కమాన్ ఇండియా!
లెట్ అజ్ బెట్ అఫిషియల్లీ!!
———————–
అష్టకష్టాలకు సప్తవ్యసనాలే కారణం అని పడికట్టుగా వాడుతున్నాం. ఆ ఏడిపించే ఎనిమిది కష్టాలేమిటో? కొంప కొల్లేరు చేసే ఈ సప్త వ్యసనాలేమిటో ? వివరాల్లోకి పెద్దగా వెళ్లం.
Ads
అష్టకష్టాలు:-
1 . రుణం
2 . యాచన
3 . వార్ధక్యం
4 . వ్యభిచారం
5 . చౌర్యం
6 . దారిద్ర్యం
7 . రోగం
8 . ఎంగిలి భోజనం
మద్యపానం, జూదమాడడం లాంటివి సప్తమహా వ్యసనాలు. మిగతా అయిదు ఏమిటో ఎవరికి వారు తెలుసుకోవచ్చు. వాటి లిస్టు, దాని వివరణ ఇక్కడ అనవసరం.
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిస్సహాయంగానే అయినా విస్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పాడు. కీలకమయిన శాఖలో చురుకయిన మంత్రి కాబట్టి ఆయన అభిప్రాయం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమే అవుతుంది. ఆయన ప్రకటనలో ఆణి ముత్యాలివి.
1 . క్రికెట్ బెట్టింగును చట్టబద్దం చేయాలి.
2 . దానిద్వారా ప్రభుత్వానికి పన్నులరూపంలో అంతులేని రాబడి ఉంటుంది.
3 . మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
————————
ద్వాపరలో ధర్మరాజును పాంచాలపుత్రిక
“తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? ”
అని అడిగిన ప్రశ్నకు యుగం మారినా సమాధానం దొరకలేదు. శకుని మాయాజూదం, పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు అందరికీ తెలిసినవే.
జూదం, అందులో రకాలు, పందెంగా పెట్టే మొత్తం, బ్లాక్, వైట్, జూదం డబ్బు తరలింపు, క్యాసినోల్లో అంతర్జాతీయ విహార జూదం అంతా పెద్ద వ్యవహారం. మాఫియా దందా. అందరికీ అన్నీ తెలుసు. కానీ అందరూ తెలియనట్లు నటిస్తారు. లేని వాడు జూదమాడితే వ్యసనం. ఉన్నవాడు జూదమాడితే హోదా. టైమ్ పాస్. సోషలైజింగ్ యాక్టివిటీ.
క్రికెట్ బెట్టింగ్, బుకీలు, మాఫియా, హవాలా గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకుని ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అందరికీ అన్నీ తెలిసినవే. బంతి బంతికి ప్రత్యక్ష ప్రసారాల సాక్షిగా కొన్ని వేల కోట్ల బెట్టింగులు జరుగుతుంటాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండు రకాల బెట్టింగులు అందుబాటులో ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ విధివిధానాలు, స్వరూప స్వభావాల మీద ఇది పాఠం కాదు కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. చివరికి ఈ బెట్టింగ్ మాఫియాలు క్రీడాకారులను లోబరుచుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు.
అధికారికంగా ప్రభుత్వమే బెట్టింగును చట్టబద్దం చేస్తే ఇక ఎలాంటి గొడవా ఉండదు కదా అన్నది మంత్రిగారి సూచన. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. మద్యానికి ప్రభుత్వాల్లో ప్రత్యేక శాఖలే ఉంటాయి. సిగరెట్లు హానికరం. సిగరెట్ల అమ్మకం మీద పన్నును ప్రభుత్వం పిండుకుంటూనే ఉంటుంది. అలాగే రేప్పొద్దున క్రికెట్ అధికారిక బెట్టింగ్ ల మీద ప్రభుత్వాలకు పన్నుల డబ్బు వేల కోట్లు సమకూరవచ్చు. వినడానికి ఇబ్బందిగా ఉన్నా- క్రికెట్ అధికారిక బెట్టింగ్ దిశగా అడుగులు పడుతున్నాయన్నది మాత్రం నిజం.
ఇకపై-
ప్రభుత్వ క్రికెట్ జూద విభాగం;
బెట్టింగ్ ఆఫీసర్;
బెట్టింగ్ మానిటర్ డిపార్ట్ మెంట్;
బెట్టింగ్ ఆన్ లైన్ పేమెంట్ అకౌంట్;
బెట్టింగ్ ట్యాక్స్;
బెట్టింగ్ టీ డి ఎస్;
బెట్టింగ్ బోనస్;
బెట్టింగ్ పన్ను మినహాయింపు;
బెట్టింగ్ రిటర్న్స్ …
లాంటి బెట్టింగ్ పరిభాష కాన్వెంట్ పిల్లలు కూడా మాట్లాడవచ్చు. జాతీయ స్థూల బెట్టింగ్ వ్యయాన్ని పెంచడానికి జాతియావత్తుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం, ప్రోద్బలం ఇవ్వవచ్చు.
కమాన్ ఇండియా!
లెట్ అజ్ బెట్ అఫిషియల్లీ!!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article