.
Subramanyam Dogiparthi…. కృష్ణ , కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మసాలా రొమాంటిక్ ఎంటర్టైనర్ 1988 ఫిబ్రవరిలో వచ్చిన ఈ చుట్టాలబ్బాయి సినిమా . 1+2 సినిమా . చుట్టాలబ్బాయి అని ఎందుకు ఎంపిక చేసుకున్నారో ! అత్త అల్లుడు సవాల్ , అత్తకు తగ్గ అల్లుడు , అత్తకు యముడు వంటి టైటిలయితే కరెక్టుగా సెట్టయ్యేది .
తన చెల్లెలు ప్రేమ పెళ్ళికి అడ్డం పడ్డ అత్తకు బుధ్ధి చెప్పటానికి చుట్టాలబ్బాయిగా అత్తింట్లో చేరుతాడు కధానాయకుడు . ఆ ఊళ్ళోనే ఉండే సుహాసిని సూపర్ స్టార్ కృష్ణకు పిచ్చాభిమాని . నువ్వే సూపర్ స్టార్ కృష్ణవు అని హీరో వెంటపడి మనసు పారేసుకుంటుంది .
Ads
కానీ , కధానాయకుడు కార్యార్ధి అయి రావటం వలన ఆమె ప్రేమను స్వీకరించకుండా అత్త గారి గారాల కూతురు రాధను ప్రేమించి అత్త చేతుల మీదుగానే పెళ్లి జరిపించుకుంటాడు . అక్కడ నుండి సుహాసిని సహకారంతో రాధకు కూడా వాస్తవం చెప్పి తన వైపుకు తిప్పుకుంటాడు .
1+2 కలిసి అత్తకు బుధ్ధి చెప్పి తన చెల్లెలి కాపురాన్ని నిలబెట్టుకుంటాడు . అంతే కాకుండా చుట్టంగా ఉంటూ గాదె కింది పందికొక్కులాగా బతికే విలన్ నూతన్ ప్రసాదుకు , అతని అనుచరుడికి కూడా బుధ్ధి చెప్పి సినిమాను సుఖాంతం చేస్తాడు . కృష్ణ , సుహాసినిల మారువేషాల హడావుడి సరదాగా ఉంటుంది . సినిమాల్లో మారు వేషాలు గమ్మత్తుగా ఉంటాయి . ప్రేక్షకులకు తెలిసి , సినిమాలో విలన్లకు తెలియకుండా భలేగా ఉంటాయి .
అత్తగా యస్ వరలక్ష్మి తన పాత్రను పుర్ర చేత్తో చేసేసింది . ఇలాంటి అత్త పాత్రలకు ఆమె పెట్టింది పేరు . ఎవరయినా ఆమె తర్వాతే . వీర విధేయ భర్తగా గొల్లపూడి మారుతీరావు నటన బాగుంటుంది . సుహాసిని సూపర్ స్టార్ కృష్ణ పిచ్చాభిమినిగా పిచ్చగా నటించింది . రాధ గ్లామర్ స్పేసుని అద్భుతంగా ఫిల్ చేసింది .
వై విజయ , గిరిబాబు స్వఛ్ఛ ప్రేమ బ్రహ్మాండంగా ఉంటుంది . ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , పూర్ణిమ , శుభలేఖ సుధాకర్ , ప్రసాద్ బాబు , తదితరులు నటించారు . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , రాజ సీతారాం , నాగోర్ బాబు , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర పాటల్ని పాడారు . యం శ్రీనివాస చక్రవర్తి కధకు సత్యానంద్ సంభాషణలు బాగా ఉంటాయి . డ్యూయెట్లకు సలీం చక్కటి డాన్సులను కంపోజ్ చేసాడు . కృష్ణ చేత కూడా డాన్స్ చేయించాడు .
పాటలన్నీ శ్రావ్యంగా ఉండటమే కాకుండా బయట కూడా పాపులర్ అయ్యాయి . వాటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా అంటూ సాగే పాటలో కృష్ణ , సుహాసిని టీజ్ చేయడం గోలగా ఉంటుంది . అలాగే టీజ్ చేసే మరో పాట తాగి మరీ వచ్చాడు అల్లుడు పాట . కృష్ణ నటన హుషారుగా ఉంటుంది .
మిగిలిన నాలుగు డ్యూయెట్లు రాధ , సుహాసిని మీద ఆందంగా చిత్రీకరించారు కోడి రామకృష్ణ . ఏదో ఉన్నది ఏందా సంగతి , డాషింగు వీరుడూ డేరింగు వీరుడు , సువ్వి సువ్వి సుందరాంగివో , ఒంటరిగుంటే తుంటరి బాధ అంటూ సాగుతాయి ఈ డ్యూయెట్లు .
కృష్ణ అభిమానులకు బాగా నచ్చే సినిమా . కృష్ణ కూడా ఫ్రెష్ గా ఉంటారు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూడనట్లయితే చూడండి . It’s an entertaining feel good movie . నేను పరిచయం చేస్తున్న 1166 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article