పనికిమాలిన పిచ్చి సినిమా వార్తల్ని, గాసిప్స్‌ను, ఇంటర్వ్యూలను రోజూ పేజీల కొద్దీ పత్రికల్లో, గంటలకొద్దీ టీవీల్లో… అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఊదరగొట్టే జర్నలిస్టులు (?) ఓ తార చేసే మంచి పనిని హైలైట్ చేయలేకపోయాయి… మంచు లక్ష్మి… మోహన్‌బాబు బిడ్డ… చిత్రమైన పోకడలతో, మాటలతో, అహంతో ఆ కుటుంబంలోని ముగ్గురు హీరోలు బదనాం అవుతూ ఉంటారు… లక్ష్మి తెలుగు మాట్లాడే తీరు మీద వచ్చినన్ని విమర్శలు, చెణుకులు, వెక్కిరింతలు బహుశా ఏ తార మీద వచ్చి ఉండవు…
ఇదంతా నాణేనికి ఒకవైపు… కానీ లక్ష్మి తన ఉదార హృదయంతో సొసైటీకి తనకు చేతనైనంత మంచి చేద్దామని అనుకుంటుంది… యాదాద్రి జిల్లాలో 56 స్కూళ్లను ఆల్‌రెడీ దత్తత తీసుకుంది… ఇప్పుడు గద్వాల జిల్లాలో 36 స్కూళ్లను కూడా దత్తత తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది… పిల్లికి బిచ్చం పెట్టని, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని తత్వాలు ఇండస్ట్రీలో… కోట్లకుకోట్లు, కొందరైతే 50-100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నా రూపాయి కూడా సొసైటీకి తిరిగి ఇవ్వరు… హీరోలయితే మరీ దరిద్రం…
కరెన్సీ నోటు మాత్రమే ఇండస్ట్రీని శాసిస్తుంది… పైగా నీతులు, హిపోక్రసీ, సినిమాల్లో ఆదర్శాలు… బయట ఫ్యాన్స్‌తో దేవుళ్లుగా నీరాజనాలు… వీళ్లది ఓ చిత్రమైన జాతి… ఈ నేపథ్యంలో ఒక తార సొసైటీకి ఏదైనా మంచి చేద్దామనే భావనతో కదులుతుంటే, మీడియా నుంచి పెద్ద ప్రోత్సాహం, కవరేజీ లేకపోవడం బాగోలేదు… మెయిన్ స్ట్రీమ్ పెద్దగా పట్టించుకోలేదు… ఎంతసేపూ ఆ దిక్కుమాలిన పొలిటికల్ వార్తలు మినహా మీడియాకు మరేమీ పట్టడం లేదు… కాస్తోకూస్తో వెబ్‌సైట్లు మాత్రమే ఈ వార్తను కవర్ చేశాయి…
Ads
ప్రకాష్‌రాజ్ ఏదో ఊరిని దత్తత తీసుకున్నాడు… ప్రచారం జరిగింది… కానీ అక్కడ తను ఉద్దరించిందేమిటనేది మీడియా ఫోకస్ చేయదు… వితరణ అనే పదం వినగానే మహేష్ బాబు, లారెన్స్‌ల గుండె ఆపరేషన్లు మాత్రమే గుర్తొస్తాయి… వాళ్లిద్దరేనా ‘రియల్ హీరోలు’… మరి మిగతా వాళ్లు..? మొన్నటి విలయ కరోనా నేపథ్యంలో తమ ఔదార్యాన్ని చాటుకున్నవాళ్లెంత మంది..? హిందీలో అక్షయ్, సోనూ సూద్, కన్నడ ప్రణిత వంటి కొందరే… మిగతావాళ్లంతా ఇళ్లల్లో పెసరట్లు, ఆమ్లెట్లు వేసుకుంటూ ఫోటోలు దిగితే మన మీడియా అపురూపంగా అచ్చేసి మురిసిపోయింది…
ఇదీ స్థితి… మంచు లక్ష్మి స్కూళ్ల దత్తత అంటే కేవలం డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ బోధన వరకేనా..? ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకూ సహకరిస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు… ఒకటి అభినందనీయం… ఆమె సొంతంగా చేయదు, ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకుంటుంది… గద్వాల జిల్లాలో స్కూళ్ల దత్తత విషయలో కూడా కలెక్టర్ క్రాంతితో అగ్రిమెంట్ కుదుర్చుకుంది… అవసరం… ఎవరూ పట్టించుకోకుండా నానాటికీ మనుగడే కష్టమవుతున్న ప్రభుత్వ విద్యకు కొత్త జవజీవాలు అవసరం… ఏపీలో అది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది… తెలంగాణలో మాత్రం సర్కారుకు స్కూళ్లు, విద్య పట్టదు… దాని విలువ కూడా తెలియదు…
లక్ష్మిప్రసన్న అడ్డగోలుగా సంపాదించే పాపులర్ నటి ఏమీ కాదు… తండ్రి దగ్గర బోలెడు డబ్బు ఉండవచ్చుగాక… ఓ తమ్ముడికి పెళ్లి ద్వారా వందల కోట్ల ఆస్తి సమకూరవచ్చుగాక… అదంతా లక్ష్మి డబ్బు కాదు… అందుకని మంచు లక్ష్మి సంకల్పాన్ని, ప్రయత్నాన్ని అభినందించాలి… రాంచరణ్, ఉపాసనలకు బిడ్డ పుడితే ప్రపంచంలోనే అరుదైన విశేషంగా టాంటాం చేసిన మీడియా దరిద్రానికి మంచు లక్ష్మి మంచి అడుగు మాత్రం కనిపించకపోవడం ‘‘మీడియా దరిద్రమే’’…
Share this Article