Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎనిమిదేళ్ల క్రితమే వంశీ ఆ చెట్టు గురించి కలతపడి… ఇప్పుడేమో కంటతడి…

August 13, 2024 by M S R

కొవ్వూరు… గోదావరి తీరం… ఒక సినిమా చెట్టు… వయస్సు 150 ఏళ్లు… కుమారదేవం చెట్టు అంటారు… రెండుమూడొందల తెలుగు సినిమాల షూటింగులకు ఆ చెట్టుతో అనుబంధం ఉంది… ఈమధ్య కూలింది… బోలెడు వార్తలు రాశారు… ఒక చారిత్రిక వృక్షం నేలకూలిపోయింది అనే తరహాలో కథనాలు…

నిజానికి గోదావరి వంటి ప్రవాహగతి రువ్వడిగా ఉండే నదీతీరాల్లోని చెట్లకు ఎప్పుడూ ఈ ప్రమాదం ఉన్నదే… ఐతే దీని వయస్సు ఎక్కువ, వేళ్లు చాలాదూరం వరకూ విస్తరించాయి… ఇన్నేళ్లు నిలదొక్కుకుంది… విశేషమే… దాన్ని ప్రేమించే మనుషులు దాన్ని బతికించే ప్రణాళికలు వేస్తున్నారు… శింగలూరి తాతబ్బాయి అనే ప్రకృతి ప్రేమికుడు నాటిన నిద్ర గన్నేరు మొక్క అది…

అన్నీ అనుకున్నట్టు జరిగితే చెట్టు మళ్లీ బతుకుతుంది… రోగిష్టిలా మారి కనుమరుగు ప్రమాదంలో పడిన వందలేళ్ల పిల్లలమర్రినే తెలంగాణ అటవీశాఖ అరుదైన వైద్యంతో బతికించింది… మరి ఈ నిద్రగన్నేరును ఏం చేయాలి..? నిపుణులు ‘కెమికల్‌ ట్రీట్‌మెంట్‌’ ప్రణాళిక అమలు చేస్తారు… ముందుగా చెట్టు కొమ్మలను తొలగిస్తారు… చెట్టు వేరుకు రసాయనాలు పంపించి, శాస్త్రీయ విధానంలో నిలబెడతారు… సుమారు 100 టన్నుల బరువు ఉన్న ఈ చెట్టును పూర్వ స్థితికి తెచ్చేందుకు నెల నుంచి 45 రోజుల వరకు సమయం పడుతుంది…

Ads

అక్కడికి వెళ్లిన దర్శకుడు వంశీ ఉద్వేగానికి గురయ్యాడు… దాదాపు తన ప్రతి సినిమాకూ ఆ చెట్టుతో బంధం ఉంది… తాను తీసిన మంచుపల్లకి, సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరితో పాటు దాదాపు 18 సినిమాలను కుమారదేవం సినిమా చెట్టు కింద తీసినట్లు వంశీ చెబుతున్నాడు… నిజానికి తను మరిచిపోయాడేమో గానీ 2016లోనే… అంటే ఎనిమిదేళ్ల క్రితమే ఇదేదో జరుగుతుందని సందేహించాడు, కలత చెందాడు… అప్పట్లో తను ఫేస్‌బుక్‌లో తన ఫీలింగ్ షేర్ చేసుకున్నాడు… అది యథాతథంగా ఇలా…

cinema chettu


గోదావరిలో బాసర , భద్రాచలం నుంచి అంతర్వేది దాకా ప్రయాణాలు చేసిన నాకు నచ్చిన ప్రదేశాల్లో కుమారదేవం రేవులో వున్న ఈ నిద్ర గన్నేరు చెట్టు ఒకటి. ఈ చెట్టుతో నా పరిచయం ఈనాటిది కాదు. గోదావరి మీద నేను రాసిన చాలా కధల్లో ఈ చెట్టు ఉంటుంది. 1986 లో నేను రాసిన ‘’గోకులంలో రాధ’’ నవల ఫస్టాఫ్ ఈ చెట్టు కిందా, దీని దిగువలో వున్న కుమారదేవం గ్రామంలోనూ నడుస్తుంది.

నేను డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో ఈ చెట్టు కనిపిస్తుంది. ఈమధ్య కాలంలో దీని కింద గడిపిన అనుభవం….. గోదావరిని మా గొప్పగా ప్రేమించే నా మిత్రుడు , శ్రేయోభిలాషి విజయబాబు , పోయిన మార్చిలో ఓ మధ్యాన్నం భోజనం ఏర్పాటు చేసాడిక్కడ. అప్పుడు కొన్ని గంటలు గడిపాం. నా సొంత గోల పక్కన పెట్టి దీని కధలోకొస్తే…

చిన్న మొక్కగా ఉన్నప్పుడు దీన్ని గోదారి తల్లి ఒడ్డున పాతిన మహానుభావుడు సింగలూరి తాతబ్బాయి గారు. ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ, తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని ‘’సినేమా చెట్టు’’.అని పిలుస్తారిక్కడి జనాలు. దీని కింద పాడిపంటలు , దేవత , వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు ఇలా లెక్కెట్టు కుంటా పొతే మొత్తం నూటెనిమిది సినిమాల షూటింగ్ జరిగింది .

కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది . అంత మహత్యం ఈ చెట్టుది . ఇంకో విషయం . ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సిన్మా సూపర్ హిట్టు అన్న సెంటిమెంటు కూడా వుంది . ఐతే…. ఇన్నేళ్ళు ఇన్ని ఆటుపోట్లకి తట్టుకున్న ఈ చెట్టు (ప్రధానమైన) కొమ్మలు మొన్నామధ్య వచ్చిన గాలివానకి టపటప మంటా విరిగిపోడంతో బోడిదయి పోయింది.

ఫోన్ చేసిన మిత్రుడు త్రినాద్ ’’ ఇలాగయ్యింది ఫోటోలు తీసి పంపామంటారా ‘’ అంటే ‘’వద్దులే త్రినాదు’’అన్నాను . ఎందుకంటే దాన్నలాగ చూడ్డం ఇష్టం లేదు నాకు . పొతే …. తొందర్లో ఈ చెట్టు కూలి నేలమట్టం కావచ్చు… గోదాట్లో కొట్టుకు పోవచ్చు . చెప్పలేం. ఎందుకంటే ఈ చెట్టు చాలా ముసల్ది . దీని వయస్సు 144 సంవత్సరాలు…



సినిమా(చెట్టును బతికించే పనులు మొదలయ్యాయి)

ఆ కొమ్మలు విరిగిన బోడి చెట్టును ఫోటోల్లో చూడటానికే ఇష్టపడని వంశీ… మొత్తం కూలిపోయాక, అక్కడికి వెళ్లి, దాన్ని చూసి లోలోపల ఎంత భోరుమన్నాడో అర్థం చేసుకోవచ్చు… కొందరికి ప్రకృతి బిడ్డలతో అలా ఏదో ఓ ఉద్వేగబంధం అలుముకుంటుంది… ఆ పాత వంశీ బాధను, ఇప్పటి బాధను చెప్పడమే ఈ కథన ఉద్దేశం… నాటి ఆయన పోస్టు లింక్ ఇదీ…  https://www.facebook.com/DirectorVamsy/posts/pfbid03reDPv6zLppWCsMFkoXakRthmNJF7pXEYoqjuNLYBhiH8Q8hXe4SejURjUT1GnkNl

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions