దీన్నే ‘అతి’ అంటారు… తెలుగును మెరుగుపరుచుకోవడం వేరు… తెలుగు నేర్చుకోవడం వేరు… సీఎం ఆఫీసులో పనిచేసే స్మిత సభర్వాల్ ఏదో మొహమాటానికో, మర్యాదకో నేను ఈనాడును చదివే తెలుగు నేర్చుకున్నాను అన్నదట… ఇంకేం… అంతకుమించిన సర్టిఫికెట్ మరిక దొరకదు, ఇదే మహాభాగ్యం అనుకున్న ఈనాడు… ఇదుగో ఈ హెడింగ్ పెట్టేసి… ధన్యోస్మి అన్నట్టుగా… ఓ మూడు నాలుగు కాలాల వార్తను భీకరంగా అచ్చేసుకుంది…
ఈ దెబ్బకు మహిళల దినోత్సవం, రోజు విశిష్టత ఎట్సెట్రా కాకరకాయ కబుర్లు సోదిలో లేకుండా పోయాయి… ఈ తెలుగు నేర్చుకునే అంశమే హైలైట్ అయిపోయింది… అసలు ఈనాడు మహిళ దినోత్సవం నిర్వహించడమే ఓ అబ్బురం… ఎంత బాగా కవర్ చేయొచ్చు దీనిని..? ఈ వార్త రాసినవారు, పేజీల్లో పేర్చినవారు, పేజీల్ని అంతిమంగా పాస్ చేసినవారు, నైతికంగా బాధ్యత వహించాల్సిన పెద్ద తలకాయలు… మొత్తం పాత్రికేయ జన్మలన్నీ ధన్యోస్మి…
Ads
ఎస్… గతంలో చాలామంది అధికారులు చెప్పేవాళ్లు… మేం ది హిందూ చదివి మా ఇంగ్లిషు దోషాలను దిద్దుకున్నాం, మెరుగుపర్చుకున్నాం, మంచి పాలిష్డ్ లాంగ్వేజీ మాట్లాడకపోయినా సరే, తప్పుల్లేని ఇంగ్లిష్ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం అని చెప్పుకునేవాళ్లు… అప్పట్లో ది హిందూ ఇంగ్లిష్ స్టాండర్డ్ మీద ఆ అభిప్రాయం ఉండేది… ఇప్పటికీ హిందూ భాష మీద చాలామందికి సదభిప్రాయమే ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే పడిపోయిందని అంటుంటారు… సో, భాషను మెరుగుపరుచుకోవడమే తప్ప ది హిందూ ఏబీసీడీలు నేర్పదు…
రఫ్‌గా, క్రూడ్‌గా ఉన్న భాషను మెరుగుపరచగలదు… అంతే… తెలుగు భాష ప్రమాణాలకు ఈనాడు అడ్డా ఏమీ కాదు… గతంలో ఈనాడు భాష కాస్త బాగుండేది… కానీ దిక్కుమాలిన అనువాద పదాలు పెరిగిపోయి… అదేదో కిలికిలిభాష కనిపిస్తోంది… ఫాఫం, స్మిత సభర్వాల్ దాన్నే తెలుగు భాష అనుకుందేమో… పోనీ, ఈమె నేర్చుకుందనే అనుకుందాం… అది హెడింగ్ పెట్టుకోవాల్సిన అంశమా..? స్మిత సర్టిఫికెట్ అంత విలువైందా..? హేమిటో… రాను రాను, అనుభవం పెరిగే కొద్దీ… ఈనాడు పాత్రికేయం కాకర కాయ నుంచి కీకర కాయలా మారిపోతోంది…!!
మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, బీఆర్ఎస్ ప్రముఖ లీడర్ కేకే… తదితరులు కూడా ఈనాడును చదివే తెలుగు నేర్చుకుని ఉంటారు..!! కాదంటే కళ్లుపోతాయ్, చెంపలు వేసుకొండి…!!
Share this Article