.
రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యం అధికార యంత్రాంగాకి బాగా అలుసైపోయినట్టుంది… మనమేం చేసినా సరే, మనల్ని అడిగేవాడెవ్వడు అనే భావన బాగా పెరిగినట్టు కనిపిస్తోంది… చివరకు ప్రభుత్వం మీదే వెటకారాలు, విమర్శలు చేస్తున్నా సరే, నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ సోయీ లేకుండా పోయింది…
పర్‌ఫెక్ట్ ఉదాహరణ… స్మిత సబర్వాల్… సీనియర్ ఐఏఎస్ ఆమె… ఆమె వ్యవహారశైలి మీద ఉన్న వివాదాలు కాసేపు వదిలేస్తే… కంచ గచ్చిబౌలి వివాదం మీద ఎఐ ఫోటో ట్వీట్ చేసింది… లేదా ఎవరో పెట్టిన పోస్టును షేర్ చేసింది…
Ads
కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి లేదా తప్పుడు అవగాహనతో ఇలాంటి ఫోటోలు, వీడియోలను షేర్లు చేస్తున్న వాళ్లను గుర్తించి ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది… అది బీఆర్ఎస్ పెయిడ్ మాలిఫైడ్ క్యాంపెయిన్ అనేది ప్రభుత్వ వర్గాల వాదన… సరే, అది రాజకీయం, బీఆర్ఎస్ ఉధృతంగా సాగిస్తున్న ఇలాంటి క్యాంపెయిన్లను ఎలాగూ కాంగ్రెస్, ప్రభుత్వం ఏమాత్రం కౌంటర్ చేయలేని అసమర్థత, వైఫల్యం… అదంతా వేరే సంగతి…
స్మిత సబర్వాల్ ఓ సీనియర్ ఐఏఎస్, ఓ కీలక పోస్టులో ఉంది… ఆమె అలాంటి ఫోటోలు ఎలా షేర్ చేస్తుంది అసలు..? సర్వీస్ రూల్స్ మన్నూమశానం ఏవో ఏడుస్తాయి కదా… ఆమె తన ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి తెలిసీ రేవంత్ రెడ్డి ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం మీదే విమర్శలున్నాయి… ఇప్పుడామె ఏకంగా ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ పోస్టులు పెడుతుంది, ఎలాగో తెలుసా..?
ప్రభుత్వం తనకు నోటీసు పంపించింది… ఆ పోస్టు గురించి… నిజానికి ఇప్పటి ప్రభుత్వ గందరగోళ పాలనలో ఈ నోటీసు ఇవ్వడమే కాస్త విశేషం, అదే గ్రేటు… దానికి ఆమె మళ్లీ కౌంటర్ పోస్టు పెట్టింది… 2000 మంది ఆ ఫోటోలు షేర్ చేశారు, అందరికీ నోటీసులు ఇస్తారా అని..? ఖచ్చితంగా తలెగరేయడం, మీరేం చేయగలరో చూస్తాను అనే తెగింపు…
ఎఐ ఫోటోలు, వీడియోలతో కావాలని దుష్ప్రచారం జరుపుతున్నారని ప్రభుత్వమే సుప్రీంకోర్టులో వివరణలు ఇచ్చుకునే అవస్థల్లో ఉన్నప్పుడు… ప్రభుత్వంలో భాగమైన ఆమె పెడుతున్న పోస్టులు ఏం చెబుతున్నట్టు..?
ఇంతకుముందు కూడా అంతే కదా… ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, ‘ఆయనను హత్య చేసి ఉండేవాడిని’ అన్న వ్యక్తి ఇంటర్వ్యూ ప్రసారం చేసి, అందుకు సంబంధించిన కేసులో అరెస్టయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక మహిళ చేసిన ట్వీట్‌ను స్మిత సబర్వాల్ రీపోస్ట్ చేసింది…
ఆ మహిళ తన పోస్ట్‌లో ‘ఫ్రీ స్పీచ్.. తెలంగాణ మోడల్’ అనే శీర్షికతో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ట్వీట్ చేస్తే, దాన్నే స్మిత రీపోస్ట్ చేశారు. అఖిల భారత సర్వీసుల కాంట్రాక్ట్ రూల్స్ -1968 ప్రకారమైనా, 1923- అధికార రహస్యాల చట్టం కిందనైనా స్మిత సబర్వాల్ ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి ఉండకూడదు.
కాస్త పౌరుషం ఉన్న పాలకుడు అయితే అర్జెంటుగా ఆమెను ఆ పోస్టు నుంచి పీకేసి, డీఓపీటీకి సరెండర్ చేస్తాడు… ఆ దెబ్బకు మిగతా అధికార యంత్రాంగం సెట్ రైట్ అవుతుంది… ఓహో, ఈయనకు కోపం వస్తే యాక్షన్ సీరియస్‌గా ఉంటుంది అనే సంకేతం ఇచ్చినట్టయ్యేది…
నేను బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు అనే తరహాలో ఆమె వ్యవహార ధోరణి ఉంటే… కేవలం నోటీసుల జారీతో సరిపుచ్చితే దానితో ఒరిగేదేముంది..? ఈ వాదన నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది… ఉద్యోగం మానేసి బీఆర్ఎస్ కార్యకర్తగా మారిపోవచ్చు కదా… ఈ ధోరణి దేనికి అని విమర్శలు వస్తున్నాయి…
2000 మందికి నోటీసులు ఇస్తారో లేదో తెలియదు, కానీ అదేదో బాధ్యత కలిగిన కొలువులో ఉండి, బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా, ధిక్కార ధోరణిలో ఓ ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరిస్తున్నప్పుడు… నీతోనే నోటీసులు, యాక్షన్ స్టార్టయితే తప్పేమిటి అనే భావన నెటిజనం నుంచి కనిపిస్తోంది…
సీఎంచీఫ్‌పీఆర్వో అయోధ్య రెడ్డి కాలేశ్వరం కడుతున్నప్పుడు లక్షల చెట్లు నరికితే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాడు ఆమెను… కానీ అడగాల్సింది నేరుగా ఒకటే ప్రశ్న… పొలిటికల్ యాంబిషన్స్ ఉంటే నేరుగా బీఆర్ఎస్‌లో చేరిపోవచ్చు కదా అని..!
ఓ మిత్రుడి ప్రశ్న ఏమిటంటే..? వెంటనే ఆమెను తన బాధ్యతల నుంచి తప్పించి, సీఎస్‌కు ఎందుకు అటాచ్ చేయడం లేదు అని… అవునూ, ఎందుకు ఈ ఉపేక్ష..? ఘాటుగా ఉన్నా సరే, ఓ సందేహం… మరీ ఇంత చేతకానితనమా..?!
Share this Article