.
పొట్లూరి పార్థసారథి…. CIA తో సహవాసం అంటే వాడుకొని వదిలెయ్యడమే!
పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI 20 ఏళ్ళు CIA తో కలిసి పనిచేసింది! కలిసి పనిచేయడం అంటే పాకిస్తాన్ లో ఒకే ఆఫీసులో CIA, ISI లు కలిసి పని చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ముజాహిదిన్ లకి శిక్షణ ఇచ్చే నెపంతో CIA, ISI లు కలిసి పనిచేసాయి.
Ads
తమ లక్ష్యం నెరవేరాక చెప్పాపెట్టకుండా CIA తన సామాను సర్దుకొని పాకిస్థాన్ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయింది! డబ్బులు ఇచ్చాం పని చేయించేయించుకున్నాం అనేది CIA పాలసీ!
బాలూచిస్తాన్ లోని క్వేట్టా నుండి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసిన BLA తమ వద్ద ఇంకా 100 మంది బందీలుగా ఉన్నారని చెప్తున్నది!
పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం జాఫర్ ఎక్స్ప్రెస్ ఉదంతం సుఖాంతం అయ్యింది బందీలు అందరిని విడిపించాము అని అంటున్నది!
ఇక్కడ BLA మరియు ISI లు చెప్పని విషయం ఒకటి ఉంది.
1.హైజాక్ చేయబడ్డ జాఫర్ ఎక్స్ప్రెస్ లో 184 మంది పాకిస్థాన్ సైన్యానికి చెందిన అధికారులు ఉన్నారు.
2. 184 మందిలో ISI, యాంటి టెర్రరిజం అధికారులు, సైన్యానికి చెందిన అధికారులు ఉన్నారు! (చాలా విలువైన ప్రాణాలు)….
3.BLA లక్ష్యం ప్రయాణీకులు కాదు! 184 మంది కీలకమైన ISI, యాంటి టెర్రరిజం అధికారులు మాత్రమే!
4.ISI, యాంటీ టెర్రరిజంకి చెందిన అధికారులని BLA కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది!
5.రైలులో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలని BLA వదిలి పెట్టింది! వాళ్ళని తిరిగి క్వేట్టాకి తరలించి తమ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని పాకిస్తాన్ సైన్యం ప్రకటించి చేతులు దులుపుకుంది!
6 BLA మాత్రం తమ వద్ద 100 మంది బందీలుగా ఉన్నారని ప్రకటించింది!
7. ISI అధికారులు సాధారణ దుస్తులలో బస్సులలో, రైళ్ళ లో ప్రయాణించడం సాధారణ విషయమే! తమని ఎవరూ గుర్తించకుండా సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ప్రయాణిస్తూ ఉంటారు అది కూడా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డులు కూడా తమ వెంట తీసుకెళ్ళరు!
********
BLA డిమాండ్ ఏమిటంటే జైళ్ళలో ఉన్న తమ నాయకులని విడుదల చేయాలి. ఆచూకి లేకుండా పోయిన బాలూచ్ పౌరులని కూడా విడుదల చేస్తేనే తమ వద్ద బందీలుగా ఉన్న వాళ్ళని విడుదల చేస్తామని అంటున్నది!
పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం 36 గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో 36 మంది ఉగ్రవాదులని హతమార్చి బందీలని విడిపించామని ప్రకటించింది!
జాఫర్ ఎక్సప్రెస్ హైజాక్ వెనుక భారత్ RAW హస్తం ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ షరా మామూలుగా ఆరోపించింది!
అసలు బ్రిటీష్ వాళ్లు భారత్ ని విభజించి పాకిస్తాన్ ని ఏర్పాటు చేసినపుడు బాలూచిస్తాన్ అందులో లేదు. పాకిస్తాన్ సైన్యం బాలూచిస్తాన్ ని ఆక్రమించి కలుపుకుంది! కాశ్మీర్ ని కూడా కలుపుకోవాలని ఆశపడి భంగపడ్డది!
ఇప్పుడు PoK ప్రజలు భారత్ లో కలవడానికి సిద్ధంగా ఉన్నారు! PoK ప్రజల నుండి బలమైన ఒత్తిడి వచ్చే వరకూ భారత్ వేచి ఉంటుంది! అప్పటి వరకూ భారత ప్రభుత్వం తనకు తానుగా ఎటువంటి ప్రత్యక్ష చర్యకి దిగదు!
ఉక్రెయిన్ అధీనంలో ఉన్న క్రిమియాని ప్లేబిసైట్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తరువాతే పుతిన్ క్రిమియాని రష్యాలో కలిపేసాడు! PoK ని కూడా భారత్ అదే రీతిలో కలిపేసుకుంటుంది!
పాకిస్థాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ని విఫలం చేయడానికి 36 గంటల సమయం తీసుకొని తమ అధికారులని BLA కి వదిలేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి!
అసలు పాకిస్థాన్ లో మొబైల్ నెట్వర్క్ అనేది పూర్తిగా లేదు! ప్రధాన నగరాలలో 4G నెట్వర్క్ మాత్రమే అమలులో ఉన్నది కానీ 1 GB డాటా 250 పాకిస్తాన్ రూపాయలు! ఇక బాలూచిస్థాన్ లో అయితే ఒక్క క్వేట్టాలో మాత్రమే 4G నెట్వర్క్ ఉంది తప్పితే మిగతాచోట్ల 3G మాత్రమే అదీ కొద్ది ప్రాంతానికే పరిమితం!
5G నెట్వర్క్ వచ్చే జూన్ నెలలో అందుబాటులోకి తెస్తామని అంటున్నది కానీ 1GB డాటా 350/- పాకిస్థానీ రూపాయలు అయితేనే గిట్టుబాటు అవుతుందని టెలీనార్ అంటున్నది!
ఇప్పుడు సెల్యులర్ నెట్వర్క్ ప్రస్తావన ఎందుకంటే…. పాకిస్థాన్ లో 5G నెట్వర్క్ లేకపోవడం వలన తమ పక్క దేశాలలో ఏం జరుగుతున్నదో అక్కడి ప్రజలకి తెలియడం లేదు. ఒకసారి 5G నెట్వర్క్ అందుబాటులోకి వస్తే పాకిస్తాన్ కి తమ పక్క దేశాలకి ఉన్న తేడా తెలిసిపోతుంది!
రైలు నెట్వర్క్ అయితే బ్రిటీష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడు కట్టిన రైల్వే స్టేషన్లు ఇప్పటికి అలానే వాడుకలో ఉన్నాయి! కనీసం రైల్వే లైన్లు ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు ఇంతవరకు!
ఒక్క ఆటో ఇండస్ట్రీ అనేది లేదు. సుజుకి, హోండాలు తమ అసెంబ్లింగ్ యూనిట్లని మూసివేసి అయిదేళ్లు అవుతున్నది!
ఉల్లిపాయలు కిలో 220/-
టమోటా కిలో 120/-
So! భారత్ తో తనకి తాను ట్రేడ్ మీద నిషేధం విధించుకొని, భారత్ నుండి దుబాయ్ ఎగుమతి అయ్యే వాటిని అక్కడ కొని, తిరిగి పాకిస్తాన్ లో అమ్ముతున్నప్పుడు ధరలు పెరగకుండా ఎలా ఉంటాయి!
చివరికి భారత్ లో తయారయ్యే సౌందర్య ఉత్పత్తులు కూడా దుబాయ్ నుండి దిగుమతి చేసుకొని 100 రూపాయల ఇమామి ఫేస్ క్రీమ్ ని 250 కి కొనుక్కుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు!
1950 నుండి అమెరికా ఇచ్చే సహాయం మీదనే పాకిస్థాన్ 2018 వరకూ నెట్టుకొచ్చింది! 2018 లో ట్రంప్ సహాయం ఆపగానే అసలు స్వరూపం బయటపడ్డది!
PoK, సింధ్, బాలూచిస్తాన్ ప్రావిన్స్ లు ఎప్పటికైనా పాకిస్థాన్ నుండి వేరు పడేవే! ఆపడం కష్టం! తనని తాను పోషించుకోలేని దేశం పక్క దేశాల ప్రాంతాలని కలుపుకోవాలని చూస్తే ఇలానే జరుగుతుంది!
బాలూచిస్తాన్ ఇరాన్ తో సరిహద్దు కలిగి ఉండడం వలన చైనా చేతిలోకి అమెరికా వెళ్లనివ్వదు! CIA మద్దతు లేనిదే BLA ఇంత ఘోరంగా దాడి చేయలేదు! ఇంటెలిజెన్స్ సమాచారం CIA ఇచ్చి ఉండవచ్చు లేకపోతే ISI అధికారులు రైల్లో ప్రయాణిస్తున్నట్లు BLA కి ముందే ఎలా తెలిసి హైజాక్ చేయగలుగుతుంది?
BLA కనుక ముందు ముందు దాడులు తీవ్రతరం చేసింది అంటే అది CIA సహకారంతోటే! 40 ఏళ్ళు వెనక్కి వెళితే CIA బాగ్దాద్ లో ఆఫీసు ఓపెన్ చేసి, ఇరాన్ కి వ్యతిరేకంగా ఇరాక్ ని రెచ్చగొట్టి, 8 ఏళ్ళు ఇరాన్ ఇరాక్ (1980- 1988) ల మధ్య యుద్ధం జరిగేలా చేసింది! ఇరాక్ కి కావాల్సిన ఆయుధాలు ఇచ్చింది అమెరికా!
ఈరోజున ఇరాక్ పరిస్థితి ఏమిటీ? బాలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడితేనే అమెరికాకి లాభం! తన మిలిటరీ బేస్ పెట్టుకోవడానికి బాలూచ్ నాయకులు అనుమతి ఇస్తామని మాట ఇచ్చివుంటారు ఈపాటికే!
భారత్ కి వచ్చేది లేదు పోయేది లేదు! పాకిస్థాన్ నాయకులు భారత్ ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నంత వరకూ నష్టపొతూనే ఉంటుంది!
Share this Article