.
శబరిమల వెళ్లే భక్తులు పంబా నదిలో స్నానం చేసి, వేసుకున్న బట్టలను అక్కడే వదిలేస్తున్నారట. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ వ్యవహారంతో నదిలో బట్టల గుట్టలు పేరుకుపోతున్నాయి. నదీ ప్రవాహానికి ఆటంకం, పర్యావరణానికి ముప్పు, ప్రబలుతున్న వైరసులు అంటూ ఇప్పుడు కేరళలో పెద్ద చర్చే జరుగుతోంది.
అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి తెలుగు రాష్ట్రాల భక్తులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలట… భక్తులకు అవగాహన కల్పించాలట. ఈమేరకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేరళ ఉన్నతాధికారులు లేఖలు రాశారట…
Ads
కానీ, తెలుగు సీఎస్‌లు ఏం చేయగలరు పాపం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అధికారులు శబరిమలలో మైకులు పెట్టి ప్రచారం చేయాలా? అక్కడి భక్తుల బట్టలు లెక్కపెట్టాలా? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా ట్రక్కులు పెట్టి, నదిలో పడేసే బట్టల్ని తరలించాలా..? లేక జరిమానాలు విధించాలా..?

నిజానికి ఈ ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సింది ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు. భక్తులు వచ్చే ప్రాంతాల్లో, బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో, పంబా నది పరిసరాల్లో తెలుగులోనూ ప్రచారం చేయాలి. నదిలో బట్టలు వదలడం ఎలాంటి సంప్రదాయమూ కాదని ప్రవచనకారులతో చెప్పించాలి. భక్తుల నమ్మకాలను గౌరవిస్తూనే పర్యావరణ పరిరక్షణ గురించి వివరించాలి.
అవగాహనతో మారకపోతే బట్టలు సేకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అక్కడే డస్ట్‌బిన్లు, సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలి. నిజానికి ఈ దిశగా ఇప్పుడు కేరళలో ప్రయత్నాలు మొదలయ్యాయి. పాత బట్టలను సేకరించి ఇతర ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే ప్రణాళిక కూడా సిద్ధమైంది.
ఐనా, తెలుగు భక్తగణం ఎవరు చెప్పినా వినరు, తింటే అది తెలుగుతనమే కాదు… అటు గానుగాపూర్ నుంచి మొదలుపెట్టి అరుణాచలం, శబరి, కామాఖ్య, కాశి… పోలోమంటూ పోవడం, వీలైనంత ‘అతి’ ప్రవేశపెట్టడం… ఇక్కడ ఇంకో సందేహం. నదిలో బట్టలు వదిలేస్తే కేరళ అధికారగణం చెబుతున్నట్టు వైరస్‌లు వస్తాయా? ఏమో! వైరస్‌ల సంగతి పక్కనపెడితే, బట్టలు పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహం దెబ్బతింటుందని, జలచరాలకు ఇబ్బంది కలుగుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పుణ్యం కోసం నదిలో స్నానం చేసి, ఆ నదినే చెత్తకుప్పగా మార్చడం ఏమిటో భక్తులకే తెలియాలి. నదిలో బట్టలు వదిలేస్తే పాపం పోతుందనే నమ్మకం ఉంటే, వాటిని అక్కడే వదిలేయకపోతే పుణ్యం తగ్గిపోతుందా? ఈమేరకు ప్రచారం చేసే గురువుల్ని మొదట ఐడెంటిఫై చేయాలి…
నదిని పవిత్రంగా భావించడమే భక్తి. ఆ నదిని అపరిశుభ్రం చేయడం ఏ రకమైన భక్తి?
Share this Article