ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఈవో వికాస్‌రాజ్‌కు ఓ లేఖ రాసి, అందులో పోలీసుల ఎన్నికల తనిఖీలను గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టుగా ఉందని వ్యాఖ్యానించింది… అసలు వికాస్‌రాజ్‌కు ఫీల్డులో ఏం జరుగుతుందో నిజం తెలిస్తే కదా, తెలుసుకోవాలని అనుకుంటే కదా, ప్రజలు అవస్థలు పడొద్దని భావిస్తే కదా ఆయన రియాక్టయ్యేది… పోలీసులు చెప్పే స్వాధీనం అంకెల్ని, పోలీసుల తనిఖీలను కూడా తన ఘనతగా చెప్పుకుంటాడు కదా…
నిన్న ‘ముచ్చట’ ఈ తనిఖీలు జనాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నాయో, మీడియా కూడా ఎలా దారితప్పిందో సవివరంగా ఓ కథనం పబ్లిష్ చేసింది కదా… దానికి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ వార్తను ఉదాహరణగా చూపించాం… ఈరోజు ఆంధ్రజ్యోతి మంచి వార్త రాసింది… ఈ సోయి మిగతా పత్రికలకు లేకుండా పోయింది, ఈనాడు మరీ ఘోరం… పత్రిక అనే లక్షణాల్ని వేగంగా వదిలేసుకుంటోంది అది…
ఆంధ్రజ్యోతి స్టోరీలో ఇచ్చిన తాజా ఉదాహరణలు చాలు ఈ ఎన్నికల తనిఖీలు నిజంగానే ఎఫ్‌జీజీ చెప్పినట్టుగానే ఉన్నాయని చెప్పడానికి..! మచ్చుకు ఓ ఇన్సిడెంట్ (జ్యోతిలో వచ్చిందే) చదివితే చాలు, ఈ తనిఖీలు, స్వాధీనాలు ఎంత దారుణంగా ఉంటున్నాయో చెప్పేయొచ్చు… ఒక రైతు గేదెను కొనడానికి బ్యాంకులో 1.40 లక్షల్ని డ్రా చేస్తుండగా, మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు వోచర్ రాయడానికి సహకరించింది…
Ads
ఆ డబ్బు తీసుకుని బయటికి రాగానే 50 వేలకు ఎక్కువగా ఉన్నాయంటూ స్వాధీనం చేసేసుకున్నారు… ఇదేమంటే, నా డ్యూటీ నేను చేశాను అన్నదట ఆమె… ఇదా డ్యూటీ..? ఇంతకుమించిన దారుణమైన ఉదాహరణ ఇంకేముంటుంది..? వెల్ డన్ ఆంధ్రజ్యోతి… సదరు రైతును ఏం ఆధారాలు లేవని సతాయిస్తున్నట్టు..? ఎవరికి పంచిపెట్టడానికి ఆ డబ్బు అక్రమంగా వెళ్తోంది వికాస్ రాజ్ సార్..? గేదె కొనడానికి డిజిటల్ పేమెంట్స్ చేసే దాకా మన సమాజం ఇంకా ఎదగలేదు సాబ్… ఫీల్డ్ చూడండి ఓసారి…
కారులో ప్రయాణించే ముగ్గురి దగ్గర తలా 50 వేలు ఉన్నాయి… మొత్తం కలిసి లక్షన్నర కదా, సీజ్ చేసేశారు… ఇవన్నీ కిలోల కొద్దీ బంగారం అని పత్రికల్లో గొప్పలు రాయించుకుంటున్నారు… దాదాపుగా అవన్నీ జువెలర్స్‌కు సంబంధించిన బంగారు ఆభరణాలే… పరిస్థితులు ఇలా ఘోరంగా ఉంటే ఈనాడు వాడికి ఏ పాత్రికేయ సోయీ లేకుండా పోయింది… తను కూడా నమస్తే స్థాయికి దిగజారిపోయినట్టుంది చూడబోతే…
ఒకవైపు జనం అవస్థలు పడుతుంటే… ఈనాడు ఏం రాసిందో తెలుసా..? జస్ట్, ఇలా ఆధారాలు ఇస్తే నగదు, నగలు వెనక్కి ఇచ్చేస్తారు, గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేశారు, అబ్బే, అస్సలు ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా రాసుకుంటూ పోయింది… ఆధారాలే కదా అసలు సమస్య… పైగా పోలీసుల నుంచి ఐటీ, పోలీసుల నుంచి రిటర్నింగ్ అధికారులకు, వాళ్ల నుంచి గ్రీవెన్స్ సెల్స్‌కు, అక్కడి నుంచి మళ్లీ రిటర్నింగ్ అధికారులకు, వాళ్ల దగ్గరి నుంచి మళ్లీ పోలీసుల దగ్గరకు ప్రజలు, అనగా బాధితులు తిరగాల్సి ఉంటుంది…
అసలు ఇలా ఎలా పడితే అలా తనిఖీ స్వాధీనాలు చేయడం ఏమిటి..? 50 వేలకు మించి నగదు అనే నిబంధనే నాన్సెన్స్… తనిఖీల్లో పోలీసులు పట్టుకోవడం, తరువాత గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి మీ చావు మీరు చావండి అనేయడం… ఇదేనా న్యాయం కోసం ఇంత తిప్పులాటలు… అబ్బే, అవస్థలే లేవు, జస్ట్, 48 గంటల్లో మీ నగదు, మీ నగలు మీకు ఇచ్చేస్తారు అని రాయడం, ప్రజలు పడుతున్న అవస్థల్ని రాయకపోవడం ఇదోరకం పాత్రికేయ దౌర్భాగ్యం…
ఒకాయన ఈ తనిఖీలతో మండిపడుతూ… అధికారంలో ఉన్న పార్టీ రకరకాలుగా జనం ఖాతాల్లోకే డబ్బు వేస్తోంది… వేల కోట్లు… అలా ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బు వెళ్తుంటే, ఈ చిన్నాచితకా తనిఖీలతో జనాన్ని అవస్థ పెట్టడం దేనికి అన్నాడు… ఈ వార్తలు చదువుతుంటే నవ్వొచ్చే పోలీసుల ఓవరాక్షన్ కూడా కనిపిస్తుంది… డ్రగ్స్, గంజాయి స్వాధీనాలు… జనానికి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారా ఎన్నికల్లో లబ్ధి కోసం..? పైగా ఏ పార్టీ అయినా వజ్రాలు, బంగారం బిస్కెట్లు ఇస్తుందా..? వోట్ల కోసం గంజాయి పంచుతుందా..?
సాక్షి స్టోరీలో సీరియస్‌నెస్ లేదు, ఇస్తినమ్మ వాయినం తరహాలో ఓ మొక్కుబడి స్టోరీ రాసేసి చేతులు దులుపుకుంది… అసలు ఈ తులం బంగారం, 50 వేల నగదు అనే పరిమితికి అర్థముందా..? ఇంతకీ ఈ ఎన్నికల విపత్తుకు పరిష్కారం ఏమంటారు సార్..? టీవీలకు ఎలాగూ చేతకాదు, వాటికి ఎంతసేపూ వాడిని వీడు తిట్టాడు, వీడిని వాడు తిట్టాడు వార్తలు తప్ప ఇంకేమీ చూపించవు… అదొక దిక్కుమాలిన పాత్రికేయం… సో, ప్రింట్ మీడియాయే జనం రెస్క్యూలోకి రావాలి… నమస్తేలు, వెలుగులు వదిలేయండి… వెన్నెముక లేని ఈనాడుకూ వదిలేయండి… చేయగలిగితే జ్యోతి, సాక్షికి అవకాశం… చూడాలిక…
Share this Article