీయంగా అక్షరాభ్యాసం చేయించారు. మాకు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు. మావాడి విద్యారంభానికి సార్ అలా చుక్కాని అయ్యారు. మొన్న వెళ్లినప్పుడు ఏమి చదివాడు? ఇప్పుడేమి చేస్తున్నాడని అడిగారు. లండన్ కింగ్స్ కాలేజీలో ఫిజిక్స్ పి జి పూర్తి చేసి… ఇప్పుడు మరో పి జీ కి సిద్ధమవుతున్నాడని చెబితే…ఆనందంతో మావాడి చేతిని అలా పట్టుకుని ఉండిపోయారు.
మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన; ప్రభుత్వ విద్యావ్యవస్థలో సంస్కరణలు; ఫిన్లాండ్ విద్యా విధానం; లెక్కలు సులభంగా చెప్పడం; ఉన్నత విద్యలో సింగపూర్ సాధించిన విజయాల మీద సార్ రాసిన వ్యాసాల సంకలనం పుస్తకాలుగా వచ్చాయి. వాటిమీద గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం.
ఆ గలగలలు ఇప్పుడు మౌనంగా పలకరించుకుంటున్నట్లు కాసేపు కూర్చుని… పాదనమస్కారం చేసి వచ్చేశాము. “నేర్చుకోవాలనుకునేవాడు ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలి” అని సార్ ఎప్పుడూ అంటుంటారు. అలా నా అజ్ఞానంతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎన్ని అడిగినా ఓపికగా సమాధానం చెప్పేవారు.
ప్రపంచానికి ఆయన ఐ ఐ టీ లెక్కల రామయ్య సార్ కావచ్చు. నాకు మాత్రం నిలువెత్తు పద్యప్రేమికుడు.
కొసమెరుపు:-
నాకు నోటికొచ్చిన పద్యాలన్నీ సార్ కు నోటికొచ్చు. అంతకంటే ఎక్కువే ఆయనకు కంఠస్థం అని కొన్నిసార్లు నేను సాక్ష్యాధారాలతో పట్టుకున్నాను. కానీ ప్రతిసారీ తొలిసారి వింటున్నట్లు తన్మయత్వంతో వింటూ మరోలోకంలో విహరిస్తుంటారు. పిల్లలను ప్రోత్సహించడానికి ఆయన పిల్లల దగ్గర మరీ పిల్లవాడైపోతుంటారు. నా విద్యార్థులు నాకు చాలా పాఠాలు నేర్పారు- అని ఆయన సవినయంగా కొన్ని వేల సార్లు చెప్పారు.
ఫలశ్రుతి:-
విద్యానగర్ లో మధ్యతరగతి కోసం కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఎం ఐ జి. అదే ఇల్లు. ముందు కాంపౌండ్ గేటు తీయగానే చిన్న హాల్. టేబుల్ మీద పుస్తకాలు. కుర్చీలో సార్. కొన్ని వేల మందిని ప్రభావితం చేసిన ఆ క్షణాలన్నీ ఇప్పుడు లోపల బెడ్ రూమ్ లో మాట్లాడలేని మౌనాల్లో గింగుర్లు తిరుగుతున్నాయేమో! నిరాడంబరంగా, ఒక యోగిలా, రుషిలా బతుకును ఒక తపస్సుగా పండించుకున్న రామయ్య సార్ లో ఇప్పటికీ ఆ తేజస్సు ప్రతిఫలిస్తోంది. ఆయన కళ్లే మాట్లాడుతున్నాయి. చెవులతో కాకుండా మనసుతో వినాల్సిన భాష అది. తరువాతి తరాలకు అందివ్వాల్సిన విలువలు ఎన్నెన్నో మూటగట్టి ఉన్నాయక్కడ. … -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article