.
Bharadwaja Rangavajhala …. సౌత్ ఇండియా చాప్లిన్!
ఆయన అసలు పేరు గుండూరావు.
కానీ జనం గుండెల్లో మాత్రం నవ్వుల నగేశ్ గా స్థిరపడిపోయారు.
అరవై దశకంలో దక్షిణ భారత చలనచిత్ర ప్రపంచంలోకి రెండు అద్భుతమైన ఎనర్జీ ఉన్న హాస్య తారలు ప్రవేశించాయి.
అందులో ఒకటి తెలుగులో ప్రకాశిస్తే…
రెండోది తమిళనాడులో చెలరేగిపోయింది.
మొదటి పేరు రాజబాబు.
రెండో పేరు నగేశ్.
1958లో విడుదలైన మనముల్ల మరుధారం చిత్రంలో తొలిసారి కనిపించిన నగేశ్ 2009లో కన్నుమూసే ముందు కూడా కమల్ దశావతారంలో నటించారు.
1933 సెప్టెంబర్ 27న కర్ణాటక రాష్ట్రంలో చిక్మగ్ళూర్ లో పుట్టాడు నగేశ్.
తొలి రోజుల్లో స్టేజ్ నాటకాలు ఆడేవాడు.
ఇంతలో రైల్వేలో ఉద్యోగం వచ్చింది.
అది చేస్తూనే నాటకాలూ కొనసాగించాడు.
ఇదేదో బానే ఉందనుకుంటున్న దశలో సినిమా రంగం నుంచి పిలుపు వచ్చింది.
Ads
చాలా మంది డైరక్టర్లు నగేశ్ తో కామెడీ చేయించే ప్రయత్నమే చేశారు.
కానీ నగేశ్ నవరసాలూ పండించగల నటుడు. ఒక రకంగా దక్షిణ భారత చార్లీ చాప్లిన్ అనదగ్గ నటుడు.
నగేశ్ కు ముందు తమిళ హాస్యం ఒక ధోరణిలో సాగేది.
నగేశ్ తర్వాత అది మారింది.
హాస్యానికి వాచకంతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్.
బాడీ లాంగ్వేజ్ ద్వారా కామెడీని కన్వే చేయడంలో నగేశ్ మాస్టర్.
ఈ ప్రయత్నంలోనే బహుశా తను డాన్స్ లోనూ ప్రావీణ్యం సంపాదించాడు.
సర్వర్ సుందరం లాంటి సినిమాల్లో అద్భుతమైన డాన్సులు చేసి ఆడియన్స్ నేమిటి…కమల్ హసన్ లాంటి హీరో మనసునూ దోచుకున్నాడు.

నగేశ్ లోని నటుడ్ని కనిపెట్టింది మాత్రం బాలచందరే.
నగేశ్ టైటిల్ రోల్ లో కనిపించిన సర్వర్ సుందరం కథ బాలచందర్ దే.
దర్శకత్వం మాత్రం కృష్ణన్ పంజు నిర్వహించారు.
హోటల్ సర్వర్ గా జీవితాన్ని ప్రారంభించిన సుందరం ఫైనల్ గా ఓ పెద్ద సినిమా స్టార్ గా ఎదుగుతాడు.
ఈ ఎదుగుదలలో ఏం కోల్పోతాడు…
ఏం నేర్చుకుంటాడు…అనేదే కథ.
హ్యూమన్ సైకాలజీ మీద కథ నడపడం బాలచందర్ కు అలవాటే.
నగేశ్ మీదే కాదు… బాలచందర్ మీద కూడా చాప్లిన్ ప్రభావం చాలానే ఉందని ప్రూవ్ చేసిన చిత్రం సర్వర్ సుందరం.
నగేశ్ తెలుగులోనూ చాలా చిత్రాల్లో నటించారు.
ఎందుచేతో నిర్మాత రామానాయుడితో నగేశ్ కి ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది.
సురేష్ బ్యానర్ లో వచ్చిన చాలా చిత్రాల్లో నగేశ్ కనిపిస్తాడు. శోభన్ బాబుతో తీసిన సోగ్గాడులో కామెడీ కమ్ కారక్టర్ రోల్ లో నగేశ్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తాడు.
నగేశ్ లో విపరీతమైన అబ్జర్వేషన్ ఉంది.
పాపులర్ డైరక్టర్ దాదా మిరాసీ కథ చెప్పే విధానం కొంత విచిత్రంగా ఉండేది.
ఎన్టీఆర్ హీరోగా చేసిన నిర్దోషి లాంటి తెలుగు సినిమాలు కూడా ఆయన డైరక్ట్ చేశారు.
బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ తో సహా మిమిక్రీ చేస్తూ మరీ నిర్మాతకు కథ చెప్పడం ఆయన పద్దతి.
దాన్ని నగేశ్ పట్టుకున్నాడు.
శ్రీధర్ తీసిన కాదలిక్క నేరమిల్లై లో డైరక్టర్ కావాలనుకునే కుర్రాడి పాత్ర చేశాడు నగేశ్.
అక్కడ దాదా మిరాసీని దింపేశాడు.
ఆ సినిమా తెలుగు రిమేక్ లో చలం వేశారు ఆ పాత్ర.
నగేశ్ మీడియా ఇంటర్యూలకు చాలా దూరంగా ఉండేవాడు. కారణం మీరు నటించిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది అనే ప్రశ్న వేస్తారనే.
ఎందుకంటే… ప్రతి పాత్రనూ డెడికేషన్ తోనే చేస్తాం…
అనేక కారణాల చేత ఒక్కో పాత్ర పేలుతుంది మరో పాత్ర తుస్సుమంటుంది.
కష్టంలో తేడా ఉండదు.
అలాంటప్పుడు ఏది నచ్చిన పాత్ర అంటే ఎలా చెప్తాం… అనేవారాయన.
నగేశ్ లోని నటుడు బాగా తెలిసిన దర్శకుడు కూడా బాలచందరే.
మేజర్ చంద్రకాంత్ తమిళ సినిమాలో చాలా సీరియస్ కారక్టర్ లో నగేశ్ ను చూపించారాయన.
అప్పటికే కమేడియన్ గా పాపులర్ అయిన నగేశ్ ను ఆ కొత్త తరహా కారక్టర్ లోనూ ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. అదే సినిమా తెలుగులో సుఖదు:ఖాలుగా వచ్చింది.
తమిళ్ లో నగేశ్ చేసిన కారక్టర్ ను తెలుగులో చంద్రమోహన్ పోషించాడు.
తెలుగులోనూ కొన్ని కామెడీ మిక్స్ అయిన సెన్స్ బుల్ కారక్టర్లు చేశారు నగేశ్.
అలాంటి వాటిలో పాపం పసివాడులో మామయ్య కారక్టర్ ఒకటి.
పిల్లలంటే చాలా ఇష్టపడే పాత్రలో పిల్లల్ని అలరించే రకరకాల వేషాలతో ఆకట్టుకుంటాడు. పిల్లలనే కాదు…పెద్దలనీ ఎంటర్ టైన్ చేస్తాడు నగేశ్.
ఉదాహరణ కు తొలి ప్రేమలో ఆయన చేసిన పాత్ర తను చాలా ఎంజాయ్ చేస్తూ చేసినదే!
నటుడుగా కామెడీ పాత్రలే అధికంగా చేసిన నగేశ్ అన్ని భాషల్లోనూ కలిపి దాదాపు వెయ్యి చిత్రాల వరకు చేశారు. అయితే ఆయన నటుడుగానే ఆగిపోలేదు.
దర్శకుడుగా మారారు.
నిర్మాణంలోనూ బాధ్యతలు తీసుకున్నారు.
తెలుగులో సురేష్ బ్యానర్ లో మొరటోడు టైటిల్ తో సినిమా డైరక్ట్ చేశారు నగేశ్.
అదీ కైకాల సత్యనారాయణను హీరోగా పెట్టి. కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా మంచి సినిమాగా క్రిటిక్స్ అప్లాజ్ సాధించారు నగేశ్.
తమిళ సినిమాల్లో ఎమ్జీఆర్, శివాజీల పక్కన హాస్యగాడి పాత్రలో కనిపించిన నగేశ్ అదే తరహా పాత్రలు తెలుగులోనూ చాలానే చేశారు.
అప్పటి ఫార్ములా ప్రకారం కమర్షియల్ హీరోకి ఓ కామెడీ నెచ్చెలికాడు ఉండేవాడు.
అదే లెక్కలో వేటగాడులో ఎన్టీఆర్ నెచ్చెలికాడుగా నగేశ్ చేసే హడావిడి మామూలుగా ఉండదు.
ఇక తిల్లు అలియాస్ మమత ప్రేమికుడుగా అల్లు రామలింగయ్యతో ఆడుకునే సన్నివేశాలను అద్భుతంగా పండించాడు.
అక్కినేని నటించిన వసంతగీతం చిత్రంలో అయిన దాదాపు అక్కినేనితో సమానమైన కారక్టర్ లో కనిపిస్తాడు నగేశ్.
సింగీతం శ్రీనివాస రావు గారు ఈ సినిమా దర్శకుడు.
జంధ్యాల డైరక్ట్ చేసిన అమరజీవి, డి.వి.నరసరాజు తీసిన కారుదిద్దిన కాపురం చిత్రాల్లో నగేశ్ చేసిన పాత్రలు మరొకరు చేయలేనివే.
వయసు పైబడ్డ సమయంలోనూ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపించేవారు నగేశ్.
అలా మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు తీసిన అల్లరి మొగుడు మూవీలో నా పాట పంచామృతం అని భయపెట్టే శాస్త్రీయ గాయకుడుగా అదరగొట్టేశారు.
ఆ పాత్ర నగేష్ చేయడం వల్లే పండింది.
సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు దక్షిణాది ప్రేక్షకలోకాన్ని తన నటనతో అలరించిన నగేశ్ ను కనీసం పద్మశ్రీ పురస్కారానికి రికమండ్ చేయకపోవడం శోచనీయం. 2008 ప్రారంభం నుంచి నగేశ్ ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది.
ఆ దశలోనూ ఆయన నటనకు పుల్ స్టాప్ పెట్టలేదు.
కమల్ దశావతారం చిత్రంలో కె.ఆర్.విజయ కాంబినేషన్ లో చక్కని పాత్రలో నటించారు.
2009 లో సెలవంటూ ఈ లోకాన్ని వీడిన నగేశ్ భౌతికంగా దూరమైనా…
తన నటనతో మనల్ని ఎప్పటికీ ఛార్జ్ చేస్తూనే ఉంటాడు.
ఎందుకో గుర్తొచ్చాడు…
రాజబాబు గురించి ఆలోచిస్తూ ఉంటే నగేష్ వచ్చాడు…
Share this Article