నాకు హీరో మహేశ్ బాబు అంటే కొంత ఇష్టం… తన హీరోయిజం కాదు, ఎక్కడా పిచ్చి ప్రేలాపనలకు పోడు, తన పనేదో తనది, పాలిటిక్స్‌కు దూరం… పిల్లలకు గుండె ఆపరేషన్లు గట్రా ఉదారంగా చేయిస్తుంటాడు… కొన్ని పాత్రలు తను చేసినట్టుగా ఇతర హీరోలు చేయలేరు… స్టామినా, లుక్, ఫిజిక్కు భలే మెయింటెయిన్ చేస్తాడు… సగటు ఆడపిల్లలకు కలల హీరో తను… కానీ తన ఫ్యాన్స్..?
నిజానికి తను ఇతర హీరోల్లాగా పిచ్చి ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయడు, కానీ పుట్టుకొస్తూనే ఉన్నారు… వెగటుతనం జీర్ణించుకున్న ఫ్యాన్స్… ఇలాంటోళ్లే ఏ హీరోకైనా ప్లస్ కాదు, పెద్ద మైనస్… అభిమానం వేరు, పైత్యం వేరు… ఆ తేడా తెలిసిన అభిమానులున్న హీరోలు అదృష్టవంతులు… ముందుగా మిత్రుడు జాన్ కోరా రాసిన ఓ పోస్టు చదవండి…
సినిమా హీరోలు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సహజం… కానీ అభిమానం పిచ్చిగా మారితే కష్టం… వాళ్లకు కనీసం ఎర్రగడ్డలో చికిత్స అందించినా మారరు… గతంలో ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ… సినిమాల్లో పవన్ కల్యాణ్, క్రికెట్‌లో సచిన్ వచ్చిన దగ్గర నుంచి పిచ్చి ఫ్యాన్స్ తయారయ్యారు… మహేష్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ధోనీ, కోహ్లీ, రోహిత్ వచ్చాక వర్గాలుగా విడిపోయి తిట్టుకోవడం… కొట్టుకోవడం దాకా వెళ్లారు…
Ads
ఇలా కొట్టుకునే ఫ్యాన్స్‌ను వ్యక్తిగతంగా గమనిస్తే… దళిత, వెనుకబడిన కులాల వాళ్లే ఎక్కువగా ఉంటారు… ఈ మధ్య సినిమాలకు రాజకీయ అభిమానం కూడా తోడైంది… వాళ్లను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు…
అమ్మా అయ్యా కష్టార్జితంపై ఆధారపడుతూ… లేదంటే కూలీ, చిన్న ఉద్యోగాల్లో సంపాదనను ఖర్చు పెడుతూ… ఒక హీరోకి అభిమానిని అని నలుగురి ముందు పేరు తెచ్చుకోవడానికి ఫ్లెక్సీలు వేస్తూ… కుటుంబాన్ని పట్టించుకోని వాళ్లే ఎక్కువుంటారు…
చదువు మధ్యలో ఆపేసి… గాలి తిరుగుళ్లు తిరిగే సన్నాసులే… ఇలా రోడ్లపై అభిమానాన్ని చాటుతుంటారు… వెంకటాద్రి థియేటర్లో జల్సా సినిమా వంద రోజులు ఆడాలనే కసితో చివరి 15 రోజులు మ్యాట్నీ, సెకెండ్ షోలకి టికెట్లు కొని ఫ్రెండ్స్‌ను, హాస్టల్ మేట్స్‌ను, తెలిసిన వాళ్లను తీసుకెళ్లిన ఫ్రెండ్ నాకు తెలుసు… ఇందుకోసం అప్పులు కూడా చేసి, మస్తు తిప్పలు పడ్డాడు…
చదువును నాశనం చేసుకొని అభిమానం ( సిన్మా అయినా, రాజకీయం అయినా) అంటూ తిరిగితే… చివరకు థియేటర్లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ కూడా రాదు… వచ్చినా.. నువ్వు చెయ్యవు… ఎందుకంటే జీవితంలో స్థిరపడిన నీ స్నేహితులు కుటుంబంతో సిన్మాకు వస్తే…. నువ్వు వాడి కారుకో, బైక్‌కో కాపలాగా ఉండాలి… అది నీకు నామోషీ…
పైన ఫ్లెక్సీ చూశాక రాయాలని అనిపించింది… (బూతులు, కావాలనే బ్లర్ చేశాను)… నేనూ చదువుకునే రోజుల్లో పవన్ కల్యాణ్, తర్వాత ధోనీ, కోహ్లీ, ప్రస్తుతం రాహుల్ గాంధీ, జగన్ అభిమానినే… కానీ ఎవరికీ ఫ్లెక్సీలు కట్టలేదు… ఎవరి కోసం ఉచితంగా పని చేయలేదు… చేయబోను…
ఇది ఎక్కడిదో తెలియదు, నిజమైందో క్రియేషనో తెలియదు… కానీ ఏమిటిది..? ఎటు వెళ్తున్నాం మనం..? దీన్ని అభిమానం అందామా.,.? మహేశ్ బాబు కూడా ఈ ధోరణులను అంగీకరిస్తాడని నేను అనుకోను, తనది రాయల్ నేచర్.,. ఎటొచ్చీ సగటు మహేశ్ అభిమానిగా ఎలా ఉండాలో మరిచిపోవడం ఇది…
ఇక వేరే విషయానికి వద్దాం… తమిళనాడు తరువాత మనమే… హీరో ఎవరైనా సరే, సినిమా అంటేనే మనకు ఓ సెలబ్రేషన్… మురారి సినిమా ఓ పదివేల సార్లు వేసి ఉంటారు టీవీల్లో…. బహుశా అది చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు… సూపర్ హిట్… ఇప్పుడు రీరిలీజ్ చేస్తే 10 కోట్లు మినిమం కలెక్షన్స్ అట… అంటే, మనం సినిమాను అంతగా ప్రేమిస్తాం… మళ్లీ మళ్లీ చూస్తాం, వోకే, సెలబ్రేషన్స్ వరకూ వోకే… ఎంజాయ్ చేయడం వరకూ వోకే… ఎటొచ్చీ, ఇదుగో, పైన చెప్పిన ఉదాహరణలే కలుక్కుమనిపిస్తుంటాయి..!!
Share this Article