జీవితంలాగే సినిమా ఇండస్ట్రీ… ఎప్పుడు ఎవరు వెలిగిపోతారో, ఎప్పుడు ఎవరు మసకబారతారో చెప్పడం కష్టం… నీలకంఠ అనే దర్శకుడు గుర్తున్నాడా..? ఇరవై ఏళ్ల క్రితం షో అనే ఓ చిన్న సినిమాతో వెలుగులోకి వచ్చాడు… రెండు జాతీయ అవార్డులతో మనకొక మంచి దర్శకుడు వచ్చాడు అనే పేరు సంపాదించుకున్నాడు… ప్రత్యేకించి స్క్రీన్ ప్లే రచనలో భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని చూపించాడు…
తరువాత మిస్సమ్మ అనే మరో సినిమా వచ్చినట్టు గుర్తు… భూమిక పాత్ర బాగుంటుంది అందులో… తరువాత ఇంకొన్ని సినిమాలేవో చేసినట్టున్నాడు… అవేవీ గుర్తులేవు… ఏవీ కమర్షియల్ సక్సెస్ కూడా కాలేదు… క్రమేపీ నీలకంఠ పేరును అందరూ మరిచిపోయారు… చాలా చాలా విరామం తరువాత మళ్లీ సర్కిల్ అనే సినిమా ద్వారా వెలుగులోకి వచ్చాడు…
సినిమా చూస్తుంటే నీలకంఠ మీద జాలేసింది… తనను దర్శకుడిగా ఎంచుకున్న నిర్మాతల మీద సైతం… సరే, నటుల విషయానికి వస్తే సాయిరోనక్, రిచా పనయ్ తదితరులు చిన్న నటులే కాబట్టి పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు… టీవీల్లో షోలు చేసుకునే డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు… ఫాఫం, ఏదో కష్టపడ్డాడు గానీ పాత్ర పెద్ద ఇంప్రెసివ్‌గా లేక ఆయన కష్టం వృథా అయిపోయింది…
Ads
ఎవరు ఎప్పుడు శతృవులు అవుతారో… ఇదీ సర్కిల్ సినిమా కేప్షన్… వావ్, బాగుంది, నీలకంఠ మళ్లీ రంగంలోకి దిగాడు అంటే ఏదైనా పకడ్బందీ స్క్రిప్టుతో వచ్చాడేమో అనుకుంటాం కదా… అబ్బే, మీ నమ్మకాలు, అంచనాలు వేస్ట్, నేను మారలేదు అని చెబుతున్నట్టుగా ఉంది ఆయన దర్శకత్వం…
సాయి రోనక్ ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. మద్యానికి బానిసయిపోయిన అతణ్ని బాబా భాస్కర్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ కొట్టి బంధిస్తాడు. ఒరేయ్, నిన్ను చంపడానికి సుపారీ తీసుకున్నానురా అని చెబుతాడు… చంపాల్సినోడు, చంపమన్నాడో ఓ రాజీకి వస్తే వదిలేస్తా అంటాడు… పోనీ, నిన్నెవరు చంపమన్నారో ఊహించమంటాడు… తన మూడు బ్రేకప్ అమ్మాయిల్లో ఎవరో ఒకరు ఈ పనికి ఉసిగొల్పి ఉంటారని అనుకుంటాడు హీరో… తన ప్రేమ కథలను చెబుతుంటాడు…
ఏదో ఓ క్లైమాక్స్ ట్విస్టు బాగుందనుకుని, మిగతా సినిమా అంతా భరించేంత ఓపిక ప్రస్తుతం ప్రేక్షకుల్లో లేదు… ఫస్ట్ నుంచీ థ్రిల్ చేయాల్సిందే… ఈ సినిమాలో అది లోపించింది… ఆ మూడు ప్రేమ కథలు బోరింగ్… అవీ స్పీడ్‌గా నడిస్తే కాస్త బాగుండేదేమో… ఒరేయ్, నిన్ను చంపాలని నాకు సుపారీ ఎవరిచ్చారో గెస్ చేయి అని విలన్ హీరోను అడిగే వరకు ఇంటరెస్టింగ్… ఎప్పుడైతే ప్రేమ కథలు, లవ్ ట్రాకులు మొదలయ్యాయో సినిమా బోర్ బాట పట్టింది…
పోనీ, చివరలో ఇచ్చిన ట్విస్టయినా లాజిక్‌తో ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ లేదు… ఉత్కంఠ రేపే కథనం లేకపోతే థ్రిల్లర్ సినిమాకు అర్థం లేదు… ఈ సినిమాలో లోపించింది అదే… ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది… వాళ్లకు కథను కొత్తగా చెప్పాలి, వేగంగా చెప్పాలి… నత్తనడక నడిస్తే ఫోఫోవయ్యా అంటారు…
నిజానికి సినిమా కథ, కథనం సరిగ్గా లేవు గానీ లీడ్ రోల్ చేసిన సాయి రోనక్ బాగానే చేశాడు… బాబా భాస్కర్, రిచా పనయ్ పెద్దగా ప్రభావం చూపించేలా నటించలేదు… అసలు బాబా భాస్కర్ నెగెటివ్ రోల్‌కు సూట్ కాలేదు… ఇలాంటి సినిమాల్లో పాటల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు… కానీ మంచి బీజీఎం ఆశిస్తారు ప్రేక్షకులు… అదీ సోసో… ఇప్పుడున్న కట్ థ్రోట్ కంపిటీషన్‌లో నీలకంఠకు మళ్లీ ఇంకొక చాన్స్ వస్తుందా..? కష్టం..!! సినిమా రివ్యూయర్లు కూడా ఈ సినిమా ఒకటి వచ్చిందని కూడా గుర్తించలేదు పాపం…
Share this Article