వారానికి ఒకసారి లేదా నెలకోసారి రెవిన్యూ ఆఫీసుల్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు కదా… అంటే ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటారు లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇస్తారు… ఉత్తరప్రదేశంలో కూడా సంపూర్ణ సమాధాన దివస్ పేరిట నిర్వహిస్తుంటారు… మొన్న గోండా జిల్లా, కల్నల్‌గంజ్ తహసిల్దార్‌కు ఈ సమాధాన దివస్ సందర్భంగా సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు ఓ కంప్లయింట్ ఇచ్చాడు… ఎవరి మీద..? ఏమని..?
‘‘అయ్యా, కొన్నాళ్లుగా మా ప్రాంతంలో అస్సలు వర్షాలు పడటం లేదు, కరువు కనిపిస్తోంది… చాలా ఇబ్బందిగా ఉంది… అందువల్ల వర్షాలకు బాధ్యుడైన ఇంద్రదేవుడి మీద చర్య తీసుకోగలరు…’’ ఇదీ ఫిర్యాదు… నిజానికి ఇది కాదు వార్త… సదరు తహసిల్దార్ సింపుల్‌గా ‘‘తగు చర్య నిమిత్తం’’ అంటూ ఏకంగా కలెక్టర్‌కు ఫార్వర్డ్ చేశాడు…
నిజానికి ఈ సమాధాన దివస్‌లో ఏ ఫిర్యాదు వచ్చినా… ముందు చదవాలి… అది ఏ శాఖకు సంబంధించిందో చూడాలి… వాళ్లకు పంపించాలి, రెవిన్యూ సమస్య అయితే వాళ్లే పరిష్కరించాలి… కానీ ఇక్కడ తహసిల్దార్ సింపుల్‌గా కలెక్టర్‌కు పంపించాడు… కలెక్టర్ ఏం చేయాలి..? పెద్దగా ఏమీ ఉండదు… కట్టలుకట్టలుగా ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి… కానీ ఈ ఫిర్యాదును తహసిల్దార్ చూడకుండానే కలెక్టర్‌కు పంపించిన తీరు, అదీ ఇంద్రుడిపై ఫిర్యాదు కావడంతో సోషల్ మీడియా, మీడియా హైలైట్ చేశాయి…
Ads
జనం నవ్వుకోవడం మొదలెట్టారు… ఇదీ మన పాలనయంత్రాంగం పనితీరు… మన అధికారులు మనల్ని పట్టించుకునే తీరు అంటూ విమర్శలు మొదలయ్యాయి… కలెక్టర్లు కూడా ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు, కానీ ఎప్పుడైతే మీడియా, సోషల్ మీడియా తెగ వెక్కిరించడం ప్రారంభమైందో సదరు కలెక్టర్‌కు తలకొట్టేసినట్టయింది… నిజానికి తహసిల్దార్ కూడా ఉద్దేశపూర్వకంగా పంపలేదు… పని ఒత్తిడి కావచ్చు, ఫిర్యాదులన్నీ చదివే టైం లేక వెంటవెంటనే డిస్పోజ్ చేయాలనే తొందరపాటుతో ఆ పని చేసి ఉండొచ్చు… లేదా తన వర్కింగ్ స్టయిలే అది కావచ్చు…
సదరు ఫిర్యాదుపై ‘అగ్రాసరిత్’ (Forwarded) అని స్టాంప్ వేసి ఉంది… తహసిల్ ఆఫీసు ముద్ర, అధికారి సంతకం కూడా ఉన్నాయి… సో, ఉన్నతాధికారులకు కోపం వచ్చింది… కలెక్టర్ CRO ను ఎంక్వయిరీ ఆఫీసర్‌గా వేశాడు… ఆయన తహసిల్ ఆఫీసుకు వెళ్లి, పూర్వాపరాలు విచారించి, ఓ రిపోర్టు ఇస్తాడన్నమాట… అంతిమంగా జరిగేది ఏమీ ఉండదు… మరీ బుల్‌డోజర్లను ఇంటి మీదకు పంపించాల్సినంత సీరియస్ తప్పులేమీ కావుగా… దైనిక్ జాగరణ్ రిపోర్టర్ సదరు తహసిల్దార్ నర్సింహ నారాయణ వర్మను వివరణ అడిగితే… ‘‘ఔనా..? అలా జరిగిందా..? నా దృష్టికి రాలేదే..’’ అన్నాడు… మీ ఆఫీసు స్టాంప్ కూడా ఉందని గుర్తుచేస్తే… ‘‘బహుశా అది డూప్లికేట్ స్టాంప్ కావచ్చు..’’ అని తేలికగా తీసిపడేశాడు…!!
Share this Article