.
శంకర్‌రావు శెంకేసి (7989876088) …….. ‘BIG DREAMS.. TAKE TIME, DEDICATION, BLOOD, SWEAT, TEARS AND YEARS’-
సివిల్స్‌లో ఆలిండియా 11వ ర్యాంకు సాధించిన ఇట్టబోయిన సాయిశివాని తన గదిలో గోడపైన రాసుకున్న కొటేషన్ ఇది. సకల సౌకర్యాలు, వనరులు ఉంటేనే అత్యున్నతమైన లక్ష్యాన్ని ఛేదించగలమనే సాకును, అపోహల్ని సాయిశివాని తుడిచిపారేసింది.
Ads
లక్ష్య ఛేదనకు కావాల్సింది పట్టుదల, శ్రమ మాత్రమేనని ఆమె నిరూపించింది. సాయిశివాని అద్భుత విజయం ముచ్చట గొలిపింది. సివిల్స్ బాటలో పయనిస్తున్న లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వరంగల్‌ను గర్వంతో తలెత్తుకునేలా చేసింది.
నిజానికి సాయిశివాని కుటుంబం మధ్యతరగతి వర్గానికి చెందినది. తండ్రి ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి రజిత గృహిణి. వరంగల్ రైల్వేస్టేషన్‌కు దక్షిణం వైపున శివనగర్ వాసవినగర్‌లో సాయిశివాని కుటుంబం నివాసం ఉంటోంది.
ఐఏఎస్.. సాయిశివాని జీవితకల. లైఫ్‌గోల్ కూడా. అందుకే తన గదిలో గోడపైన ఎఐఆర్-50 అని రాసిపెట్టుకుంది. తాను తల ఎత్తినప్పుడల్లా ఆ పదం ఆమెకు కనిపించి, లక్ష్యాన్ని గుర్తు చేసేది. కలలు కనడం, ఊహల్లో విహరించడం అందరూ చేసే పనే. కానీ, సాయిశివాని కన్న కల.. కఠోరమైన దీక్షకు సంబంధించినది.
అందుకే ఆమె తనదైన లోకాన్ని సృష్టించుకుంది. మూడేళ్ల పాటు బయటి ప్రపంచాన్ని మరచి, ఒంటరిగా పయనం సాగించింది. ఒకరకమైన యుద్ధాన్నే చేసింది. తనతో చదువుకున్న వారు ప్రైవేటు రంగంలో లక్షల జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, సాయిశివాని వాటివైపు ఆకర్షితం కాలేదు. తనదైన స్థితప్రజ్ఞతతో ఎంచుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది.
2022లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో బీ.టెక్ పూర్తి చేసిన వెంటనే తన చిన్ననాటి కల అయిన సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అంతకుముందు ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ప్రైమరీ, హైస్కూల్ విద్యనభ్యసించింది. సివిల్స్ అనగానే చాలామంది ఢిల్లీకో, హైదరాబాద్‌కో తరలివెళ్తారు.
లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. కానీ, సాయిశివాని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మెటీరియల్ ఆధారంగా సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో మధ్య తరగతి కుటుంబాల స్థాయికి ప్రతిబింబంగా కనిపించే శివనగర్‌లోని వారి సాధారణ ఇల్లు… ఒక యజ్ఞానికి వేదికగా నిలిచింది.
ఆ ఇంటిలోని ఓ మామూలు గదిని సాయిశివాని ఒక అపురూప లోకంగా తీర్చిదిద్దుకుంది. ఇక్కడ సాయిశివాని గది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పోటీపరీక్షలకు హాజరయ్యే వారి గదుల్లో ఒక ల్యాప్‌టాప్, ఒక టేబుల్, దానిపైన పుస్తకాలు ఉండటం సహజం. కానీ సాయిశివాని గదిలోని వెలిసిన గోడలు కూడా ప్రిపరేషన్‌లో భాగంగా మారాయి.
సివిల్స్ సిలబస్‌కు చెందిన ముఖ్యమైన పాయింట్లను సినాప్సిస్ రూపంలో కాగితాలపై రాసుకొని, వాటిని గోడల నిండా అంటించడం ఒక ఎత్తయితే, లక్ష్య ఛేదనకు ఉపకరించే అనేక అసక్తికర సూక్తులను గోడలపై రాసుకున్న తీరు మరో ఎత్తుగా కనిపిస్తుంది. పాత గోడలను సరికొత్తగా తీర్చిదిద్దిన సాయిశివాని టేస్ట్.. ఆ గదిని విజ్ఞానకాంతులకు నిలయంగా మార్చింది.
గోడలను అలా నింపేయడం చాలామంది చేసే పనే కావొచ్చు గానీ, పరిమిత వనరులు, అరకొర సౌకర్యాలు ఉన్న చోటును కూడా.. సన్నద్ధతకు అనువుగా అలా మలుచుకోవడం గొప్ప విషయం. అది మొక్కవోని దీక్షకు సాక్ష్యం.
‘ఐఏఎస్ కావాలని బాల్యంలోనే నేను నిర్ణయంచుకున్నాను..’ అని చెప్పే సాయిశివాని.. అనేక అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో అధిగమించింది. ఏటికి ఎదురీదుతూనే తన పయనాన్ని కొనసాగించి తీరాన్ని చేరింది. కనీసం మూడు నాలుగేళ్లు శ్రమిస్తే గానీ దక్కని విజయం.. సాయిశివానికి రెండో ప్రయత్నంలోనే దక్కింది.
అందుకు ఆమె ఆచరించిన క్రమశిక్షణే కారణంగా కనిపిస్తుంది. సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టగానే సాయిశివాని ముందుగా మొబైల్ ఫోన్‌ను దూరం పెట్టింది. తద్వారా సోషల్ మీడియాకు డిస్‌కనెక్ట్ అయింది. దీంతో కావాల్సినంత సమయం ఆమె చేతికి చిక్కింది. తన గదినే ప్రపంచంగా మార్చుకుని సాయిశివాని ఒకరకమైన యజ్ఞమే చేసింది.
లోపాలను సరిచేసుకుంటూ, సరిచూసుకుంటూ తనను రాటుదేల్చుకుంది. అందుకే ఆమె ‘Discipline is not sacrifice.. It is Power’ అని చెప్పగలిగింది. రోల్‌మోడళ్లు, ఇనిస్పిరేషన్స్ ఎందరు ఉన్నా… ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆచరణ, కష్టపడేతత్వం ఉన్నప్పుడే సివిల్స్‌లో నెగ్గడం సాధ్యమని సాయిశివాని చెప్పిన మాటలు అమూల్యమైనవి.
2022లో ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు జాతీయ స్థాయిలో 50వ ర్యాంకును టార్గెట్‌గా నిర్దేశించుకుంది సాయిశివాని. తన గదిలోని గోడపైన ఎఐఆర్-50 అని రాసి పెట్టుకుంది కూడా. అందుకోసం ఆమె మూడేళ్లు కష్టపడింది. సీన్ కట్ చేస్తే ఆమెకు 11వ ర్యాంకు దక్కింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యుత్తమైన ర్యాంకు. పెరిక సామాజికవర్గంలో పుట్టి, మెడికల్ రిప్రజెంటేటివ్ అయిన తండ్రి మార్గదర్శకత్వంలో ముందుకుసాగి, తిరుగులేని పట్టుదలతో సాయిశివాని అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. ఇలాంటి విజేతలు ఎంతో అరుదు.
సాయిశివానికి తానేమిటో.. తనకు కావాల్సిందేమిటో స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే అపజయాలు, అడ్డంకులు ఎదురైనా అచంచలమైన సంకల్పంతో తనలోని సర్వశక్తులను నూరుశాతం ఒడ్డగలిగింది. అట్లా వ్యవహరించింది కాబట్టే…. ‘Either give 100% or Don’t Study’ అని అనగలిగింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా మధ్య తరగతి కుటుంబాల నుంచి సివిల్స్ విజేతలు పెరుగుతున్నారు. ఈ పరంపరకు సాయిశివాని విజయం ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. ‘కామన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ప్రజల సమస్యలు తెలుసు.. బ్యూరోక్రటిక్ మైండ్‌సెట్‌తో కాకుండా, పబ్లిక్ యాక్సెస్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను..’ అని సాయిశివాని చెప్పిన మాటలు..
ఆమె ప్రామిసింగ్ బ్యూరోక్రట్ కాగలుగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ‘నా విజయం అంత సులభంగా రాలేదు..’ అని అంటున్న సాయిశివాని గదిలో తళుక్కున మెరిసే ‘BIG DREAMS.. TAKE TIME, DEDICATION, BLOOD, SWEAT, TEARS AND YEARS’ అనే సూక్తి నేటి తరాలకు భగవద్గీత లాంటిది.
సివిల్స్ ఫలితాలు వచ్చిన రోజున సాయిశివాని తన తండ్రితో హైదరాబాద్‌లో ఉంది. ఆలిండియా 11వ ర్యాంకు వచ్చిందని తెలియగానే అభినందనల వర్షంలో తడిసిపోయింది. తానిప్పుడు ఐఏఎస్. హోమ్ స్టేట్‌లోనే కలెక్టర్ కాబోతోంది. ఇవన్నీ తెలిసినా సాయిశివాని సింప్లిసిటీలో ఏ మార్పూ లేదు. పైగా తన తండ్రితో కలిసి ఆమె ఆర్టీసీ బస్సులో వరంగల్ బయలుదేరింది…
Share this Article