ఒక అనుభవం… సుదీర్ఘంగా రాస్తే చిన్న నవలిక… పెద్ద కథ… నిజానికి ఆమె రచయిత కాబట్టి ఇలా ఆసక్తికరంగా అక్షరబద్ధం చేసింది… చదువుతూ ఉంటే అసలు ఇవి కదా చదవాల్సినవి అనిపించింది… వోకే, అది కేన్సర్ కావచ్చు, మరో అనారోగ్య విపత్తు కావచ్చు, ఎదురైతే ఏం చేయాలి..? కుంగిపోవాలా..? ఫ్రస్ట్రేషన్‌లో పడిపోయి మరింతగా ఆ విపత్తుకు దాసోహం అనాలా..? నిరాశలో కూరుకుపోయి ఏడవాలా..? లేదు…! ధైర్యంగా ఉంటూనే, అవసరమైనది చేస్తూనే… జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే, విధి విసిరిన సవాల్‌ను గెలవాలి… గెలుస్తామా..? ఈ ప్రశ్నను కూడా వదిలేద్దాం… గెలిచి తీరాలి అనే సంకల్పం, గెలుస్తామా లేదా అనేది మళ్లీ ఆ విధికే వదిలేద్దాం… స్పిరిట్ బాగుంది కదా… కథ పెద్దది, ఓపిక ఉన్నవాళ్లే మొదలుపెట్టండి… (ఇది medium.com లో వచ్చిన సహానా సింగ్ రచన… ఫోటోలు, వీడియోలు, కథనం అన్నీ ఆమెవే…)…
2022… ఇదొక ఎక్సయిటింగ్ సంవత్సరం నాకు… చాలాకాలం తరువాత మేం ఇండియాకు వచ్చాం… చాలామంది కలుస్తున్నారు, యోగక్షేమాలు, పరామర్శలు, సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి… నా పుస్తకాన్ని అభిమానించేవాళ్లు, నాకు స్పూర్తిగా నిలిచిన రచయితల్ని కూడా కలుస్తున్నాను… కానీ ఒక్క నిజాన్ని మీ ఎదుట అంగీకరించాలి… నా దేహంలో, అదీ నా వక్షంలో పెరుగుతున్న ఓ గడ్డను నిర్లక్ష్యం చేశాను… బెంగుళూరులో ఉండే ఇద్దరు కజిన్స్ పట్టుబట్టి మమ్మోగ్రామ్ టెస్ట్ చేయించారు… మేమెవరమూ ఊహించలేదు… నాకు బ్రెస్ట్ కేన్సర్ మొదటి దశ… ఆ టెస్టు తేల్చేసింది…
నాకు నోటమాట రావడం లేదు… ఒక షాక్… అప్పుడే నా జీవితం అయిపోయిందా అనిపిస్తోంది… గత జన్మలో కర్మ నన్నిలా వేధిస్తోందా..? ఇప్పటిదాకా బాగా ఆస్వాదించిన మంచి జీవితాన్ని ఇచ్చినవాడివి, అప్పుడే దీన్ని తీసుకుపోవడం దేనికి అంటూ విధిని తిట్టాలనిపిస్తోంది…! ఏం చేయాలి..? అమెరికా తిరిగి వెళ్తే బతుకుతానా ఏం..? ఇక్కడే ఇండియాలో ఉంటే బతుకుతానేమో… పోనీ, సింగపూర్..? అబ్బే, అవన్నీ వేస్ట్… నా దగ్గరున్న డేటా అమెరికాయే బెటర్ అంటోంది… అసలు కేన్సర్ లేనిదెక్కడ..? కానీ చికిత్స తీరు ఏమిటి..?
Ads
నా భర్త నా తలను తన ఛాతీకి అదుముకుని నా కన్నీటిని తుడిచాడు… బ్రెస్ట్ కేన్సర్ అసలు భయపడే రోగమే కాదనీ, మన సైన్స్ ఎప్పుడో దాన్ని జయించిందనీ ధైర్యం చెప్పాడు, నేనున్నాను కదా డియర్ అన్నాడు, ప్రేమించే భర్త ఊరడింపుకన్నా భరోసా ఏముంది..? తన భుజంపై తలవాల్చాను, కంటి నుంచి అప్రయత్నంగా మరో నాలుగు చుక్కలు చెంపలపైకి జారిపోయాయ్…
అమెరికాలో మేముండే ఏరియా కేన్సర్ చికిత్సకు ప్రసిద్ధి పొందిందే… మాకు అన్నిరకాల ధీమాను ఇచ్చే ఆరోగ్య బీమా ఉండనే ఉంది… గురురాఘవేంద్రుడి కరుణ నీకు ఉంటుంది బిడ్డా అని అమ్మ ఆశీర్వదిస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, నాకేదో జరిగిపోతుందని కాదు, నాకే ఎందుకు రావాలి ఇలాంటివి అని..! మా నాన్న సైలెంటుగా నా తల మీద చేయి పెట్టి, కళ్లు మూసుకుని ఏదో ధ్యానిస్తున్నాడు… నాకు మమ్మోగ్రామ్ చేయించిన నా కజిన్స్ నా పక్కనే నిలబడ్డారు… ఈ సమాచారం విన్నాక దగ్గరి బంధువులు వస్తున్నారు… కొందరు నాకోసం ప్రార్థనలు కూడా చేస్తున్నారు… ఈ ప్రేమ నన్ను ఏడిపిస్తోంది… ఎన్ని చేతులు నన్ను తమలో పొదువుకుంటున్నయ్..? ఎన్ని నమ్మకాలు నాలో ఏదో శక్తిని ప్రసరింపజేస్తున్నయ్… అసలు వీళ్ల ప్రేమకు రిటర్న్ గిఫ్ట్ నేనేం ఇవ్వగలను..?
ధైర్యం… ఈ పదమే తోడుగా ఎంచుకున్నాను… దాంతోపాటే ఓపిక, ప్రశాంతత కూడా వచ్చేస్తాయి కదా… ఇక చకచకా నా ఇండియా టూర్‌కు సంబంధించిన పనులన్నీ చేసేశాను… రామచంద్రపుర మఠానికి చెందిన ఓ గురుకులాన్ని సందర్శించాను… ధర్మం కోసం మఠాన్ని నడిపే గురువు గారిని కలిశాను… బెంగుళూరు దగ్గర సాయిగ్రామ్ వెళ్లాను, నా బుక్ గురించి ఓ చిన్న ప్రసంగం… అక్కడే సద్దురు మధుసూదన్ సాయి కనిపించాడు… ధన్యోస్మి అనుకున్నాను…
నేనేమీ మరిచిపోవడం లేదు… నా మెదడు గుచ్చుతూనే ఉంది… ఆ కేన్సర్ గడ్డ నా వక్షంలో పెరుగుతూనే ఉందనే సోయితో పాటు అది చికిత్స చేయదగిన రోగమే అనే నిజాన్ని కూడా గుర్తుచేస్తూనే ఉంది… నా రేడియాలజిస్ట్ ఫ్రెండ్ ఓ జోక్ వేసింది, నన్ను నవ్వించడానికి… ‘అన్ని కేన్సర్లలోనూ ఉత్తమమైనది బ్రెస్ట్ కేన్సర్’ అని…
నేను అమెరికాలోని టెక్సాస్ వెళ్లగానే నా ట్రీట్‌మెంట్ ఏమీ స్టార్ట్ కాలేదు… మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న నా బిడ్డ కోసం అమెరికాలోని మరో కొత్త ప్రాంతానికి షిఫ్ట్ కావాలని అప్పటికే నిర్ణయించుకున్నాం మేం… అక్కడ ఓ ఫారెస్ట్ హోమ్ తీసుకున్నాం కూడా… పదేళ్లుగా ఉన్న టెక్సాస్‌ను వదిలేయడం మాకు బాధగానే ఉంది, కానీ తప్పదు… మొత్తం సర్దుకుని 1600 మైళ్ల దూరానికి బయల్దేరాం… పెద్ద ప్రయాస… నిజానికి ఈ పనిలో పడి నేను నా కేన్సర్‌నే మరిచిపోయాను… ట్రక్కులో సామాన్లు లోడ్ చేయడం, దానికి ముందు మా కారు… నా బిడ్డ, నా భర్త డ్రైవింగ్… ఏడు స్టేట్స్ దాటాం… రాత్రయితే ఏదో మోటెల్ వెతుక్కోవడం, మూడు రోజులు పట్టింది మాకు… కొత్త ఇల్లు చేరడానికి…
కార్నెల్ యూనివర్శిటీకి దగ్గరలో ఉంటుంది మేం తీసుకున్న ఫారెస్ట్ హోమ్… అక్కడికి వెళ్లేలోపు అందమైన ప్రకృతి పలకరిస్తూనే ఉంది, పెద్దగా ఫోటోలు తీసుకోలేదు, కానీ చూస్తూ ఉండిపోయాను…
ఇంకా సామాన్లు మొత్తం విప్పనే లేదు… మధ్యలో న్యూయార్క్ సిటీలోని మెమోరియల్ స్లావన్ కెటరింగ్ హాస్పిటల్ వెళ్లొచ్చాం… అది ప్రపంచంలోకెల్లా నంబర్ టూ కేన్సర్ కేర్ సెంటర్ అట… మరిన్ని మమ్మోగ్రామ్స్ చేయించారు… సర్జరీ ఎప్పుడు చేయాలో ఫిక్స్ చేశారు… నా జీవితంలో ఎప్పుడూ మమ్మోగ్రామ్ చేయించుకోలేదు, కేన్సర్ నా దగ్గరకు వస్తుందా అనే అజ్ఞానపు భావనేమో… దానికి మూల్యం చెల్లిస్తున్నాను…
నాది ఈఆర్ పాజిటివ్ కేన్సర్… ఈస్ట్రోజెన్ల కారణంగా మెల్లిగా పెరిగే ట్యూమర్… కేన్సర్ సెల్స్‌కు ఈ ఈస్ట్రోజెన్స్ అందకుండా బ్లాక్ చేయడం ద్వారా, ఇక ఆ ట్యూమర్ పెరగకుండా చేయాలి… ఇండియాలో ఆల్‌రెడీ నాకు ఆ మందులు స్టార్ట్ చేసింది నన్ను చూసిన డాక్టర్, అమెరికాలో డాక్టర్ కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా చెప్పింది… మొత్తం వక్షాన్ని తొలగించాల్సిన అవసరం లేకుండా, కేవలం లుంపెక్టమీ చేస్తానంది… అంటే కేవలం కొంత పార్ట్… పదేళ్లలో ఈ కేన్సర్ ఇంకేమైనా శరీరభాగాలకు సోకే ప్రమాదముందా అంచనా వేసే అంకాటైప్ డీఎస్ స్కోర్ బాపతు బయాప్సీ కూడా చేశారు…
ఆ హాస్పిటల్ కు వెళ్లేందుకు… ఎప్పుడూ ఇలా నాలుగు గంటల ప్రయాణం చేయడం చిరాకుగా ఉండేది మొదట్లో… కానీ మెల్లిమెల్లిగా అలవాటైంది… నా భర్త జోక్ చేస్తున్నాడు… వీటిని ‘కేన్సర్ పిక్నిక్స్’ అని పిలవాలేమో అని… మార్గమధ్యంలో పాటలు పాడుతున్నాం, వింటున్నాం…
సర్జరీ తరువాత డిశ్చార్జ్… ఓ హోటల్‌లో కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది… ఈ ప్రొసీజర్‌కు ముందు విపరీతమైన ఆకలి… మంచి ఫుడ్ తీసుకోవాలి కూడా… ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ తను చేసిన పుష్టికరమైన వంటల్ని తీసుకొచ్చింది… ఇంటికి వచ్చాక మేరీలాండ్‌లో ఉండే మా కజిన్ డ్రై ఐస్‌లో భద్రపరిచిన డిషెస్ తెచ్చింది… అసలు వీళ్ల దయకు, వీళ్ల ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను… ఈ దురదృష్టంలోనూ అదృష్టవంతురాలినే…
ఈలోపు మరో కజిన్ ఏదో బిజినెస్ ట్రిప్ మీద వచ్చి, కేవలం నన్ను చూడటానికే మేముంటున్న ఏరియాకు వచ్చింది… మెల్లిమెల్లిగా నేనే వండుకుంటున్నాను… డ్రైవ్ చేస్తున్నాను… పాములా మెలికలు తిరిగిన రోడ్లు, మలుపుల్లో కూడా నడిపిస్తున్నాను… వర్షం కురిసి స్కిడ్ అవుతున్నా సరే కంట్రోల్ చేస్తున్నాను… వర్షం ఎక్కువగా కురిస్తే చాలు మా ఇంటి వెనుక ఏదో జలజల ప్రవాహం… అలా హిప్నటైజ్ అయినట్టు చూస్తూ ఉండిపోతున్నాను… నా కేన్సర్, నా కష్టాలు, నా చికిత్స మొత్తం మరిచిపోతున్నాను…
ఇప్పుడిక కీమోథెరపీ గురించి…! అంకాటైప్ టెస్టు 25 రిజల్ట్ చూపిస్తోంది… అంటే కీమోథెరపీ అవసరం లేదట… మొన్నమొన్నటిదాకా ఈ జీనోమిక్ టెస్ట్ అందుబాటులోకే రాలేదు… ప్చ్, ఇది ముందే వచ్చి ఉంటే కొన్నివేల మందికి కీమోథెరపీ కష్టాలు ఉండేవి కావు కదా అనిపించింది… ఏం చేయగలం..? నా కోసం కూడా ఇండియాలో ఎవరో ప్రార్థిస్తూనే ఉన్నారు… ఓరోజు రామచంద్రాపుర మఠాధిపతి మంత్రాక్షతల్ని పంపించాడు… రోజూ నా రికవరీ కోరుతూ సందేశాలు వస్తూనే ఉన్నాయి…
నా చికిత్స ప్రొసీజర్ కొనసాగుతూనే ఉంది… నా జుత్తుకు రంగు వేయడం మానేశాను… ఎందుకో తెలుసా..? ఎలాగూ కీమోథెరపీతో ఆ జుత్తు ఊడిపోతుంది కదా, మరి ఊడిపోయే జుత్తుకు రంగులు దేనికి అనేది నా భావన… మరో జీనోమిక్ టెస్టులో 21 రిజల్ట్… సో, నాకు కీమోథెరపీ అక్కర్లేదు గానీ రేడియోథెరపీ అవసరమనీ, మళ్లీ కేన్సర్ రాకుండా అది అడ్డుకుంటుందనీ అంకాలజిస్టు చెప్పింది… మరో ఆనందకరమైన వార్త ఏమిటంటే… నాకొచ్చిన కేన్సర్ అనువంశికం కాదట… అంటే నా బిడ్డ సేఫ్…
ఇదొక పారడాక్స్… అమెరికన్ జీవన శైలి పెద్ద ఎత్తున కేన్సర్ వ్యాప్తికి కారణం… హార్మోన్లు కృత్రిమంగా ఎక్కించిన పాలు, గుడ్లు… కృత్రిమంగా తీయదనాన్ని జొప్పించిన పళ్లు, న్యూట్రిషన్ల జాడలేని కూరగాయలు, ధాన్యాలు… ఏరకంగా చూసినా కేన్సర్ల పెరుగుదలకు మంచి వాతావరణం… కానీ అదే సమయంలో కేన్సర్ చికిత్సలో అమెరికాయే నంబర్ వన్…
నా రేడియో థెరపీ లోపు ఆ ప్రాంతంలోని అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాను… చెట్లు, ఆకులు, పళ్లు… నా కంప్యూటర్ స్క్రీన్ సేవర్లన్నీ నా కళ్ల ముందుకొచ్చాయి… ఇథాకాలో ఫాల్ సీజన్ ఆస్వాదించడం ఓ వరం…
నా తదుపరి పుస్తకం కోసం అవసరమైన సమాచారం కోసం కార్నెల్ యూనివర్శిటీ లైబ్రరీకి వెళ్లసాగాను… అక్కడికి వెళ్లడానికి నేను వాగులు, అడవులు, వంకలు దాటుతున్నట్టు అధివాస్తవిక ఊహల్లో ఉండేదాన్ని… ఒకరకంగా పూర్వ భారతంలోని గురుకులాలకు వెళ్తున్నట్టుగా… నిజం కూడా అదే…
నిజానికి కార్నెట్ ఆవరణ చూడదగిన ప్లేస్… బ్యూటిపుల్ క్యాంపస్… ప్రపంచంలోనే పేరొందిన యూనివర్శిటీ… పైగా ఆ భవనాలు, ఆ ప్రకృతిలో ఒదిగినట్టుగా ఉన్న పరిసరాలు… నన్ను నేను మరిచిపోతున్నాను…
కొంతకాలంపాటు నేను వెబినార్లకు అటెండ్ కావడం మానేశాను… నా బూడిద రంగు జుత్తును చూస్తారని…! నా కజిన్స్ కూడా మళ్లీ జుత్తుకు రంగు వేసుకోవాలంటూ హితవు చెబుతున్నారు… ష్, మీకు ఓ నిజం చెప్పనా..? అసలు రంగు వేయని నా జుత్తును కూడా నేను మురిపెంగా చూసుకుంటున్నాను… ఎందుకంటే, కీమోథెరపీ లేదు, నా జుత్తు ఎటూ పోలేదు… రంగు లేకపోతే అసలు ఏ బాధా లేదు…
ఓరోజు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ వెళ్లాను… అదీ కార్నెట్ ఆడిటోరియంలోనే… మరుపురానిది… మా బంధువులు ఆశ్చర్యపోతున్నారు కేన్సర్ నా ప్యాషన్లను, నా ఆసక్తులను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది అని…
ఇక రేడియో థెరపీ… ఒకటిన్నర నెలల్లో 30 సెషన్స్… ప్రతిసారీ గంట డ్రైవింగ్ తప్పదా అనుకుని సెర్చ్ చేస్తే అరగంట ప్రయాణ దూరంలో మరో రేడియేషన్ సెంటర్ దొరికింది… ఈలోపు తన తండ్రి సమస్యల్ని అటెండ్ కావడానికి నా భర్త ఇండియాకు వెళ్లాడు… నేనొక్కదాన్ని ప్రతిసారీ రేడియేషన్‌కు వెళ్తానా లేదా అని తన ఆందోళన… ఎలాగోలా మేనేజ్ చేసుకున్నాను… ఒంటరిగానే వెళ్లి వచ్చేదాన్ని… ఈ రేడియేషన్ వల్ల చర్మం కాలినట్టు, కమిలినట్టు రంగు మారుతోంది… అదంతా హీల్ చేస్తానని మా డాక్టర్ హామీ ఇస్తోంది… ఇక ఆ ప్రొసీజర్‌కు వెళ్లడం, పెద్ద పెద్ద ల్యాండ్ స్కేప్స్ చూస్తూ… నడుమ ఒక్కోసారి కారు ఆపుకుని, చుట్టూ చూస్తూ, రేడియో వింటూ… నా ప్రపంచంలోకి వెళ్లిపోతున్నాను…
మంచు కురిసే సీజన్ వచ్చేసింది… మా జీవితంలోకెల్లా అతి చల్లని రోజుల్ని గడిపాం… నా రేడియేషన్ అయిపోయాక కూడా కొన్నాళ్లు ఈ మంచు కురిస్తే బాగుండు అని దేవుడిని కోరుకునేదాన్ని… నిజంగానే ఈసారి చాలాకాలం మంచు కురిసింది…
నా బెడ్‌రూం నుంచి మంచు కురిసే దృశ్యాన్ని చూడటం ఓ మరుపురాని ఫీల్… నన్ను అది తరచూ కలల హిమలోకంలోకి తీసుకెళ్లేది… ఇండియాలో ఉన్నప్పుడు తరచూ కుటుంబంతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ వెళ్లేదాన్ని… మేమున్నన్ని రోజులూ మంచు కురిసేది కాదు… మేం వచ్చేసిన తరువాత మంచు స్టార్టయ్యేది… కానీ ఆ కరువు మొత్తం తీరేలా… ఇప్పుడు నా సొంత ఆడిటోరియంలో నా హిమవైభవాన్ని అనుభవించాను…
ఇప్పటిదాకా నా కథ చెప్పాను కదా… ఎక్కడైనా నేను బాధితురాలిననీ, విధివంచితననీ, దురదృష్టవంతురాలిననీ.., కుంగిపోయినట్టు గానీ, ఫ్రస్ట్రేషన్‌లోకి జారిపోయినట్టు గానీ అనిపించిందా..? అవును, సెల్ఫ్ పిటీని మించిన రోగం మరొకటి లేదు… ముందుగా దాన్ని గెలిచాను… డిసెంబరు 21… నా రేడియో థెరపీ కూడా ముగిసింది… నన్ను జాగ్రత్తగా చూసుకున్న హాస్పిటల్ స్టాఫ్‌కు గిఫ్ట్స్ కొనిచ్చాను… నేను కేన్సర్ చికిత్సను పూర్తిచేశాననీ, దాన్ని జయించాననీ అనుకోవడమే నాకు ఆనందాన్ని ఇస్తోంది…
ఈ అయిదు నెలలూ నిజానికి నా జీవితాన్ని కొత్తగా ఆస్వాదించాను… ఆనందించాను… అనేక వర్ణాలు, అటవీ పరిసరాలు, పరుగెత్తే ప్రవాహాలు, కళ్లకు ఇంపుగా మంచుపాతం, ప్రకృతి నడుమలో నా బెడ్‌రూం… వాట్ నాట్… అసలు నేను నిన్నటిదాకా ఓ కేన్సర్ పేషెంటునేనా..? నిజానికి విధి నన్ను కావాలనే ఈ వాతావరణంలోకి పంపించిందా..? రాత్రిళ్లు నిద్రపోతున్నప్పుడు నా పూర్వకర్మలు, నా పూర్వీకుల ఆశీస్సులేవో నన్ను స్పృశించాయా..? అలాగని నా భవిష్యత్తు భద్రమనే భ్రమ నాకేమీ లేదు… రేపు నేనెక్కడో, నేనేమిటో నాకేం తెలుసు..? చూద్దాం… మస్తు పని బాకీ ఉండిపోయింది… అందులో పడిపోవాలి… తరువాత ఏమైపోతామో కాలానికే వదిలేస్తే సరి… ధైర్యం ఎలాగూ నాతో ఉంటుందిగా… పోరాడలేనా..?!
Share this Article