అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది… నానాటికీ కొడిగట్టిపోతున్నది కదా హాస్యకళ…, ఏదో రాజకీయ నాయకులు, చండప్రచండ జ్ఞానులైన సినిమా పర్సనాలిటీలు, బూతుతో హాస్యకళను బతికించాలని అరచేతులు అడ్డుపెడుతున్న ఈటీవీ మల్లెమాల జబర్దస్త్‌లు, సొసైటీని అబ్రకదబ్ర అని గాలిలో పోస్టులు ఊపి అర్జెంటుగా ఉద్దరించే సోషల్ యాక్టివిస్టులు… వీళ్లే లేకపోతే హాస్యకళ ఎప్పుడో అంతరించిపోయేది కదా… ప్రత్యేకించి నాయకుల గురించి చెప్పుకోవాలి…
ఫాఫం, గతంలో గిరిగీసుకుని, తెలిసీతెలియనితనంతో, మూర్ఖపు హుందాతనంతో రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడేవాళ్లు… అఫ్‌కోర్స్, సినిమావాళ్ల మాటల్ని ఎవడూ చెవినపెట్టేవాళ్లు కాదు… కానీ ఇప్పుడు సినిమా సెలబ్రిటీతనం ప్లస్ రాజకీయతనం కలగలిపిన వృత్తి వచ్చింది కదా… వాళ్లు మస్తు వినోదాన్ని పండిస్తున్నారు… వాళ్ల ప్రసంగాలు, జ్ఞానబోధలు, హితోక్తులు, బాష్యాలు, ప్రవచనాలు ప్రజలకు అపరిమితమైన వినోదానందాన్ని కలగజేస్తూ… బీపీ, స్ట్రెస్ తదితర అనారోగ్యాల నుంచి కాపాడుతున్నయ్…
కంపేరిటివ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే… ఈ విషయంలో ఖచ్చితంగా ఏపీయే ముందంజలో ఉంది… కేఏపాల్ నుంచి మోహన్‌బాబు దాకా చాలా ప్రయాసపడుతున్నారు… తెల్లారిలేస్తే పత్రికల్లో, టీవీల్లో బోలెడు మంది కనిపిస్తుంటారు… కొందరు నాయకులు వెగటు పుట్టే బూతు మాటలతో కల్తీ చేస్తున్నా సరే, జనాన్ని ఎంటర్‌టెయిన్ చేస్తున్నారు… తెలంగాణలో ఈమధ్య కొందరు మంత్రులు ఈవిషయంలో ముందంజలో ఉన్నారు… బండ్ల గణేష్ వంటి కమెడియన్లు లేనిలోటు భర్తీ చేస్తున్నారు… బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఇంకా కష్టపడాల్సి ఉంది ఈ విషయంలో…
Ads
ఆమధ్య భారత పుత్రుడు అనబడే ఓ సినిమా తీసి జనం మీదకు వదిలిన మోహన్‌బాబుకు ప్రజల అజ్ఞానం మీద మహాగురి… అందుకే డమ్మీలతో ఓ సినిమా లాగించేశాడు… భయానికో భక్తికో, డబ్బులేమీ ఇవ్వకుండా ఒక్కరోజు గెస్టు ఆర్టిస్టులుగా వచ్చిన నటులకు డమ్మీలతో సినిమా పూర్తిచేయడం అనేది ప్రపంచంలో బహుశా ఏ నిర్మాతకు, ఏ దర్శకుడికీ చేతకాలేదేమో… సరే, ప్రేక్షకులు కూడా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని, చాలా గౌరవప్రపత్తులతో మధ్యాహ్నం ఆటకు భద్రంగా షోలు ఎత్తించేశారు… అది వేరే చర్చ…
ఆమధ్య ఎక్కడో మాట్లాడుతూ… నేను ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకున్నాను అని ఓ చారిత్రక ప్రకటన జారీ చేశాడు… అసలు ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నదెప్పుడబ్బా అని జనం నిర్ఘాంతపోయారు… ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు, తాజాగా ప్రజలెవరికీ తెలియని ఓ సత్యాన్ని వెల్లడించాడు… 1998లో తను ఏపీలో బీజేపీకి ప్రచారం చేస్తే 18 శాతం వోట్లు వచ్చాయట… సోము వీర్రాజూ, నోట్ దిస్ పాయింట్ అని కూడా నొక్కిచెప్పాడు…
అమిత్ షాకు, మోడీకి ఇప్పటికైనా క్లారిటీ రావాలి… ఏపీలో బీజేపీకి ఏం కావాలో తేల్చుకోవాలి… ఆ 18 శాతం వోట్లు ఎవరి పుణ్యమో ఇకనైనా బుర్రలోకి ఎక్కించుకోవాలి… అప్పట్లోనే 18 శాతం అంటే, ఇప్పుడు తన పుత్రుడు ప్లస్ భారతపుత్రుడి ధాటికి మరో 10 శాతం వరకూ పెరిగి ఉంటయ్… వాటికి మోడీ బాపతు కొన్నివోట్లు కూడా కలిస్తే ఇంకేముంది..? ట్రిపుల్ ఆర్ సినిమాయే..!! ప్చ్, అనుకుంటాం గానీ మోడీ షాలకు కొన్నిసార్లు ఏమీ తెలియదు ఫాఫం…!!
Share this Article