అక్కడ పునీత్… ఇక్కడ విశాల్… సోనూసూద్, అక్షయకుమార్ సహా నటి ప్రణిత, లారెన్స్‌ల వరకు… ఎవరైనా సరే, స్పందించే హృదయం ఉన్న సినిమా ప్రముఖుల ఔదార్యం గురించి చెప్పుకుంటున్నాం, మనస్పూర్తిగా ప్రశంసించాం… మెచ్చుకోవాలి కూడా… ఆ పొగడ్తలు మరో పదిమందికి స్పూర్తినివ్వాలి… (సారీ, ఇక్కడ టాలీవుడ్ పెద్ద తలకాయల గురించి మాట్లాడటం లేదు…) ఈ జాబితాలోకి జ్యోతిక, సూర్య పేర్లను కూడా చేర్చొచ్చు… వీళ్ల తాజా వితరణ మరీ భిన్నమైన, మానవీయ అంశం… ముందుగా వార్తేమిటో చెప్పుకుందాం… సూర్య, జ్యోతికలు తమ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ తరఫున కోటి రూపాయలను పళంకుడి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు విరాళం ఇచ్చారు… ఇది ఇరులార్ తెగలో అక్షరాస్యత కోసం కృషి చేస్తోంది… తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సాక్షిగా ఈ కోటి రూపాయల చెక్కును ట్రస్టు చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ చంద్రుకు అప్పగించారు… గుడ్…
సూర్య జైభీం అనే సినిమా తీశాడు కదా… అందులో ఓ పాత్ర అడ్వొకేట్ చంద్రు… ఇరులార్, ఇతర ఆదివాసీ తెగల కోసం తపనపడిన ఓ లాయర్ పాత్ర అది… ఓ సినిమా తీసేశాం, నాలుగు పోస్టర్ రిలీజులు, అయిదారు ట్రైలర్లు, టీజర్లు, గ్లింప్స్, ప్రిరిలీజ్ ఫంక్షన్లు అని ఖర్చుపెట్టేయకుండా… తమ వంతు బాధ్యతగా, ఆ సినిమా కథను ప్రేమించిన స్పూర్తితోనే… సదరు ఇరులార్ తెగ సంక్షేమం కోసం కోటి రూపాయలు ఇవ్వడం ముచ్చటేస్తోంది… సూర్య ఆలోచనల్లోని భిన్నత్వం ఎప్పుడూ అంతే… సరే, మంచిది, మెచ్చేసుకున్నాం… కానీ ఎవరు ఈ ఇరులార్ తెగ ప్రజలు… అదీ కాస్త చెప్పుకోవాలి… ఇరులార్ అంటే తమిళంలో చీకటి, నలుపు… ఆ తెగ పేరే నలుపు ప్రజలు… 80 శాతం వరకూ ఈ జాతి ప్రజలు తమిళనాడులోనే ఉంటారు, కొందరు కర్నాటక, కేరళలలో కూడా కనిపిస్తారు… మొత్తమ్మీద రెండున్నర లక్షలలోపే ఉంటారని అంచనా…
Ads
పాములు పట్టడంలో మహా నేర్పరులు… ఎలాంటి పామునైనా సరే, తమకు తెలిసిన రకరకాల సంప్రదాయ పద్ధతులతో పట్టేస్తారు… అంతేకాదు, వీళ్లను అధికంగా ఎలుకలు పట్టడానికి భూస్వాములు, రైతులు ఉపయోగిస్తుంటారు… ఎలుకల బొరియల్లోకి పొగను ఊదుతూ, బయటికి రప్పించి ఎలుకల్ని నిర్మూలిస్తుంటారు… (పంటలకు ఎలుకల వల్ల జరిగే నష్టం ఎక్కువే)… వాటితోపాటు ఈ తెగ ప్రజలకు తేనె సేకరణ, పొలాల్లోనూ రైస్ మిల్లుల్లోనూ కూలీపనుల ద్వారా ఉపాధి… నిరక్షరాస్యత, పేదరికం వాళ్లకు ప్రధానశాపాలు… సామాజిక వివక్ష సరేసరి… వీళ్లు మాట్లాడే భాష కూడా వేరే… ఇరులర్…
చాలా పురాతన తెగ ఇది… వీళ్ల వారసత్వ మూలాలపై కూడా పరిశోధనలు సాగుతున్నాయి… ఈ తెగను మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చి, విద్యావకాశాల్ని పెంచి, ఉపాధి చూపించే కార్యక్రమాల్ని పలు ట్రస్టులు, ఎన్జీవోలు సాగిస్తున్నాయి… ఇదీ ఇరులార్ తెగ నేపథ్యం… సినిమాల్లో ఆదర్శాల్ని ప్రదర్శించడం కాదు, ఆచరణలోనూ ఆ నిజాయితీని కాస్త చూపించాలనే సూర్య-జ్యోతికల ప్రయత్నానికి అభినందనలు… చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది ఈ లక్షణం..! కోటి అనేది ఎక్కువో, తక్కువో కానీ ఇది ఉదాత్తమైన ధోరణి..!!
Share this Article