.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘ఫోన్ ట్యాపింగ్’ చట్టబద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరం ఏమీ కాదు, అది రియాలిటీ..! బీఆర్ఎస్ మైకులు చెబుతున్నట్టు ఇవి డబుల్ స్టాండర్డ్స్ అని కూడా అనలేం… కాస్త వివరాల్లోకి వెళ్దాం…
ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కొత్తేమీ కాదు… గూఢచర్యం అనేది తరతరాలుగా పాలకులకు ఉపయోగపడేదే… రాజ్యంలో అసమ్మతి, తిరుగుబాటు, విప్లవం, ఆందోళనల గురించి, బాధ్యుల గురించి సమాచార సేకరణ అది… అది రాజ్యం లక్షణం… అవసరం కూడా… (need and characters of the state) …
Ads
పూర్వకాలం నుంచి గూఢచారులు విస్తృతంగా తిరుగుతూ… రకరకాల మార్గాల్లో సమాచారం సేకరించేవాళ్లు… ఇది టెక్నాలజీ యుగం… ఎప్పటికప్పుడు టెక్నాలజీకి పదునుపెడుతూ ఫోన్ల ద్వారా ఎవరేం మాట్లాడుకుంటున్నారో నిఘా వేసి, రికార్డు చేసి, పాలకులకు (అధికారానికి) అందించే వ్యవస్థ కొన్నేళ్లుగా బాగా డెవలపైంది…
మామూలు ఫోన్లు ట్యాప్, హ్యాక్ అవుతున్నట్టు గమనించి చాలామంది వేరే ఫోన్ల నుంచి మాట్లాడటం లేదంటే రికార్డు చేయలేని రీతిలో వాట్సప్, నెట్ కాల్స్ మాట్లాడసాగారు… సిగ్నల్, టెలిగ్రామ్, ఐఫోన్ల ఫేస్‌టైమ్ వంటి యాప్స్ అవే… ఇప్పుడవీ బ్రేక్ చేస్తోంది టెక్నాలజీ… అంతెందుకు..? ఇజ్రాయిలీ టెక్నాలజీ మీరు వాడుతున్న కంప్యూటర్ల నుంచి రహస్య మెసేజులు పంపిస్తున్నా సరే, పట్టుకుంటుంది…
అంతెందుకు..? మీరు ఫలానా నాయకుడిపై నిఘా వేయాలంటే తన ఇల్లు, ఆఫీసు సమీపంలో ఓ పరికరం పెట్టి, ప్రతి ఫోన్ కాల్ మీద నిఘా వేయొచ్చు… ఆమధ్య కేంద్ర ప్రభుత్వం పెగాసస్ వాడుతున్నట్టుగా పెద్ద రచ్చ… ఏపీలో ఏబీ వెంకటేశ్వరరావు ఇబ్బందులను ఎదుర్కున్నది కూడా ఈ నిఘా టెక్నాలజీ సమకూర్చుకునే వ్యవహారంపైనే… ఫోన్ ట్యాపింగు ఆరోపణలతో కొలువులు కోల్పోయిన ప్రధానుల దాకా చాలా ఇష్యూస్ ఉన్నాయి…
ఈ దేశమే కాదు, దాదాపు ప్రతి దేశంలోనూ నిఘా ఉంటుంది, రకరకాల వివాదాలున్నయ్… సరే, తెలంగాణ విషయానికి వద్దాం… రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు..? ‘‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు, కాకపోతే దానికి ఓ పద్ధతి ఉంటుంది, చివరకు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడంకన్నా ఆత్మహత్య బెటర్…’’ అని…
ఎస్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గెలికింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే, వాళ్లు డీజీని అడిగితే… అక్కడ తీగ కదిలింది… సో వాట్..? ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదు అని సీఎం చెబుతున్నాడు కదా అంటారా..?
- ఇక్కడ ఓ విషయం గుర్తించాలి… ఎప్పుడైతే ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారో అక్కడ అనుమానాలు బలపడ్డాయి… ఆ చర్య తప్పనిసరిగా ఓ అపరాధ భావన… ఏవో తీవ్రమైన తప్పిదాలు బయటికి రాకుండా తప్పించుకునే ఎత్తుగడ, ఓ విఫల ప్రయత్నం… ఖచ్చితంగా కేసీయార్ హయాంలో సాగిన ఫోన్ ట్యాపింగ్ ఏదో అరాచకంగా ప్రబలిందనే సందేహాలకు తావిచ్చింది అదే…
ఈరోజుకూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అమెరికాకు పారిపోయి, ఇక అక్కడే ఆశ్రయం పొందడానికి విఫల ప్రయత్నం చేశాడంటేనే, ఏదో తీవ్రమైన చట్టవ్యతిరేక చర్యలకు ఈ ఫోన్ ట్యాపింగును ఉపయోగించారని అర్థమవుతోంది… ఈరోజుకూ తను దర్యాప్తుకు సహకరించడం లేదు… దాల్ మే కుచ్ కాలా హై…
అదేమిటో మొత్తం తేలాలి..? ఏయే రాజకీయ అవసరాలకు ఫోన్ ట్యాపింగును వాడుకున్నారు… ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నిరకాల బ్లాక్ మెయిలింగ్ బాగోతాలు, వసూళ్ల దందాలకు పాల్పడ్డారో కూడా తేలాలి… అది కదా ఈ కేసు ఉద్దేశం… ఈ రేంజు అరాచకం మరొకటి ఉండదనేది కదా తెలంగాణ సమాజం నమ్మకం..!
ఎస్, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమే… కానీ దానికి ఓ పద్ధతి ఉంది… దేనికి వాడుకుంటున్నారనేది ముఖ్యం… అదుగో అక్కడే కేసీయార్ పాలన గతితప్పి, గీత దాటి, లక్ష్మణ రేఖ దాటి, ఆ వ్యవస్థను అరాచకానికి వాడుకుంది… పెగాసస్ కావచ్చు, దాని తాతలాంటి మరో టెక్నికల్ నిఘా టెక్నాలజీ కావచ్చు… ఏ ప్రభుత్వమూ దీనికి దూరంగా ఉండలేదు… ఎస్, రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఫోన్ ట్యాపింగు చట్టబద్దమే, తప్పు కాదు... కానీ షరతులు వర్తిస్తాయి..!!
Share this Article