.
నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్‌ను టేకోవర్ చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా డేరింగ్ స్టెప్… ఎందుకో అర్థం కావాలంటే వివరంగా చెప్పుకోవాలి ఇలా…
హైదరాబాద్ మెట్రో నిజానికి మైటాస్ చేతుల్లోకి వెళ్లాల్సింది, కానీ సత్యం కుప్పకూలాక, మైటాస్‌కు చేతగాక… ఎల్ అండ్ టీ రంగంలోకి వచ్చింది… వైఎస్ కూడా కాస్త ఉదారంగా వయబులిటీ గ్యాప్ ఫండ్, కొన్ని విలువైన భూములు ఇవ్వడానికి అంగీకరించాక, ఇక పనులు స్టార్టయ్యాయి…
Ads
- రుణాలు తీసుకున్నారు, షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతుండగా… రాష్ట్ర విభజన, కేసీయార్ తెర మీదకు వచ్చాడు… అసెంబ్లీ దగ్గర అండర్ గ్రౌండ్ లైన్ వేసుకొండి, సుల్తాన్ బజార్ దగ్గర లైన్ మార్చండి అని కొర్రీలు వేయడంతో ఏడాదిపాటు స్తంభన… ఫలితంగా నిర్మాణవ్యయం పెరిగింది… (తరువాత 3 వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పి, కేవలం 900 కోట్లు మాత్రమే ఇచ్చాడు కేసీయార్…)
సరే, స్టార్టయ్యాక… కాస్తోకూస్తో లాభాల్లోనే ఉండింది… ఒక దశలో దేశంలోనే సెకండ్ ప్లేస్… కానీ దాని అసెట్స్ లాభదాయక వాడకంలో (ప్రాపర్టీలు, స్టేషన్లు, స్టాల్స్ ఎట్సెట్రా…) ఫ్లాప్… సరైన ఆచరణ లోపించి క్రమేపీ నష్టాల్లోకి పడిపోయింది… ఇప్పుడు మెట్రోల్లో తొమ్మిదో ప్లేసు… ఈ ఫ్లాప్‌కు కారణం అచ్చంగా ఎల్ అండ్ టీ…
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మెట్రో విస్తరణను సంకల్పించింది… ఒకవైపు హయత్ నగర్ దాకా, మరోవైపు శామీర్ పేట దాకా, ఇంకోవైపు శంషాబాద్ విమానాశ్రయం దాకా… ప్లస్ నాగోల్- ఎల్బీనగర్ గ్యాప్ భర్తీ దాకా… 2ఏ, 2 బీ కలిపి దాదాపు 160 కిలోమీటర్లు… దీనివల్ల ప్రస్తుతం 5 లక్షల దాకా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఈజీగా 10 నుంచి 15 లక్షల దాకా పెరుగుతుందని… లాభదాయక మెట్రో కావడమే గాకుండా… నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి, కాలుష్యం, పీకవర్స్ రద్దీకి చెక్ పెట్టవచ్చునని రేవంత్ రెడ్డి ఆలోచన…
కానీ ఈ విస్తరణకు ఎల్ అండ్ టీ మోకాలడ్డుతోంది… ససేమిరా అంటోంది… కేంద్రమేమో మొదటి దశ, రెండో దశ ఒకే సంస్థ నిర్వహణలో ఉండాలనీ, లేకపోతే చిక్కులు వస్తాయని అంటూ గత ఏడాది నవంబరు నుంచీ విస్తరణకు ఆమోదం చెప్పడం లేదు… ఓ డెడ్ లాక్…
- మరోవైపు ఎల్ అండ్ టీ రేవంత్ రెడ్డిని గెలకడం స్టార్ట్ చేసింది… ఇప్పటికే ఇన్ని నష్టాలు, రెండో దశతో మరిన్ని నష్టాలు తప్పవు, మేం వదిలించుకుంటాం అంటూ మీడియాకు లీకులు, వార్తలు… ఎల్ అండ్ టీ తన మీద అనుచిత ప్రెజర్ టాక్టిక్స్ ప్రయోగిస్తోందని రేవంత్ రెడ్డికి అర్థమైంది… ఇక తన పద్ధతిలో టాకిల్ చేయడం స్టార్ట్ చేశాడు… జాగ్రత్తగా పావులు కదపడం స్టార్టయింది…
తన దృష్టిలో ప్రజారవాణా ఏదైనా సరే ప్రభుత్వరంగంలోనే ఉండాలి… దేశంలో మెజారిటీ మెట్రోలు ప్రభుత్వ రంగంలోనే… పైగా ఢిల్లీ మెట్రో మంచి లాభాల్లో ఉంది, మరి మన మెట్రో ఎందుకు నష్టాల్లో నడుస్తోంది… సరైన నిర్వహణ లేకపోవడం వల్ల..! విస్తరణకు అంగీకరించకపోతే మొదటి దశను అమ్మేసుకొండి అని చెప్పేశాడు… 20 వేల కోట్ల ఆస్తి అని ఎల్ అండ్ టీ లెక్క చెప్పింది…
- సరే, మీరు ఓపెన్ బిడ్డింగుకు వెళ్లండి, ఎవరైతే ఎంత ఎక్కువకు ఇస్తానంటారో, అంతే మొత్తం ఇచ్చి తన ప్రభుత్వం తీసుకుంటుందని కుండబద్ధలు కొట్టాడు… ఎల్ అండ్ టీ ఇరుకునపడింది… ఈలోపు ప్రభుత్వం డీప్ స్టడీ చేయించి, ప్రస్తుతం ఎల్ అండ్ టీ విలువ 15 వేల కోట్లు కూడా దాటదని తేల్చుకుంది… కొన్నాళ్లుగా ఎల్ అండ్ టీకి, ప్రభుత్వానికీ నడుమ ఇవే చర్చలు… సో, టేకోవర్ అనేది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదు…
ఎప్పుడైనా ప్రభుత్వమే సుప్రీం… రాజకీయ నిర్ణయాలే అల్టిమేట్… ప్రజారవాణాను లాభదాయకంగా కూడా నిర్వహించొచ్చు అనేది సీఎం గట్టి భావన… సరైన అధికారగణం, సరైన దిశలో ఆచరణ ఉంటేనే..!! సో, ఆ దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేకోవర్‌కే సిద్ధపడింది… చివరకు గురువారం టేకోవర్ నిర్ణయం వెలువడింది అధికారికంగా…
- ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఈ టేకోవర్ భారం ఏమీ కాదు… ఎల్ అండ్ టీ తీసుకున్న 13 వేల కోట్ల అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తారు… 2100 కోట్ల వరకూ ఎల్ అండ్ టీకి వన్ టైమ్ పేమెంట్ అదనం… (కేసీయార్ ఎగ్గొట్టిన 2100 కోట్ల వడ్డీ లేని రుణం) రాతకోతలు, నిర్దారిత కసరత్తు తరువాత హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోకి వస్తుంది…
ఇదంతా రేవంత్ రెడ్డి ముందు నుంచే ఓ స్ట్రాటజీతో ఉన్నాడు… అందుకే ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మెట్రో ఎండీ పోస్టు నుంచి తప్పించాడు… ఇంకెవరినో తాత్కాలికంగా పెట్టాడు గానీ తను తాత్కాలికమే… మంచి వర్కర్ కావాలి తనకిప్పుడు, తను అనుకున్నట్టు మెట్రో రైల్ నడపటానికి..! బహుశా ఇక ప్రైవేటు కంపెనీల నీడను దీనిపై పడనివ్వకపోవచ్చు..!! తను గుంపు మేస్త్రీ కాదు, ఇదేమీ అల్లాటప్పా అనామతు గాలి నిర్ణయం కాదు, సాలిడ్ సాహస నిర్ణయం ఇది..!!
Share this Article