Jyothi Valaboju…. ఆరాధన… అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లకు చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని ఒకటవుతారు. కాని అనుకోకుండా పైలట్ ఐన ఆ అబ్బాయి యుద్ధంలో మరణిస్తాడు. ఆ అమ్మాయిని అత్తగారింట్లో తమ కోడలిగా అంగీకరించరు. తనకు పుట్టిన బిడ్డను దత్తుకు ఇచ్చి అక్కడే ఆయాగా చేరుతుంది. ఒకానొక పరిస్థితిలో హత్యానేరంపై ఆ అమ్మాయి జైలు పాలవుతుంది. కొన్నేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యాక జైలర్ ఇంట్లో ఆయాగా చేరుతుంది. ఆ జైలర్ కూతురు, ఆమె కొడుకు ప్రేమించుకుంటారు. ఇదీ కధ.. ఇంతవరకు చెప్పింది కథ కాదంటారా? ఎక్కడో విన్నట్టు , చూసినట్టుగా అనిపిస్తుందా? ఏ సినిమానో గుర్తొచ్చిందా? భారతదేశాన్ని ఊపేసిన హిట్ చిత్రం “ఆరాధన”
ప్రేమ, ప్రీమెరైటల్ సంభోగాలు, దేశభక్తి, పుత్రప్రేమ, నీలాపనిందలు వెరసి ఒక అందమైన చిత్రంగా మలచారు శక్తి సామంత. వందన (షర్మిల టాగూర్), భారత సైన్యంలో పైలట్ గా పనిచేస్తున్న అరుణ్ (రాజేశ్ ఖన్నా) ప్రేమించుకుంటారు. ఒక వర్షం కురిసిన రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. ఆ తర్వాత గుళ్లో పెళ్లి చేసుకుంటారు. పెద్దలను కలుద్దామని అనుకుంటుండగానే పైలట్ ఐన అరుణ్ యుద్ధంలో చనిపోతాడు. గర్భవతియైన వందన అత్తగారింటికి వెళ్లినా వాళ్లు తమకు వీళ్ల పెళ్లి గురించి తెలీదు అని ఆమెను తమ కోడలిగా అంగీకరించరు.
ఎలాగో కాలం గడుపుతూ ఒక మగబిడ్డను ప్రసవించి అనాధాశ్రమంలో వదిలేస్తుంది. తర్వాత వెళ్లి చూస్తే ఆ అబ్బాయిని ఎవరో దత్తు తీసుకుంటారు. వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిన వందన ఆ ఇంట్లోనే తన కొడుక్కు ఆయాగా చేరుతుంది. ఆ ఇంటి యజమాని బందువు వందనపై అత్యాచారం చేయబోగా వందన కొడుకు సూరజ్ అతన్ని చంపేస్తాడు. వందన ఆ నేరం తన మీద వేసుకుని జైలు కెళ్తుంది. శిక్ష పూర్తయ్యాక తనను ఆదరించిన జైలర్ ఇంట్లో అతని కూతురుని చూసుకోవడానికి ఆయాగా పనిలో చేరుతుంది వందన. ఆ అమ్మాయి వందన కొడుకు సూరజ్ ని ప్రేమిస్తుంది. సినిమా అంతంలో వందన నిజాన్ని అందరికీ చెప్తుంది. కథ సుఖాంతమవుతుంది. ఇదీ సినిమా అసలు కథ..
1969లో విడుదలైన ఆరాధన హిందీ సినిమా రంగంలో ఒక సంచలనం సృష్టించింది. చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఉన్న రాజేశ్ ఖన్నాని, కిశోర్ కుమార్‌ని రాత్రికి రాత్రే సూపర్ స్టార్స్ ని చేసింది. ఇది అక్షరాలా నిజమని ఇప్పటికీ అందరూ ఒప్పుకుంటారు. రాజేశ్ ఖన్నా కొత్తగా సినిమాల్లోకి వచ్చాడు. కాని హీరోయిన్‌గా చేసిన షర్మిలా టాగూర్ టాప్ పొజిషన్లో ఉంది. ఎటువంటి ఫైటింగులు, కామెడీ లేని ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. కథ , సంగీతం, నటన, దర్శకత్వం, పాటలు అన్నీ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చేసాయి.
ఈ సినిమాతోనే రాజేశ్ ఖన్నా తనకంటూ ఒక మేనరిజం క్రియేట్ చేసుకున్నాడు. అలాగే రఫీని దాటుకుని కిశోర్ కూడా తన పాటలతో అందరినీ మత్తులో పడేసాడు. డార్జిలింగ్ అందాలతో షర్మిలా సౌందర్యం పోటీ పడింది అంటే నేడు కూడా కాదనేవారెవరు. ఈ సినిమా విజయవంతం అయ్యాక ఈ జంట మరి కొన్ని సినిమాలలో కూడా అలరించారు. ” అమర్ ప్రేమ్, సఫర్, దాగ్, ఆవిష్కార్” మొదలైనవి.. టాప్ పొజిషన్లో ఉన్న షర్మిలను, ఇంకా హిందీ సినిమా రంగంలో నిలదొక్కుకోని చిన్న హీరోతో సినిమా తీయడమే ఒక సాహసమైతే ఆ అందాల భరిణను ముసలిదానిగా చూపించాడు శక్తి సామంత. ఐనా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
ఈ సినిమాలో ముఖ్యంగా అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది పాటలు. ఒక్కో పాట ఒక్కో అందమైన అద్భుతంగా మలిచారు. చుట్టూ పచ్చని దార్జిలింగ్ కొండల మధ్యనుండి వెళుతున్న రైలులో కిటికీ పక్కన కూర్చుని పుస్తకం చదువుతున్న షర్మిల . ఆ రైలు పక్కనే రోడ్డుమీద వెళ్తున్న జీపులో రాజేశ్ ఖన్నా తన కలల రాణికోసం పాడే “మేరే సప్నో కి రాణి కబ్ ఆయేగి తూ” కిటికీ పక్కన గాలికి కదులుతున్న ముంగురులను సర్దుకుంటూ హీరో పాటను తొంగి తొంగి చూస్తున్న హీరోయిన్, ఆది చూసి ఇంకా హుషారుగా పాడే హీరో. ఈ సీను సినిమా అభిమానులందరికీ గుర్తుంటుంది.
భోరున కురుస్తున్న వర్షం. ఉరుములు,మెరుపులు, ఏకాంతంలో వేడి పుట్టించే నెగడు.. తడిసిన జంట “రూప్ తెరా మస్తానా.. భూల్ కొయి హంసేనా హో జాయె” అని పాడుకుంటారు. ఈ పాట కుటుంబ సమేతంగా వచ్చినవారికి మాత్రం కొంచం ఇబ్బంది కలిగిస్తుంది కాని కుర్రకారుకి హుషారునిచ్చే పాట అనొచ్చు. ఇంకో అందమైన పాట ” గున్ గునారహె భవ్రె” రంగురంగుల పూలతోటలో, డార్జిలింగ్ అందాలతో ఊయలలూగిస్తుంది.
కొండలలో మారుమ్రోగే పాట “కోరా కాగజ్ థా యెహ్ మన్ మెరా” .. కొడుకు రాజేశ్ ఖన్నా, ఫరీదా జలాల్ ఒకరి మీద ఒకరు పొడుపులు వేసుకుంటూ పాడే “భాగోన్ మే బహార్ హై” ఇలా ఈ పాటలన్నీ వింటుంటే ప్రతి ఒక్కరికి ఈనాటి సినిమా పాటలు, రచయితలు, నిర్మాత, దర్శకుల మీద పీకల్దాకా కోపం వస్తుంది. అంత మధురమైన , మరచిపోలేని ఆహ్లాదకరమైన పాటలు అందించారు సంగీత దర్శకుడు బర్మన్.
ఇదే సినిమాను తెలుగులో శోభన్ బాబు, వాణిశ్రీలతో కన్నవారి కలలు గా నిర్మించారు కాని ఆరాధన అంత హిట్ కాలేదు. ఆరాధన సినిమాకి ఆంగ్ల మూల చిత్రం…1946 లో నిర్మించిన To each his own …
Share this Article