.
కోడిపందేలు… ఏ ప్రభుత్వం పైకి ఏం చెప్పినా, ఏం బెదిరించినా, కేసులు పెట్టినా… అది ఆగలేదు, ఆగదు… పేకాట, పందేలు తొక్కేకొద్దీ ఆన్‌లైన్ బెట్టింగ్ వంటివి పెరుగుతాయి…
మనిషికి అదొక మానసిక బలహీనత… మనిషిలో మార్పు రావల్సిందే తప్ప ఇలాంటివి నిర్బంధంతో రూపుమాపలేం… పెద్ద పెద్ద టెంట్లు వేసి జాతరలా నిర్వహించే కోడిపందేలు కూడా కామన్ అయిపోయిన రోజులివి…
Ads
ఏపీ ప్లస్ ఏపీ వాసనలుండే ఖమ్మం ప్రాంతంలో కలిపి ఈసారి ఎన్ని వేల కోట్ల ధనం చేతులు మారిందో గానీ… ఎక్కడా పెద్దగా ప్రభుత్వం కొరడా పట్టుకున్న జాడలేమీ కనిపించలేదు… బోలెడు వార్తలు చదివాం కానీ ఆంధ్రప్రభలో కావచ్చు ఓ ఇంట్రస్టింగు వార్త కనిపించింది…
వేటకోళ్లను అనగా పందెం కోళ్లను జాగ్రత్తగా, ప్రొఫెషనల్‌గా పెంచి… బరిలోకి దింపేవాళ్లూ ఉంటారు కదా… వాళ్లు ఈసారి ఏకంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా బలమైన కొత్త జాతి కోళ్లను దిగుమతి చేసుకున్నారనేది వార్త… అంతేనా..? మన దేశవాళీ పందెం కోళ్లను అలవోకగా కొట్టిపారేశాయట…
కొందరు సైప్రస్, మంగోలియాల నుంచీ తెప్పించారు… ఇవన్నీ మన దేశవాళీ కోళ్లకన్నా ఎత్తులో, పరిమాణంలో చిన్నగా ఉన్నా బలంగా ఉండి మన కోళ్లను పొతం పట్టాయి… ఇన్నాళ్లూ మన కోడి జాతుల్లో డేగ, సప్తసాచి, నెమలి, కవల, రసంగి వంటివి పోటీలో నిలబడలేకపోయాయి… ప్రత్యేకించి పెరూ నుంచి తెప్పించిన కోళ్లు బలంగా పోటీపడ్డాయి… ఈసారి పోటీల్లో 75 శాతం వరకూ వీటిదే విజయపతాక అనేది ఆ న్యూస్ స్టోరీలో ఓ అంశం…
అంతేకాదు, సదరు విలేకరి దేశవాళీ, విదేశీ కోళ్ల నడుమ తేడాలను కూడా చక్కగా రాశాడు… నిజమే… అనేకచోట్ల ఎకరాల విస్తీర్ణంలో టెంట్లు వేసి, ఫ్లడ్ లైట్లు, పార్కింగ్ వసతులు, మద్యం, విదేశీ మద్యం, రకరకాల మాంసాహార భోజనాలు… ఈవెంట్ మేనేజర్లు… వాట్ నాట్..? అన్నీ… కొన్నిచోట్ల వీఐపీ టెంట్లు, వాటిల్లోకి ఎంట్రీ ఫీజులు భారీగా… ఇదోరకం కేసినో…
పోలీసులు ప్రేక్షకపాత్ర అని ఏవేవో రాసుకోవడమే గానీ… అంతా సిస్టమాటిక్‌గా ఎవరికేం చెల్లించాలో చెల్లించేస్తారు… ప్రజాప్రతినిధులు కూడా అండగా ఉంటారు… అందరికీ అన్నీ తెలుసు… జస్ట్, కళ్లు మూసుకుంటారు… అంతే… వేల కోట్ల దందా సాగుతున్నప్పుడు విదేశీ కోళ్లు కూడా వస్తాయి, ఎందుకు రావు..? ఐపీఎల్ మ్యాచుల్లో దేశవిదేశీ ఆటగాళ్లు ఉన్నట్టుగానే..!!
Share this Article