డాక్టర్ల ముందు కన్ఫెషన్;
గుండెలు బరువెక్కే పశ్చాత్తాపాలు
——————–
“మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్” వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రావణుడి మరణం తరువాత శ్రీరాముడన్న మాట ఇది. చావుతో శత్రుత్వం కూడా చచ్చిపోవాలి. చనిపోయాక శత్రుత్వం కొనసాగించడంలో అర్థం లేదు. ప్రయోజనం లేదు. దుర్మార్గుడయిన రావణుడి అంత్యక్రియలు నేను చేయను- అని విభీషణుడు అన్న సందర్భంలో- దాదాపుగా మందలింపుగా రాముడన్న మాట ఇది.
——————–
కరోనాకు తొలి ఏడు పూర్తయింది. రెండో ఏడులోకి అడుగు పెట్టింది. ఈ సందర్బంగా కరోనా తొలిరోజుల్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మృత్యు ఒడిలోకి జారిపోయే ముందు కొందరు రోగులు డాక్టర్ల ముందు ఏమేమి చెప్పుకుని బాధ పడ్డారో వివరిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా హృదయం ద్రవించేలా చక్కటి వార్తను ప్రచురించింది. ఈ వార్త స్ఫూర్తితో ఈనాడు కూడా ఒక వార్త ఇచ్చింది కానీ- టైమ్స్ వార్త గుండెలను పిండేస్తుంది.
Ads
చనిపోవడానికి ముందురోజు రాత్రి ఒక వ్యక్తి- సోదరుడితో అనవసరంగా గొడవ పడ్డానని, అతనికి బేషరతుగా ఇప్పుడు ఆస్తిలో వాటా ఇవ్వాలనుకుంటున్నట్లు డాక్టర్ల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చావు తప్పదని తెలిసిన ఒక యువకుడు- భార్యతో గొడవలకు తనే బాధ్యుడినని డాక్టర్ల ముందు తప్పు ఒప్పుకున్నాడు. ఆస్తి పంపకాల్లో గొడవలు, మనస్పర్ధలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, పగ ప్రతీకారాలు, కోపతాపాలు, నోరుజారడాలు, చేయి చేసుకోవడాలు, కోర్టు కేసులు…ఇలా ఎన్నెన్నో తప్పులను నిండు మనసుతో డాక్టర్ల ముందు ఒప్పుకున్నారు. ఇందులో కొన్ని కేసుల్లో వారి చివరి కోరికలను వారు కోరుకున్నవారికి వైద్యులు చేరవేయగలిగారు. కొన్ని కుదరలేదు.
——————
మరణాంతాని వైరాణి… అని చనిపోయాక ఎంతటి శత్రువునయినా క్షమించి- ఆ శత్రుత్వానికి చరమ గీతం పాడాలన్నాడు రాముడు. వీరు బతికి ఉండగానే క్షమించి, గొప్ప మనసు చాటుకున్నారు. చావుకు మించిన ముగింపు లేదు. చావుకు మించిన వైరాగ్యం లేదు. చావుకు మించిన వేదాంతం లేదు. చావును మించిన గ్యారెంటీ లేదు. చావును మించిన భయం లేదు. చావును మించిన పాఠం లేదు. వీరిని కరోనా నిర్దయగా చంపి ఉండవచ్చు. కానీ- వారు చేసిన తప్పులను చెప్పుకుని బరువు దించుకున్నారు. పాపాన్ని కడిగేసుకుని పోయారు.
“మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?” అన్నాడు దాశరథి గాలిబ్ గీతాల్లో. నిజమే. మృతి లేకపోతే బతుకులో రుచి ఉండదు. ఆ మృతిరుచి గురించి చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే రుచిగా ఉన్నన్నాళ్లు మృతి స్మృతిలోకి రాదు. మృతి పలకరించినప్పుడు స్మృతి ఉన్నా పక్కకు తప్పుకుంటుంది. “మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు” అని అలిశెట్టి అన్నట్లు మరణం తమ చివరి చరణం కాకుండా, చితిలో భస్మమయినా మౌనంగా వెళ్లిపోకుండా- మాట్లాడదలుచుకున్నది మాట్లాడి, అడగాల్సిన క్షమాపణలు అడిగి, అప్పగించాల్సినవి అప్పగించి, కలపాల్సిన మనసులు కలిపి…వెళ్లినవారు నిజంగా పుణ్యాత్ములు. ధన్యాత్ములు. పవిత్రాత్ములు….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article