Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…

September 16, 2025 by M S R

.

ప్రాణాయామం:- ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, యోగ శరీర మానసిక ఆరోగ్యానికి ఎంత మంచివో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొంచెం ఒళ్ళు వంచి పనిచేస్తే శరీరానికి వ్యాయామం జరగవచ్చు.

ప్రాణాయామంతో ఊపిరితిత్తులకు వ్యాయామం జరుగుతుంది. వీలైనంత ఎక్కువ గాలిని పీల్చుకుని… సాధ్యమైనంత సేపు బిగబట్టి… తిరిగి వదలడం ప్రాణాయామంలో ఒక భాగం. ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రాణం.

Ads

ఊపిరితిత్తులు ఎంత బలంగా ఉంటే ప్రాణవాయువును అంత ఎక్కువగా తీసుకోగలం. ప్రాణవాయువు లోపల ఎంత ఎక్కువగా తిరిగితే మెదడు అంత భద్రం, ఆరోగ్యం. మెదడు ఎంత చురుకుగా, భద్రంగా ఉంటే మొత్తం శరీరం అంత భద్రం.

ఊపిరితిత్తులకు ఊపిరులూదే విట్టల్  భజన:-

“తీర్థ్ విట్టల్ , క్షేత్ర్ విట్టల్ ;
దేవ విట్టల్ , దేవపూజా విట్టల్ ;
మాతా విట్టల్ , పితా విట్టల్ ;
బంధు విట్టల్ , గోత్ర్ విట్టల్ ;
గురు విట్టల్ , గురుదేవతా విట్టల్ ;
నిధాన్ విట్టల్ , నిరంతర విట్టల్ ;
నామామణ్ విట్టల సాపడ్ లా ;
మానోని కలికాల్ పాడ్ నాహి”

అర్థం:-
సకల తీర్థాలు పాండురంగ విట్టలుడే , సకల క్షేత్రాలు పాండురంగ విట్టలుడే ;
సకల దేవుళ్లు పాండురంగ విట్టలుడే , సకల దేవపూజలు పాండురంగ విట్టలుడే ;
తల్లి విట్టలుడే , తండ్రి విట్టలుడే ;
బంధువు విట్టలుడే , గోత్రం విట్టలుడే ;
గురువు విట్టలుడే , గురుదేవతా విట్టలుడే ;
మనసుకు నెమ్మది విట్టలుడే , మనసులో నిరంతరం విట్టలుడే ;
నామదేవుడి మాట – సకలం విట్టలుడే ;
ఈ కలియుగంలో విట్టలుడిని స్మరిస్తూ ఎలాంటి ఆపదల్లేకుండా మోక్షం పొందవచ్చు .

భారతీయ భాషలన్నిటిలో ఉన్న గొప్ప భజనల్లో ఒక వంద ఎంపిక చేస్తే ఈ మరాఠీ భజన కీర్తన అందులో ముందువరసలో ఉంటుంది .

మనకు తెలుగులో నగుమోము , ఎందరో మహానుభావులు , అదివో అల్లదివోలా మరాఠీలో ఇది . పేరుకు మరాఠీ కానీ – తీర్థ్ విట్టల్ కాలగమనంలో భారతీయ భాషల్లో ఏ భాషవారికి ఆ భాష సొంతమయినదే అయ్యింది .

దాదాపు 800 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో సంత్ నామదేవ్ ఒక భక్తి ఉద్యమం . సంస్కృతంలో ఉన్న వేద పురాణాలు పండితులకు తప్ప సామాన్యులకు తెలియనివేళ వాటి సారాన్ని , వాటి ఉద్దేశాలను మామూలు జనం భాషలో వ్యాప్తి చేయడంలో నామదేవ్ కృషి అసామాన్యం . అలా 8 శతాబ్దాల క్రితం నామదేవ్ మరాఠీలో రచించి గానం చేసిన భజన కీర్తన ఇది . చివర రెండు పంక్తులు తప్ప మిగతా అంతా కొద్దిగా హిందీ అర్ధమయ్యే ఏ భారతీయుడికయినా సులభంగా అర్థమవుతుంది .

తెలుగులో విట్టలా విట్టలా జయపాండురంగ విట్టలా ! ప్రఖ్యాత గీతానికి దారిచూపిన దీపమిదే .
అసలు సకల సంస్కృత సాహిత్యాన్ని పుక్కిట పట్టిన అన్నమయ్య జనం భాషలో పదాలు అల్లడానికి అప్పటికి కన్నడసీమలో స్థిరపడ్డ ఈ భజన సంప్రదాయమే కారణమని పుట్టపర్తి నారాయణాచార్యులు త్రిపుటి వ్యాసాల్లో నిరూపించారు .

మొత్తంగా కర్ణాటక సంగీతాన్నే మరాఠీ భజన సంప్రదాయం ఎంతగా ప్రభావితం చేసిందో సంగీతజ్ఞులనడిగితే చెప్తారు . ఆ మాటకొస్తే మరాఠీ , కన్నడ భజన పద్ధతులు భారతీయ భాషలన్నిటిలో భజనలను ప్రభావితం చేశాయి .

చిన్న చిన్న పదాలు , సులభంగా అర్ధమయ్యే అల్లిక , సమూహం చప్పట్లు కొడుతూ వంత పాడడానికి వీలుగా ప్రతి పంక్తి చివర విట్టల నామం వీటి ప్రత్యేకత . ఏమీ సంగీతం తెలియని వారూ మైమరచి పాడుకోవచ్చు . బాగా సంగీతం తెలిసినవారు రాగ తాళ లయలతో నాదానుసంధానం చేసుకోవచ్చు .

భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషి , ప్రఖ్యాత సంగీత విదుషీమణి అరుణా సాయి రామ్ లాంటి వారు ఈ తీర్థ్ విట్టల్ మాధుర్యాన్ని ప్రపంచానికి పంచారు .

నిజానికి తెలుగువాళ్లుగా మనం తెలుగు భజనల్లో దేవుడిపేరు వినిపిస్తే నోరారా పలకడానికి ఎక్కడ పుణ్యమొచ్చి ఒళ్ళో వాలుతుందోనని సంకోచిస్తాము కానీ – మరాఠీ , ఉత్తర భారతీయులు తీర్థ విట్టల్ వినపడగానే చప్పట్లు కొడుతూ , తలలు ఊపుతూ విట్టల నామస్మరణ చేస్తారు . మన ప్రయత్నం లేకుండానే విట్టలుడి వెంట తీసుకెళ్లే భజన ఇది .

ఈ రోజుల్లో గూగుల్లో , యూ ట్యూబులో ఉంటేనే ఏదయినా ఉన్నట్లు . అదృష్టం కొద్దీ ఈ తీర్థ్ విట్టల్ అన్ని డిజిటల్ వేదికల్లో ఉంది . వినాలనుకునేవారిని విట్టలుడు , నామదేవుడు కూడా ఆపలేడు . విట్టల విట్టల అని ఒక క్రమ (శ్రుతి)పద్ధతిలో పలుకుతూ… చప్పట్లు కొడుతూ భజన చేస్తే గుండెకు, ఊపిరితిత్తులకు మంచిదని అనాదిగా మహారాష్ట్ర నమ్మకం.

తెలుగు పద్యంతో ప్రాణాయామం:-

“అంతగా నోటితో నందుము వ్రాయుదు
మంతగా నంతందమైన భాష;
భాషించువారి యుచ్ఛ్వాస నిశ్వాసముల్
వెలయించి యాయువు పెంచు భాష;
పలుమాటలయ్యు సవ్వడిచేత జనముల
శీలమ్ము సవరించు మేలిభాష;
చెట్టు యెంతగ పాడుచేయనెంచిన నైన
నావంత మొక్కవోనట్టి భాష;

అణువు మొదలు బ్రహ్మాండ పర్యంతమొప్పు
బ్రదుకు, బాసయునంత పర్యంత ముండు
అంత వ్యాపించి వెలిగెడునట్టి భాష;
దివ్యమై చావు లేనిది తెలుగు భాష”
-విశ్వనాథ సత్యనారాయణ

అర్థం:- అందమైన తెలుగు పద్యాన్ని తప్పుల్లేకుండా స్పష్టంగా, రాగయుక్తంగా పాడితే… ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మెరుగవుతాయి. ఆయువు పెరుగుతుంది.

శంఖం ఊదండి:-

పైన చెప్పిన 1. ప్రాణాయామం, 2. విట్టల భజన, 3. తెలుగు పద్యం- మూడు సందర్భాలను ప్రస్తుత సందర్భానికి అన్వయించుకుందాం. నిద్రలో ఊపిరి ఆగినట్లు, ఊపిరి తీసుకోవడంలో ఏదో ఇబ్బంది ఎదురవుతున్నట్లు కొందరికి మెలకువ వస్తూ ఉంటుంది. ఇదొక అనారోగ్యం. ఊపిరితిత్తులకు సంబంధించినది.

  • ఇలాంటివారు నిద్రకు ముందు లేదా రోజులో ఒక వ్యాయామంగా శంఖం ఊదడం వల్ల ఆ సమస్య నుండి శాశ్వతంగా బయటపడి హాయిగా నిద్రపోవడాన్ని ఒక వైద్య పరిశోధన గుర్తించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శంఖం ఊదడం అనాదిగా ఉంది. జైపూర్ వైద్య బృందం తమ ఈ పరిశోధన ఫలితాలను వ్యాసంగా రాసింది. ఆ వ్యాసం యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్, న్యూస్ మెడికల్ లైఫ్ సైన్సెస్ లో ప్రచురితమై లోకానికి తెలిసింది.

పతంజలి చెప్పినట్లు ప్రాణాయామం చేస్తారో,
పోతన చెప్పినట్లు నోరు నొవ్వంగ విట్టల భజన చేస్తారో,
విశ్వనాథ చెప్పినట్లు ఎలుగెత్తి తెలుగు పద్యం చదువుతారో,
జైపూర్ డాక్టర్లు కనుగొన్నట్లు శంఖం ఊదుతారో- మీ ఇష్టం. మీ ఊపిరితిత్తుల బలం పెంచుకోవడానికి ఇందులో ఏదో ఒకటి మాత్రం ఎంచుకోండి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…
  • పేలవంగా, నిస్సారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్’..!!
  • శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…
  • నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….
  • నేపాల్ దహనకాండకు అసలు కారకులెవరు..? రియల్ స్టోరీస్..!!
  • మనమే రెచ్చగొడుతూ, రచ్చ చేస్తూ… అశాంతి, ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నాం…
  • ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
  • ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?
  • పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions