యూట్యూబ్‌లో నంబర్ టూ ట్రెండింగ్… సైంధవ మూవీ ట్రెయిలర్… నిజానికి ఆ ట్రెయిలర్‌లో ఏమీ లేదు… వెంకీ ఓ తుపాకీ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటాడు… అంటే ఇది ఫుల్ యాక్షన్ సినిమా అని చెబుతున్నాడు… అంతే… ఐనాసరే, మస్తు వ్యూస్ కనిపిస్తున్నయ్… అంటే, వచ్చెయ్ వెంకీ… ఇంకా ఆ దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? మనం కూడా ఫుల్ యాక్షన్ మూవీ చేసేయాల అని ఫ్యాన్స్, ఇండస్ట్రీ చెబుతున్నట్టుంది…
నిజమే… ఎవరెవరో కుర్ర హీరోలు కూడా అలా ఎడమచేత్తో మెషిన్ గన్ పట్టుకుని ఎడాపెడా కాల్పులు జరిపేసి, బాక్సాఫీసు కొల్లగొట్టుకు పోతున్నాడు… మరి వెంకీకేం తక్కువ..? మస్తు సీనియారిటీ ఉంది… మస్తు కథలున్నయ్… సొంతంగా తీసిపెట్టే సోదరుడున్నాడు… బొమ్మ తుపాకులు కూడా బొచ్చెడున్నయ్ స్టూడియోలో…
ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి… కొద్దిరోజుల సినిమాలే… విక్రమ్, కేజీఎఫ్, వీరయ్య, విక్రాంత్ రోణ, ధమాకా, వారసుడు, పఠాన్, ఆర్ఆర్ఆర్… అన్నీ యాక్షన్ బేస్‌డే… హీరో ఒక్క దెబ్బకు కనీసం ఓ ఇరవై మంది రౌడీలు (చేతుల్లో తుపాకులు ఉండి కూడా…) మైళ్ల కొద్దీ దూరంలో పడాలి… స్టయిల్స్, ఎలివేషన్స్, బీజీఎం బాగుంటే చాలు… పాన్ ఇండియా… డబ్బులే డబ్బులు… మన వెంకీకి ఎందుకు ఆ ఆశ ఉండకూడదు..?
Ads
అందుకే వెంకీ75 అనగా సైంధవుడు అలాగే యాక్షన్ వీరుడిగా ముందుకొస్తున్నాడు… ఇప్పుడు కథలు కాకరకాయ ఏమీ లేవు… స్టంట్స్, యాక్షన్… ఫటాఫట్, ధనాధన్… ఎన్ని శవాలు లేస్తే హీరోకు అంత సక్సెస్… వీలయితే వీరసింహారెడ్డి తరహాలో నరుకుడు తెలిస్తే ఇంకా బెటర్… ఆ నెత్తురూ బాక్సాఫీసుకు బాగా నచ్చుతోంది ఈమధ్య… హీరోయిన్..? ఉన్నా లేకపోయినా పర్లేదు, ఉంటే రెండు పాటలు పెట్టేద్దాం, చాలు… విలన్..? మస్తు దమ్మున్న విలన్ కావాలి… దమ్మున్న విలన్ అయితేనే హీరోయిజం ఫుల్ ఎలివేటవుతుంది…
వీలున్నంతవరకూ మాఫియా డాన్లతో పోరాటాలు… హీరోకు చిన్న ఫ్లాష్ బ్యాకులు… మరీ కావాలంటే తల్లి ఎమోషనో, చెల్లి ఎమోషనో కాస్త రెండు మూడు సీన్లు తగిలిస్తే చాలు… రా ఏజెంటుగానో, అండర్ క్యాప్‌గానో చూపిస్తే దేశభక్తి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది… ఇంకేముంది..? హిందీ, కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం… ఈ అయిదే కాదు, ఇప్పుడు మరాఠీ, ఒడియాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు… కాస్త మౌత్ టాక్ వచ్చినా చాలు… డిజిటల్, శాటిలైట్ హక్కులు, థియేటర్ డబ్బులు… కోట్లకు కోట్లు… కమాన్ సైంధవ్… కమాన్… నీకేం తక్కువ..? నువ్వెందుకు వెనకబడాలి..?
Share this Article