తెలుగు పాపులర్ సాహిత్యంలో… సారీ, రచన ప్రక్రియల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తిది కూడా ప్రముఖపాత్రే…. గొప్ప రచనలు అని ప్రత్యేకంగా ఏమీ చెప్పలేమేమో గానీ… తను ఏమైనా రాయగలడు… చిన్న కథలు, ట్రావెలాగ్స్, నవలలు… వాట్ నాట్… ఏదైనా రాయగలడు… తను ఓ సినిమాకు డైలాగ్స్ రాశాడనే ఓ మిత్రుడి సమాచారం ఎక్కడో చదివి, ఆ సినిమా వెతికితే ‘పోలీస్ రిపోర్ట్’ అని కనిపించింది… వావ్, అదేమిటో చూద్దాం అనుకుని అప్పుడెప్పుడో 1989 బాపతు సినిమాను చూస్తే… గొప్ప డైలాగులు కావు గానీ, పాత్రోచిత డైలాగ్స్ వినిపించినయ్… ఒక చర్చి ఫాదర్ కమ్ రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రకు రాసిన సంభాషణలు కాస్త ఆసక్తికరంగా అనిపించాయి,.. అలాగే డిటెక్టివ్‌గా మారిన బట్టల సత్తిగాడు పాత్రకు కూడా… ఇంట్రస్టింగు… వంశీ మార్కు కనిపించింది… వెటర్నరీ డాక్టర్ జంతుభాష, సత్తిగాడి బట్టల అమ్మకం భాష, ఓ ఇన్స్పెక్టర్ తిండి భాష గట్రా సరదాగా ఉన్నయ్… కానీ వాటిని వాడుకోవడంలో దర్శకుడు హరి అనుమోలు దారుణ వైఫల్యం కూడా కనిపించింది…
హరి అనుమోలు అప్పట్లో కాస్త పేరొచ్చిన దర్శకుడే… కానీ ఈ నాసిరకం సినిమా ఎలా తీశాడో అర్థం కాలేదు… నిజానికి కథ సూపర్… ఓ భర్త తన భార్యను చంపడానికి హార్స్లీ హిల్స్‌లో కారును లోయలోకి తోసేస్తాడు, తన భార్య కనిపించడం లేదని పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు… దాన్ని ఓ సినిమాటిక్ స్టయిల్లో పోలీసులు దర్యాప్తు చేసి, హీరో కమ్ విలన్‌ను పట్టించడమే కథ… కానీ కథనమే పూర్… సస్పెన్స్‌ను కొనసాగించడం కోసం అల్లిన సీన్లు పరమ బోరింగ్… సర్లెండి, లాజిక్కులు, కామన్ సెన్స్ ఉంటే అది తెలుగు సినిమా ఎందుకవుతుంది..? అది ఆది నుంచీ ఉన్న రోగమే కదా… ఇదీ అంతే… అర్ధరాత్రి బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపులు గట్రా దర్శకుడి తెలివితేటల పట్ల మనకు బోలెడంత జాలితో కూడిన నవ్వును తెప్పిస్తాయి… సినిమా చూస్తుంటే అనిపించేది ఏమిటంటే…? ఇదే కథ వంశీ చేతుల్లో పడి ఉంటే నాసామిరంగా అని… విచిత్రం ఏమిటంటే, వంశీ ఆల్ టైమ్ హిట్ లేడీస్ టైలర్ సినిమాల్లోని బట్టల సత్తిగాడు, శవాల ఫోటోగ్రాఫర్ పాత్రల్ని ఈ సినిమాలో వాడుకుని వంశీ పాత్రలకు మరకలు అంటించడం…
Ads
ఒక విషయం చెప్పడానికే ఈ కథనం షేర్ చేసుకోవడం… మోహన్ మంచి నటుడు… అప్పటికే చాలా పాపులర్… అంతటి నటుడూ ‘వీడేమిట్రా, ఇంత దరిద్రంగా చేశాడు’ అనిపించేలా మరక పూసింది బహుశా ఈ సినిమాయేనేమో…! ఓ చిన్న ఉదాహరణ… తను భార్యను హతమారుస్తాడు, కానీ అకస్మాత్తుగా ఎవరో అమ్మాయి నీ భార్యనే నేను అని వస్తుంది, ఆ మొదటి సీన్లో మోహన్ మొహంలో ఏముండాలి..? ఆశ్చర్యం, గగుర్పాటు కనిపించాలి… పరమ దరిద్రం ఏమిటంటే… మోహన్ అత్యంత నిర్లిప్తంగా కనిపిస్తాడు… మరీ విజయశాంతితో విజయనిర్మల తీసిన ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాకన్నా దరిద్రం అనిపిస్తుంది మనకు… ఎంతటి పెద్ద హీరో అయినా, తమకు కావల్సిన నటనను దర్శకుడు రాబట్టుకోకపోతే తనంత పెద్ద ఎదవ కేరక్టర్లు ఎవరూ ఉండరు అని చెప్పడానికి ప్రబల ఉదాహరణ అని కూడా అనిపిస్తుంది… ఓ పిచ్చి ఐటమ్ సాంగ్‌లో కనిపించే సిల్క్ స్మిత బొమ్మ పెట్టుకుని, ఎవరో రైట్స్ హోల్డర్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకున్నాడు… థంబ్ నెయిల్ కూడా స్మిత బొమ్మే… ఫాఫం… డైలాగులు రాసేవాడిలో దమ్ముంటే సరిపోదు, అది సరైన చిత్రానికి సరిగ్గా ఉపయోగపడాలి… అదీ ఈ కథనం నీతి…
Share this Article