అదేమిటో గానీ… మన తెలుగువాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదు మొర్రో అని మనం ఏడుస్తుంటాం… కానీ వర్తమాన సవాళ్లకు దీటుగా… హీరోలే పరమార్థంగా బతికే మన ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న కేరళ ప్రతిభను చూడాలి… వావ్… బ్లాకీస్, నో ప్రాబ్లం… మొహమంతా మొటిమలు, గుంతలు, నో ప్రాబ్లం… డీగ్లామరైజ్డ్ రోల్స్, నో ప్రాబ్లం… కొత్త చరిత్రలు లిఖిస్తున్నారు… హేట్సాఫ్… నిజానికి తెలుగు ఇండస్ట్రీ కూడా అంతే కదా… సినిమాలు అంటే తమిళ లేదా మళయాళీలు… టీవీ సీరియళ్లు అంటే కన్నడిగులు… తొక్కలో తోలురంగుతో నెట్టుకొచ్చిన హిందీ భామల్ని ఇప్పుడెవరూ దేకడం లేదు… పూజా హెగ్డేల తొడలు, కాళ్లు చూస్తూ… హీరోలు కిందపడి దొర్లుతూ… సామజవరగమనా అంటూ దిగజారిన సిరివెన్నెలలు కూడా ఆ దొర్లుడులో భాగం అవుతూ… ఇంకా కొట్టుకుపోతున్నాం… కానీ ఒక పాత్రకు మెరిట్ కావాలి అనేసరికి మళ్లీ ఏ తమిళ భామో, ఏ మళయాళీ ముద్దుగుమ్మో కావాల్సిందే…
కొత్తగా రిలీజైన ఓ మళయాళీ సినిమా… పేరు మాలిక్… అందులో హీరో ఫహద్ ఫాజిల్… జగమెరిగిన నటుడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే, మన తెలుగు అగ్రనటులు కూడా తన సినిమాలు చూస్తూ నటనలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలి… అభిమానులకు కోపమొస్తే రానీగాక… నిజాన్ని చెప్పుకోవాలి… తన నటన గురించి చెప్పుకోవాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… మాలిక్ సినిమాను ఒంటి చేత్తో మోశాడు… అదేసమయంలో ఆ భారంలో చాలాభాగం భాగస్వామిగా నిలిచింది రోస్లిన్ అనే కేరక్టర్… ఫహద్‌కు సరిసమానమైన నటన కనబర్చింది… అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నిమిష సజయాన్ అనే నటి…. ఓ పాత్రలోకి పూర్తిగా దూరిపోవడం అంటే, పాత్రను ఆవాహన చేసుకోవడం అంటే… ఆమే..!
Ads
మేకప్ వేసుకుని, గ్లామర్ ఒలికించే పాత్రలు చేయలేక కాదు… కానీ వాటికి ఆమె దూరం… మాలిక్‌లో వయస్సు మళ్లిన పాత్రకూ సై… ఎలాంటి డీగ్లామరైజ్డ్ పాత్రకైనా సై… కానీ ఆ పాత్రకు ఓ ప్రాధాన్యం ఉండాలి… అది తనకు పరీక్ష పెట్టాలి… తనకు పదును పెట్టాలి… నా ఇంట్రస్టు అదే, నా ప్రాధాన్యమూ అదే అంటుంది నిమిష… గుండె నిండా ఆత్మవిశ్వాసం… ఈ సోకాల్డ్ స్టీరియోఫోనిక్, తోలుబొమ్మలాటల పాత్రలు నాకవసరం లేదు అంటోంది ఆమె… వావ్… అయితే ఆ ధైర్యం, ఇండస్ట్రీ ధోరణికి భిన్నంగా వెళ్ళే తత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే తన పుట్టుక నేపథ్యమూ గట్రా తెలుసుకోవాలి ముందు…
1997లో ముంబైలో పుట్టింది ఈమె… తండ్రి సజయాన్… వృత్తి రీత్యా ఇంజనీర్… కానీ రూట్స్ కేరళ… తల్లిది, తండ్రిది కేరళలోని కొల్లం జిల్లా… ఈ పిల్ల 8వ తరగతి వచ్చేసరికే టైక్వాండో బ్లాక్ బెల్ట్ సంపాదించేసింది… టైక్వాండో జాతీయ పోటీలకు మహారాష్ట్రను రిప్రజెంట్ చేసేది… చదువు పూర్తయ్యాక మళయాళ సినిమా ఆకర్షించింది… Thondimuthalum Driksakshiyum సినిమాకు గాను మూడేళ్ల క్రితం కేరళ ప్రభుత్వ అవార్డు కొట్టేసింది… Eeda (2018), Oru Kuprasidha Payyan (2018), Chola (2019), Stand Up (2019), The Great Indian Kitchen (2021) Nayattu (2021)… సినిమా ఏదయితేనేం… ఆమె ముద్ర పడాల్సిందే…
మాలిక్ సినిమా గురించి కాసేపు వదిలేద్దాం… మణిరత్నం నాయకుడు పోలికలు, అలాంటి సినిమాల ఛాయలు కనిపిస్తయ్… అక్కడక్కడా సాగదీత… కాకపోతే కథనవేగంలో లోపాలన్నీ కొట్టుకుపోతయ్… అయితే మనం ఆశ్చర్యంగా గమనించాల్సింది ఒకటుంది… గతంలో ఇలాంటి సినిమాల్ని చూసే వీలుండేది కాదు… ఇప్పుడు ఓటీటీ వచ్చాక సబ్ టైటిల్స్ చూస్తూ బోలెడు సినిమాల్ని చూసేస్తున్నాం… అంతేకాదు, రిలీజ్ వెంటనే రివ్యూలు కూడా రాసేసుకుంటున్నాం… నిజం చెప్పాలా, కాస్త నిష్ఠురంగా ఉంటుంది… కొన్ని తెలుగు సినిమాల్ని అసలు రివ్యూల నుంచే మినహాయించేస్తున్నాం కూడా… థాంక్స్ టు ఓటీటీ… సినిమా వీక్షణం తీరే మారిపోతోంది…
సరే, సినిమా పర్లేదు, మరీ గొప్పగా అనిపించదు కానీ… సినిమా తీసిన విధానం మెప్పిస్తుంది… సౌతిండియన్ సినిమా తాలూకు హీరోయిక్ అవలక్షణాలు ఏమీ కనిపించవు… కథే ఒక హీరోను ఎలివేట్ చేస్తుంది… అలాగని మిగతా పాత్రల్ని కరివేపాకుల్లా తీసిపారేయరు… ఏ పాత్ర ప్రాధాన్యం దానికి ఉంటుంది… రాజకీయాలు, మతం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ప్రజలకు ఎలా ద్రోహం చేస్తాయో కళ్లకు కడుతుంది సినిమా… అదుగో అలా రోస్లిన్ పాత్రకూ ఓ ప్రాధాన్యం దక్కింది… ఆ పాత్రలో జీవించిన నిమిషకూ పేరొచ్చింది… ఆమె ఉన్న ప్రతి సీన్‌నూ ఆమె డామినేట్ చేస్తుంది… కాంప్లిమెంట్స్ టు నిమిష… మరిన్ని పాత్రలతో వెండితెరకు మెరుపులు అద్దాలి నిమిషా…!
Share this Article