ది ఆల్కెమిస్ట్ …. ఈ నవల మొదట పోర్చుగీస్ భాషలో ప్రచురింపబడింది. తరువాత 67 భాషలలోకి అనువదించబడింది. ఇప్పటికీ జీవించి ఉన్న ఓ రచయిత నవల ఇలా అత్యధిక భాషలలోకి అనువదింపబడిన తొలి రచన ఇది… 150 దేశాలలో ఈ పుస్తకం ఆరున్నర కోట్ల కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి… పాలో ఖెలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత (allegorical) మొట్టమొదట ఈ పుస్తకం 1988లో ముద్రింపబడింది… ఈ నవలలో “శాంటియాగో” అనే స్పానిష్ గొర్రెల కాపరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సాగించిన ప్రయాణం వర్ణింపబడింది. ఈ పుస్తకం కథాంశం హోర్హే లూయిస్ బోర్హెస్ రాసిన టేల్ ఆఫ్ టూ డ్రీమర్స్ (ఇద్దరు స్వాప్నికుల కథ) అనే కథపై ఆధారపడి ఉంది. ఈ నవలను పరుసవేది పేరుతో కె.సురేష్ తెలుగులోకి అనువాదం చేశాడు…
అలాగే అనిపిస్తుంది ఇది… ఈ ఉదాహరణ చూడండి… ఒక రాత్రి రేబై ఐసాక్కి ఓ కల వచ్చింది… తను ప్రాగ్‌కు వెళ్తే, ప్యాలెస్‌కి వెళ్లే దారిలోని ఓ వంతెన కింద నిధి కనిపిస్తుందనేది ఆ కల సారాంశం… మొదట పట్టించుకోలేదు, పదే పదే ఆ కల వరుసగా కొద్దిరోజులు వెంటాడింది… ఇదేదో తనకు మార్గోపదేశం చేస్తుందని అనుకున్న ఆయన అక్కడికి వెళ్లాడు… తీరా అక్కడ రేయింబవళ్లూ కాపలా కాసే సైనికులు… అక్కడే రెండు రోజులు తచ్చాడితే వాళ్లకు సందేహమొచ్చి పట్టుకుపోయి తమ ఉన్నతాధికారి ఎదుట నిలబెట్టారు… ఆయన ప్రశ్నించాడు, తను నిజం చెప్పాడు…
పిచ్చోడిలా ఉన్నావే… నాకూ కల వస్తోంది, నేను క్రాకో ఆవాసానికి వెళ్లి, అక్కడ ఎబెనియల్ కొడుకు ఐసాక్ ఇంట్లో, ఈశాన్యంలోని వంటగదిలో తవ్వితే నిధి వస్తుందని సూచిస్తోంది… కానీ అక్కడుండే మగాళ్లలో సగం మంది పేర్లు ఎబెనియల్, మరోసగం మంది పేర్లు ఐసాక్… నేనేం చేయాలి..? అని ప్రశ్నించి తనను వదిలేశాడు… అక్కడున్న వాళ్లంతా రేబైని చూసి పగలబడి నవ్వారు… రేబై సొంత ఊరికి వెళ్లిపోయాడు… తర్వాత నిజంగానే సదరు ఉన్నతాధికారి క్రాకో వెళ్లాడు, నిధి సొంతం చేసుకున్నాడు, జీవితాంతం హాయిగా బతికాడు…
తన జీవితాంతం కమర్షియల్ నవలల్ని రాసి, ఈరోజుకూ తన మొహం బయట సమాజానికి చూపించని మల్లాది వెంకటకృష్ణమూర్తి కొన్నేళ్ల క్రితం రాసిన ప్రయాణం అనే పుస్తకం చదువుతుంటే స్ఫురించాయి ఇవి… తనే ఎక్కడో చెప్పుకున్నట్టు గుర్తు… అరాచకంగా బతికిన తను ఓ దశలో రియలైజ్ అయ్యాననీ, తనను ఆధ్యాత్మిక కెరటం ముంచేసిందని…! ఈ పుస్తకం చదువుతుంటే కూడా ఒక పరుసవేది గుర్తొస్తుంది…
Ads
ఇది అందరూ చదవాల్సిన పుస్తకం కాదు… కాస్తోకూస్తో ఆధ్యాత్మిక భావనతో… లేదా ఆస్తిక నాస్తిక డోలాయమానంలో ఉండే వ్యక్తులకు ఉపయుక్తం… అనేకానేక ప్రవచనాల్ని ఒకేచోట సరళంగా, సంక్షిప్లంగా, సూటిగా చెబుతుంది ఇది… సన్యాసం తీసుకోవాలనుకున్న ఓ వ్యక్తి ఓ గురువు సూచన మేరకు దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాడు… సమాధి స్థితి తన కోరిక… ఎక్కడో మార్గం దొరక్కపోదు, ఏ గురువో తగిలి తనకు మార్గం సూచించకపోడు అనే ఆశతో తిరుగుతూ తిరుగుతూ… చివరకు సొంతూరికి చేరతాడు…
కాషాయం కడితేనే, ఏ అడవుల్లోనో, గుట్టల్లోనో బతికితేనే కాదు సన్యాసం… మనిషి బాహ్యరూపం కాదు ప్రధానం, తను అంతర్గతంగా సన్యసించాలి… ఓ సన్యాసి జీవనవిధానం ఏమిటో అర్థం చేసుకోవాలి… అదే ఈ పుస్తకం సారాంశం… రచయిత అనేక గుళ్ల అర్చన రీతులను పరిచయం చేస్తాడు… అమరనాథ్, కేదారనాథ్ మినహా దేశంలోని ప్రముఖ క్షేత్రాలను కథానాయకుడు సందర్శిస్తాడు.,. అనేక ఆశ్రమాల్లో గురువులతో సంభాషిస్తాడు, ప్రశ్నలు వేస్తాడు, జవాబులు వింటాడు…
కానీ చివరకు… ధవళ వస్త్రాలకు పరిమితమై, సొంతూరిలోనే సన్యాస జీవనానికి మళ్లుతాడు… కారణం సింపుల్… ఒక మనిషి సన్యాసి కావడం అంటే భౌతిక రూపం, ఆహార్యం, ఆహారం, భాషల్లో మార్పు కాదు… మొత్తంగా తన నడవడికను సన్యాస జీవనానికి అనువుగా మార్చుకోవడం… నిజానికి ఇది పరుసవేది నవలకన్నా అపురూపం అనిపిస్తుంది… కాకపోతే దేవుడి మీద నమ్మకం లేనివాళ్లకు ఇది పెద్దగా రుచించదు… దేవుడి దిశలో అనేక ప్రశ్నలు వేధిస్తున్న వాళ్లకు చిరు కాంతిని ప్రసరింపజేయగలదు… ప్రయత్నిస్తే ఏ వాట్సప్, టెలిగ్రాం పుస్తకాల గ్రూపుల్లోనో దొరుకుతుంది పీడీఎఫ్ కాపీ… కాదంటే ఆన్‌లైన్‌లోనూ అమ్మకానికీ దొరుకుతుంది… ఒకేసారి చదివితే అజీర్ణం… కొద్దికొద్దిగా పాఠకుడు అంతర్ముఖుడు అవుతూ, ఆలోచిస్తూ, చదువుతూ పోతే… సులభగ్రాహ్యం… మల్లాది వారికి అభినందనలు…
మన దేశంలో ఇలాంటివి ఇంగ్లిషులో రాస్తే ఎక్కువ అమ్మకాలు… ఎవరైనా విదేశీయుడు రాస్తే మరిన్ని అమ్మకాలు, ప్రశంసలు… కానీ ఓ తెలుగువాడు తనను తాను మథించుకుంటూ అచ్చ తెలుగులో రాస్తే తెలుగువాడికే పట్టదు… అదే చివరగా మనం పశ్చాత్తాపపడే విషాదం… ఇదీ అంతే…
Share this Article