దక్షిణాది సినిమా వెలిగిపోతోంది శీర్షికతో కొన్ని కథనాలు కనిపించాయి… మనకు స్థూలంగా అనిపించేదీ, కనిపించే దృశ్యమూ అదే… కానీ నిజమేనా..? ఇక దక్షిణాది సినిమాకు తిరుగు లేదా..? హిందీ సినిమాను ఇంకా తొక్కేసి, ఆధిపత్యం సాధిస్తుందా..? ఈ ప్రశ్నకు సమాధానం… కాదు..! కారణం సింపుల్… హిందీ సినిమా ఇప్పుడు కరెక్షన్ స్టేజులో ఉంది… బాలీవుడ్ అంత తేలికగా వదలదు… సౌత్ సినిమాలో ఉన్నదేమిటి..? హిందీ సినిమాలో లేదేమిటి అనే చర్చ ఇప్పటికే స్టార్టయింది…
సల్మాన్ సినిమా ఫ్లాపయినా, అంతకుముందు షారూక్ పఠాన్ బాగానే వసూలు చేసింది… అక్షయ్ ఇంకా పట్టాలెక్కలేదు గానీ అజయ్ దేవగణ్ బండి స్పీడందుకుంది… తూ ఝూటీ మై మక్కర్ 200 కోట్లకు పైగా వసూలు చేసింది… మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే కూడా హిట్… మెల్లిమెల్లిగా బాలీవుడ్ గాడిన పడుతోంది…
మరోవైపు చాలా సౌత్ సినిమాలు పాన్ ఇండియా వాతలు పెట్టుకుని చతికిలపడ్డాయి… సో, సౌత్ సినిమా బాలీవుడ్‌పై ఆధిపత్యం కొనసాగిస్తుందనేది కేవలం ఆశావాదంగానే భావించాలి… అన్నింటికీ మించి హిందీలో భిన్నమైన కథలతో, మంచి ట్రీట్‌మెంట్‌తో సినిమాలు స్టార్టయితే… సౌత్ నుంచి డబ్బింగుతో హిందీలోకి వచ్చే సినిమాలకు ఆదరణ తగ్గడం గ్యారంటీ… ఎందుకంటే… బేసిక్‌గానే నార్త్ ప్రేక్షకులకు సౌత్ హీరోలు నచ్చరు… అసలు సౌత్ వాసనే వాళ్లకు పడదు… పేరుకు సౌత్‌లో థియేటర్ల సంఖ్య ఎక్కువే అయినా, నార్త్ ఇతర ప్రాంతాల్లో హిందీ స్టార్స్, సినిమాలకే రీచ్ ఎక్కువ…
Ads
సీఐఐ 2023 సంవత్సరానికి ఓ అంచనా వేసింది… మొత్తం ఇండియన్ సినిమా ఈ సంవత్సరం చేయబోయే వ్యాపారంలో 52 శాతం సౌత్ సినిమాయే వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసింది కానీ సౌత్‌లో భాషలవారీగా కొన్ని అంచనాలు వేసింది… అదే నిజం కావాలని ఏమీ లేదు… కాకపోతే సత్యసమీపంగా ఉన్నయ్ ఆ అంచనాలు… ప్రత్యేకించి కన్నడ సినిమా ప్రస్తుతం వాపు దశలో ఉంది గానీ అదేమీ బలుపు కాదని తేల్చింది… అదీ ఇంట్రస్టింగ్…
2022లో 1570 కోట్ల వ్యాపారం చేసిన కన్నడ సినిమా 2023లో 47 శాతం, అంటే సగం క్షీణించి 825 కోట్లతో ముగియవచ్చునని అంచనా… కేజీఎఫ్, చార్లి, కాంతారా మళ్లీ మళ్లీ రిపీట్ కావు కదా… నిజానికి కన్నడ సినిమా స్టామినాను సీఐఐ సరిగ్గానే గణించినట్టు చెప్పుకోవచ్చు… స్థూలంగా సౌత్ సినిమా వ్యాపారం యథాతథంగా ఉండవచ్చునంటోంది… అదే జరిగినా గ్రేటే… అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే సౌత్ సినిమా 96 శాతం వృద్ధిని కనబరిచింది… మరి అదే జోష్ కొనసాగింపు ఎలా సాధ్యం..?
కన్నడ సినిమా సగానికి క్షీణిస్తే, సౌత్ సినిమా యాజిటీజ్ పొజిషన్ ఎలా మెయింటెయిన్ చేయగలదు అనేది ఈ ప్రశ్న… సౌత్ సినిమాలో ఎక్కువ వ్యాపాారం సాగించే తమిళ, తెలుగు సినిమాల్లో గ్రోత్ ఉంటుందని, మలయాళ సినిమా పరిమాణం తక్కువే అయినా, అదీ వృద్ధిని చూపిస్తుందని సీఐఐ అంచనా వేసింది… రాబోయే ప్రభాస్ సినిమాలు ఈ మొత్తం అంచనాలను అటూఇటూ చేయవచ్చు కూడా… సాలార్, పుష్ప-2, కాంతార-2 వంటి సినిమాలు ఎలా ఆడతాయో చూడాల్సి ఉంది…
ఆదిపురుష్, పొన్నియిన్ సెల్వన్ మీద కూడా అందరి కళ్లూ ఉన్నాయి… తెలుగు సినిమా విషయానికొస్తే రాజమౌళి సినిమా ఇప్పట్లో లేదు… కార్తికేయ వంటి విజయాలు చాలా అరుదు… పుష్ప-2 ఫస్ట్ పార్ట్‌కు దీటుగా వస్తుందా లేదా వేచిచూడాలి… బలగం సూపర్ హిట్ అయినా దాని వ్యాపార పరిమాణం 20 కోట్లు మాత్రమే… రంగమార్తాండ, శాకుంతలం వంటివి కొట్టుకుపోయాయి… సో, స్థూలంగా చూస్తే తెలుగు సినిమా రేంజ్ 2022 లాగే ఉంటుందని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం… ఎటొచ్చీ సీఐఐ వంటి ఆర్గనైజేషన్లు కూడా సినిమా ఇండస్ట్రీ గమనం మీద సమీక్ష, అంచనాలకు దిగడం మాత్రం ఆసక్తికరం…!
Share this Article