.
సినిమా సెలబ్రిటీల బుర్రల్లో కొంతభాగం ఎప్పుడూ ఖాళీగా ఉంటుందా..? అలా ఉంటే తప్ప సినిమాల్లో ఉండలేరా..? లేక అలాంటివేరే సినిమాల్లోకి రావడానికి అర్హులా..? పలువురు సోకాల్డ్ సెలబ్రిటీలు అనబడే డొల్ల మెదళ్లు వేదికల మీద, ఇంటర్వ్యూల్లో కూసే కూతలు విన్నప్పుడల్లా ఇవే ప్రశ్నలు తలెత్తుతుంటాయి…
ఏదో ఇంటర్వ్యూ… సాలూరు వాసూరావు అట… మ్యూజిక్ కంపోజర్ అట… ఏం సినిమాలు చేశాడో తెలియదు గానీ, సాయిపల్లవి మీద ఏదేదో కూస్తున్నాడు… ఎవరీయన అని ఆరా తీస్తే ప్రముఖ సంగీత దర్శకుడు, మంచి పేరు సంపాదించుకున్న సాలూరు రాజేశ్వరరావు కొడుకు అట… కోటి సోదరుడట… పండితపుత్రుడు (!!!)…
Ads
ఆ ఇంటర్వ్యూలో దాదాపు అరుస్తున్నాడు… ‘‘సాయిపల్లవికి బుద్దుందా అనడుగుతున్నాను… దేవుడి మీద నాకు నమ్మకం లేదు అంటోంది… మరి సీతమ్మ పాత్ర ఎందుకు ఒప్పుకుంది, డబ్బు కోసమా..? కార్గిల్ వార్ టైమ్‌లో పాకిస్థానీ సైనికుల తప్పేముంది అని వ్యాఖ్యానించింది… పహల్గాం తప్పు కాదన్నట్టు మాట్లాడింది… దేశద్రోహం… అసలు బాపు తీసిన శ్రీరామరాజ్యం సమయంలో నయనతార కేవలం వెజ్ ఫుడ్ తింటూ, రాముడి ఫోటో పెట్టుకుని, నిష్టగా షూటింగ్ చేసింది, మతం మారుతానని చెప్పింది…’’
….. ఇలా ఏదేదో కూశాడు… కూశాడు అనే పదం కటువుగా ఉన్నా సరే, ఈ వాసూరావు మరి పరుష భాషకు అర్హుడు… తనకు సాయిపల్లవి గురించి ఏమీ తెలియదు అని అర్థం అవుతూనే ఉంది… ఏవో పిచ్చి కూతలు, అంతే…
1) ఆమె నాస్తికురాలు కాదు, దేవుడంటే నమ్మకం లేదని ఎప్పుడన్నదో వాసూరావే చెప్పాలి… ఆమెకు పేరు పెట్టింది పుట్టపర్తి సాయిబాబా… ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచీ ఆస్తిక బాటలోనే నడిపారు ఆమెను… ఎప్పుడూ తన చేతికి సాయి స్మరణకు జపమాల చుట్టుకుని ఉంటుంది ఆమె… టైమ్ దొరికితే చాలు పుట్టపర్తిలో వాలుతుంది…
2) సీత పాత్ర పోషించినప్పుడు నయనతార వెజ్ తింటూ, రాముడి ఫోటో పట్టుకుని తిరిగితే అది గ్రేటా..? సాయిపల్లవి ఎప్పుడూ వెజిటేరియనే… అసలు వెజ్కూ, నాన్వెజ్కూ భక్తికీ సంబంధం ఏమిటి..? నాన్సెన్స్… నాన్ వెజ్ తినేవాడు భక్తిపరుడు కాడా..?
3) షూటింగ్ సమయయంలో నిష్ట అనేది నయనతార ఇష్టం… తప్పులేదు, కానీ ఒక పాత్రలో జీవించడం అనేది వ్యక్తిగత టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది…
4) డబ్బు కోసం సీతమ్మ పాత్ర ఒప్పుకుందా..? ఈ ప్రశ్నకు జవాబు క్లియర్… డబ్బు ఖచ్చితంగా తీసుకుంటుంది, ఏ ఆర్టిస్టయినా సరే… ఆమె భక్తి ప్రచారం కోసమో, ధార్మిక కార్యక్రమంగానే రోల్ చేయడం లేదు… ఇదేమీ ఛారిటీ ప్రోగ్రాం కాదు, 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ పెద్ద వినోద వ్యాపార ప్రాజెక్టు…
5) సరే, ఆమె దేవుడంటే నమ్మకం లేదని చెప్పిందే నిజం అనుకుందాం కాసేపు, ఏం..? నాస్తికులు భక్తి పాత్రలు, పౌరాణిక పాత్రలు పోషించకూడదా..? ఇదెక్కడి అర్హత నిబంధన..? అక్కినేని నాస్తికుడు, ఎన్ని భక్తి పాత్రల్ని రక్తికట్టించాడు తను..? ఇలా బోలెడు ఉదాహరణలు…
6) పహల్గాం ఘటనలో తప్పేమీ లేదన్నట్టు సాయిపల్లవి మాట్లాడిందా..? అబ్సర్డ్… దాని మీద ఆమె ఎప్పుడూ స్పందించలేదు… ఈ గ్రేట్ కంపోజర్ దానికి ఆధారం చూపించాలి… లేదా ఇంటర్వ్యూయర్ అడిగి ఉండాలి… ఎప్పుడు, ఎక్కడ ఆ కామెంట్లు చేసిందని..!!
7) కార్గిల్ వార్… సాయిపల్లవి పుట్టిందే 1992 లో… 1999లో వార్… ఏడేళ్ల వయస్సుకే ఆమె కామెంట్స్ చేసిందా..? తరువాత కాలంలో ఏదో ఇంటర్వ్యూలో ఏమన్నదీ అంటే… మన సైనికులకు మన దేశం ఎంత ముఖ్యమో, పాకిస్థాన్ సైనికులకు వాళ్ల దేశం అంతే ముఖ్యం… కాకపోతే ఆమె తెలుగులో తన అభిప్రాయాన్ని సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేదు, అలాంటప్పుడు తనకు తెలిసిన భాషలోనే చెప్పడానికి ప్రయత్నించాలి…
8) ఆమె వివాదాస్పద కామెంట్స్… కశ్మీరీ పండిట్ల హత్యలు ఎంత తప్పో, గోహంతకుల పేరిట జరిగే హత్యలూ అంతే తప్పు… ఏ మతమైనా సరే హింస నేరమే… విరాటపర్వం సినిమా ఇంటర్వ్యూల సందర్భంగా… దానిపై హైదరాబాదులో ఓ కేసు కూడా నమోదైంది… అంతేతప్ప పహల్గాం, కార్గిల్ వార్‌పై ఆమె ఎప్పుడు, ఎక్కడ, ఏమన్నదో ఈ వాసూరావే చెప్పాలి…
Share this Article