.
అయ్యో, అయ్యో, అన్యాయం అండీ… సినిమాను సినిమాగా చూడాలి ప్లీజ్ అంటున్నాడు విష్వక్సేన్ రాబోయే సినిమా లైలా నిర్మాత సాహూ… వైసీపీ బ్యాచ్ @BoycottLaila నినాదాన్ని టాప్ ట్రెండింగులోకి తీసుకురావడంతో వణుకు పుట్టినట్టుంది…
సినిమాను సినిమాగా చూడాలి సరే… మరి ఆ సినిమా ఫంక్షన్‌ను రాజకీయం చేసింది ఎవరు…? ఫస్ట్ చిరంజీవి… ప్రజారాజ్యం సినిమా రూపాంతరమే జనసేన అట… అంటే మరి కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసింది ఏమిటి అప్పట్లో… తూచ్, అంతా ఉత్తదేనా..? పైగా ఈ సందర్భంలో ఆ ప్రస్తావన దేనికి..? ఈ సినిమాకూ రాజకీయ వ్యాఖ్యలకూ లింక్ ఏమిటి..?
Ads
ఎవరో విలేకరి ఏదో అన్నాడు, అడిగాడు… విష్వక్సేనూ, నువ్వు బాలయ్య కంపౌండ్ కదా, మెగా కంపౌండ్‌కు వచ్చావేమీటీ అని..! దానికీ చిరంజీవి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు… మేం కంపౌండులకు అతీతం అని…!
అదేదో వివరణ విష్వక్సేన్ ఇచ్చుకుంటాడు కదా, అడిగింది తనను కదా… మరి ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన నీకు దేనికి ఆ నొప్పి..? ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పైత్యం మరోరకం… కావాలనే వైసీపీకి వచ్చిన 11 సీట్లను ప్రస్తావించాడు… ఇన్‌డైరెక్టుగా వైసీపీ పరాజయాన్ని గేలి చేశాడు, అదీ అసందర్భంగా…!
మొదట్లో సినిమా ఇండస్ట్రీ జగన్‌ను వెలివేసినట్టు వ్యవహరించినా సరే, ఈ పృథ్వి వంటి ఒకరిద్దరు, అదీ ఇండస్ట్రీలోని థర్డ్ లేయర్ నటులు జగన్‌తో నడిచారు… తరువాత ఎస్వీబీసీ వ్యవహారాల్లో, టీటీడీ వ్యవహారాల్లో వేళ్లు కాళ్లు పెట్టి, బదనాం అయిపోయి, చివరకు జగన్‌ను విడిచిపెట్టాడు… (ఇప్పుడు జనసేనతో ఉన్నాడా..? తెలియదు..!)
చిరంజీవి ముందు మాట్లాడి మార్కులు కొట్టేయడానికి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన కమెడియన్ పృథ్వీ… చిరంజీవి వచ్చిన తరువాత మాట్లాడతా అని అన్నాడు… ఆయన రావడానికి టైం పడుతుంది కానీ మీరు మాట్లాడండి అని అన్నది యాంకర్ సుమ… దాంతో కమెడియన్ పృథ్వీ తన స్పీచ్ కొనసాగిస్తూ…
‘ఇది యాదృచ్ఛికమో ఏమో కానీ సుమ గారూ.. ఈ సినిమాలో మేకల సత్తిగా కనిపించాను. ఇందులో డైరెక్టర్ గారు దమ్కీ మామూలుగా ఇవ్వలేదు. మేకల సత్తి ఓ సీన్‌లో మేకలు ఎన్ని ఉన్నాయ్ రా అని అంటాడు.. 150 ఉన్నాయ్ అని అంటారు… లాస్ట్ సినిమా అయిపోయే టైంకి మేకల్ని లెక్కపెడితే 11 మేకలే ఉంటాయి. ఇలాంటి బ్రహ్మాండమైన సీన్లు సినిమాలో పెట్టారు’ అంటూ సెటైర్లు వేశాడు…
వైసీపీ బ్యాచుకు మండింది… ఎప్పుడైతే వైసీపీ బ్యాచ్ బ్యాన్‌లైలా అనే హ్యాగ్‌ట్యాగ్‌ను బలంగా ట్రెండింగులోకి తెచ్చిందో నిర్మాతకు చురుకు పుట్టింది… అయ్యో, అయ్యో, ఆయన మాట్లాడినప్పుడు మేం చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాం అని ఏదో చెప్పకునే ప్రయత్నం చేశాడు… జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది… చిరంజీవి కూడా రాజకీయాలు మాట్లాడాడు…
ఇదే కాదు.., రిపబ్లిక్, గేమ్ ఛేంజర్ వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పొలిటికల్ స్పీచ్‌ల ప్రభావం కూడా ఆ రెండు సినిమాలపై పడింది… ఇలాంటి పృథ్విలు, హైపర్ ఆదిలు మాత్రమే కాదు, ఏకంగా పవన్ కల్యాణ్, చిరంజీవిలు కూడా అసందర్భంగా సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు ప్రస్తావిస్తున్నారు… దాంతో ఒక సెక్షన్ ఆయా సినిమాలకు దూరమయ్యే సిట్యుయేషన్…!!
చివరకు హీరో విష్వక్సేన్ తెరపైకి వచ్చాడు… ఆయన మాట్లాడేటప్పుడు మేం వేదిక మీద లేం, లేకపోతే మైక్ గుంజుకునేవాడిని, హెచ్‌డీ ప్రింట్ కూడా నెట్‌లో లీక్ చేస్తామంటున్నారు కొందరు… ఒకరు చేసిన తప్పుకు మేమెందుకు బలికావాలి..? తన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, మా మూవీని చంపేయొద్దు అని క్షమాపణ చెప్పుకున్నాడు…
ఈ దెబ్బకు పృథ్విని ఇక ఎవడూ సినిమాల్లోకి తీసుకోరేమో..! విష్వక్సేన్ సినిమా ప్రచారం అంటేనే ఓ కంట్రవర్సీ… కొనసాగుతోంది ఆ ఆనవాయితీ… (అవునూ, సినిమా ఫంక్షన్లలో ఎలా మాట్లాడాలో తెలియకపోతే అల్లు అర్జున్ ఏం అనుభవించాడో తెలుసు కదా…)
చివరగా… పృథ్వి మాట్లాడుతూ డైరెక్టర్ గారూ వినండి అన్నాడు… అంటే డైరెక్టర్ అక్కడే ఉన్నాడు… మరి తను వెళ్లి మైక్ ఎందుకు గుంజుకోలేదు విశ్వక్..!?
Share this Article