జలుబు- దగ్గు- ఒక విమాన ప్రయాణం!
——————-
విమాన ప్రయాణంలో ఉన్న వేగం తప్ప- విమానాశ్రయ విధానాలు, విమానంలో పద్ధతులు అన్నీ మన మానాలను అవమానించేవే. హరించేవే. మనం మనమేనని సాయుధులముందు నిరూపించుకుంటేనే లోపలి అనుమతిస్తారు. మామూలుగానే నేను విమాన ప్రయాణాలకు విముఖుడిని. కరోనా వేళ విమాన ప్రయాణాలు మరీ ప్రహసనం. హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వెళ్లి, మళ్లీ గోడక్కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన అత్యవసర పని పడింది. ఒక మిత్రుడు నేను పాడే పద్యాలు వింటూ కొసరి కొసరి వడ్డించిన పాల కోవాలు, జాంగ్రీలూ, గులాబ్ జామున్ లు అతిగా తినడం వల్ల మొదట నా గొంతు గరగర మొదలయ్యింది. ఆపై జలుబుగా మారింది. తగుపాళ్లలో దగ్గు దగ్గరయింది. ఈ జలుబు- దగ్గుతో నా విమాన ప్రయాణం ఎన్నడు లేని కొత్త అనుభవం నేర్పింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగగానే తనివి తీరా తుమ్మి, మాస్కు సవరించుకుని లోపలికి వెళ్లబోయాను. హిరోషిమా నాగసాకి గురించి పోటీ పరీక్షల్లో చదువుకున్న సాయుధ పోలీసులు ఉగ్రవాదిని చాకచక్యంగా, అత్యంత ధైర్యసాహసాలతో పట్టపగలే పట్టుకున్నట్లు నన్ను పట్టుకున్నారు. మణికట్టు మీద, నుదుటి మీద పరీక్ష యంత్రాలన్నీ పెట్టి- విధిలేక లోపలికి వదిలారు. మొదటి గేట్లోనే ఒక మహిళా పోలీస్ మాస్క్ నికాలో అని మర్యాదగా ఆదేశించింది. ఐడి ప్రూఫ్ దిఖావో అంది. అంత మృదువుగా, మర్యాదగా మాట్లాడ్డానికి వారికి ప్రత్యేకమయిన శిక్షణ ఇస్తారేమో! సెక్యూరిటీ చెక్ దగ్గర ఎంతటి సంస్కారికయినా మానం విమానం పాలు కావాల్సిందే. బెల్ట్ విప్పమన్నారు. బూట్లు విప్పమన్నారు. పర్స్ తీయాలన్నారు. నాకేమో బెల్ట్ తీస్తే ప్యాంట్ నిలవదు. వాడికి మన బెల్ట్ తీయడమే ముఖ్యం కాబట్టి- ఒక చేత్తో ప్యాంట్ జారకుండా పట్టుకున్నా. ఈలోపు ముసుగువీరుడు పిలిచి చేతులు పైకెత్తమన్నాడు. భగవంతుడిమీద భారం వేసి వాడు ఆడించినట్లల్లా ఆడి, మానం దక్కించుకున్నాను. హాయిగా అందరూ పొట్టలు ప్రదర్శిస్తూ బెల్టులు సవరించుకుంటూ, కాలికి అందని బూట్లను కష్టపడి తగిలించుకోవడం ఒక దృశ్యం. మానావమానాలు శరీరానికే కానీ – ఆత్మకు కాదని ఆత్మ జ్ఞానం కలిగించడమంటే ఇదే. నిజానికి వ్యాకరణంలో “వి” విశిష్టఅర్థానికి, వ్యతిరేకార్థానికి కూడా పనిచేస్తుంది.
ఖ్యాతి- విఖ్యాతి- విశిష్టమయిన.
కిరణం- వికిరణం- వ్యతిరేకార్థం.
అలాగే-
మానం- విమానం అనుకుంటే మానాన్ని తీసేసేది, లేదా మానానికి వ్యతిరేకమయినది విమానం అని అనుకుంటే వ్యాకరణమేమీ పెద్దగా ఫీల్ కాదు.
Ads
ప్రతిమనిషిలో ఒక మానవబాంబును వారు చూడగలుగుతారు. నా ఖర్మ కాలిన వేళ తీవ్ర అనారోగ్యం చేస్తే- మా నాన్న మంత్రించిన తాయెత్తుకు ప్రత్యేక పూజలు చేయించి కొరియర్లో పంపారు. అది మెడలో ఉంది. మెటల్ డిటెక్టర్ దాన్ని గుర్తించి బీప్ బీప్ మని ప్రమాద సంకేతంగా రెడ్ బల్బ్ తో అలారమ్ మోగించింది. వెండి తాయెత్తు లోపల రాగిరేకుమీద రాసిన యాంత్రాక్షరాలను కూడా విప్పి చూపాల్సి వస్తే- యావత్ హైందవ జాతి నమ్మకాల మీద జరుగుతున్న పాశవిక దాడిగా అరుద్దామనుకున్నా. తాయెత్తును ఒకటికి రెండు సార్లు డిటెక్టర్ తో పరీక్షించి- అందులో ఆర్ డి ఎక్స్ విస్ఫోటన పౌడర్ లేదనుకుని నన్ను దయదలిచి వదిలేశాడు.
విమానంలో నాది కిటికీ వైపు సీటు. మధ్య సీటులో పిపిఇ కిట్ మేలి ముసుగుతో ఒకమ్మాయి. నా తుమ్ములు, దగ్గులకు ఆ అమ్మాయి పై ప్రాణాలు విమానం పైకి ఎగరకముందే పోయాయి. అంకుల్ ఆర్ యూ ఓకే? అని తన భయాన్ని పోగొట్టుకోవడానికి భయపడుతూ ధైర్యంగా అడిగింది. ముక్కు తుడుచుకుంటూ ఎస్, యామ్ ఫైన్ అన్నా. పర్సులో ఉన్న శానిటైజర్ తీసి చల్లుకుంటూనే ఉంది. ఎవరి భయం వారిది. ఆ శానిటైజర్ వాసనకు నా తుమ్ములు మరింతగా పెరిగాయి. విమానం ల్యాండ్ అవ్వగానే ఆ అమ్మాయి దూకినంత వేగంగా నాకు దూరంగా పరుగెత్తింది. ఆ అమ్మాయి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఆశీర్వదించాను!
తిరుగు ప్రయాణంలో దగ్గు సహజంగా మరింత తిరగబెట్టింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ బోర్డింగ్ పాస్ క్యూలో దగ్గిన ప్రతిసారి అనేక కళ్లు నన్ను గుచ్చి గుచ్చి చూశాయి. ఈసారి సెక్యూరిటీ చెక్ లో తాయెత్తు దొరకలేదు కానీ- దగ్గును ఆపడానికి మా ఆవిడ ఇచ్చిన అల్లం ముక్కలు దొరికాయి. అల్లం నుండి అణుబాంబులు తయారుకావు అని నిశ్చయించుకుని నన్ను వదిలేశారు. విమానంలో నా దగ్గుకు ఒక ముసలాయన విసుక్కుని గగన సఖికి ఫిర్యాదు చేశాడు. నా దగ్గు ఉపద్రవకారకం కాదని వాదించి మీ చావు మీరు చావండని అల్లం ముక్కలు నములుతూ, దగ్గుతూ మొండిగా కూర్చున్నాను. ఎగిరిన విమానం నా దగ్గువల్ల వెనక్కు తిరిగితే పెద్ద వార్త. శంషాబాద్ వస్తోంది అని పైలట్ ప్రకటించే వరకు నా ధారాళమయిన దగ్గు ఆగలేదు. విమానం దిగగానే మంత్రించినట్లు ఆగిపోయింది.
నేను దగ్గితే లోకం ఏడ్చింది!
నేను తుమ్మితే లోకం భయపడింది!
లోకంతో నాకింక పని ఏముంది?
డోంట్ కేర్!
పద్యాలు వినేవారేలేరు. అలాంటిది పద్యాలు వినడానికి తోడు ఒక్కొక్క పద్యానికి ఒక స్వీటు పెట్టిన మిత్రుడు ఈ అనర్థానికి కారణమని నేను అనుకోవడం లేదు! నేను ఇంకెక్కడా పద్యాలు పాడకుండా నా నోటిని స్వీట్లతో మూయించాడని అపార్థం కూడా చేసుకోవడం లేదు! ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? కరోనా వేళ తుమ్ము గుండెపోటు కంటే ప్రమాదం! దగ్గు హిరోషిమా కంటే విధ్వంసకరం!.. By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article