‘‘ఇది ఓ దుర్దినం… బాధగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు రణదీప్ సూర్జేవాలా… రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకడైన పెరారివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత ఈ వ్యాఖ్య చేశాడు… తను కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాబట్టి దీన్ని ఎఐసీసీ అధికారిక స్పందనగానే చూడాలి… ‘‘దీన్ని ఖండిస్తున్నాం, జీవితఖైదు అనుభవిస్తున్న లక్షల మందిని ఇలాగే విడుదల చేస్తారా… కేంద్రం ఓ చిల్లర, చవుకబారు రాజకీయంతో సుప్రీంకోర్టులో సరిగ్గా వాదనలు వినిపించలేక, విడుదల చేసే పరిస్థితికి కారణమైంది…
ఇది ఒక్క రాజీవ్ గాంధీ కేసు కాదు, ఈ దేశ మాజీ ప్రధానికి సంబంధించిన కేసు… ఉగ్రవాదంపై పోరాడుతున్న వాళ్లందరినీ నిరాశపరిచే తీర్పు..’’ పార్టీ స్పందనలోని ముఖ్యమైన వాక్యాలు అవి… నిజంగానే అదే పార్టీ చెప్పినట్టు… ఈ స్పందనపై, కాంగ్రెస్ పార్టీ ధోరణిపై వ్యాఖ్యానించాలంటే ‘‘ఇది ఓ దుర్దినం, బాధగా ఉంది…’’ కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో స్పందించి ఉంటే బాగుండును… ఎందుకంటే..?
నిజమే, ఇది ఒక్క రాజీవ్ కేసు మాత్రమే కాదు… ఏ దేశంవాడో ఇక్కడికి వచ్చి, కుట్రపన్ని, ఓ మాజీ ప్రధానిని హతమార్చిన తీరు సగటు భారతీయుడి గుండెల్ని రగిలించింది… డీఎంకే వంటి ఎల్‌టీటీఈ సానుభూతిపర పార్టీలు ఒకటీరెండు మినహా దేశంలోని ప్రతి పార్టీ ఆ నేరస్థులను కఠినంగా శిక్షించాలనే కోరుకుంది… రాజీవ్‌ను ఇక్కడ కాంగ్రెస్ నాయకుడిగా కాదు, దేశం యావత్తూ రాజీవ్‌ను తన బిడ్డగానే పరిగణించింది…
Ads
అదే రాజీవ్ భార్య సోనియా, కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ హంతకుల్ని క్షమిస్తున్నామని చెప్పినా సరే… ఇది మీ ఒక్క కుటుంబం బాధ మాత్రమే కాదు, దేశం మొత్తానిది అన్నట్టుగానే దేశంలోని ప్రతి వ్యవస్థ భావించింది… అదేసమయంలో సోనియా కుటుంబం క్షమాభిక్ష ప్రకటన తరువాత వాళ్లపై కొంత ఆగ్రహం తగ్గిన మాట నిజం… సుప్రీంకోర్టు మరణశిక్షను ‘మరణించేదాకా జైలుశిక్ష’కు తగ్గించినప్పుడు కూడా మౌనంగానే ఈ దేశం ఆమోదం ప్రకటించింది…
ఇక్కడ ఆశ్చర్యకరమైంది ఏమిటంటే… అదే సోనియా క్షమించేసింది కదా… ఆ కుటుంబం చెప్పుచేతల్లోనే కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నది… మరి ఒక నేరస్థుడిని 31 సంవత్సరాల తరువాత విడుదల చేస్తే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఏమిటి..? ఎందుకీ ద్వంద్వ వైఖరి..? జీవితఖైదు అనుభవించే లక్షల మందిని విడుదల చేస్తారా అనేది కూడా సరైన ప్రశ్న కాదు… రాజీవ్ హంతకులు అనుభవిస్తున్నది రెమిషన్లకు అవకాశం ఉండి, ఏ పదిహేనేళ్లకో బయటపడే జీవితఖైదు కాదు, మరణించేదాకా జైలులోనే ఉండటం… వీళ్లు సాధారణ జీవితఖైదుతో పోలిస్తే రెండు ఫుల్ శిక్షలు అనుభవించేసినట్టే…
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు తమిళనాడు కాంగ్రెస్ చేసిన ప్రకటన కూడా సరైన రీతిలో లేదు… ఇదే తీర్పును డీఎంకే స్వాగతించింది… అది ఎన్నికల మేనిఫెస్టోలోనే దీన్ని పేర్కొంది కూడా… ఐనా సరే, ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నట్టు కాంగ్రెస్… మిగతా ఆరుగురు ఖైదీల విడుదలకు కూడా స్టాలిన్ ప్రయత్నించబోతున్నాడు… ఆ కూటమి నుంచి కాంగ్రెస్ బయటికి వస్తుందా…? యూపీఏ నుంచి డీఎంకేను బయటికి పంపిస్తుందా..? తెగదెంపులు చేసుకోగలదా..? రాష్ట్ర కేబినెట్ ఈ హంతకుల విడుదలకు అనుకూలంగా తీర్మానం చేసినప్పుడు ఎందుకు ఖండించలేదు..?
ఈ కేసులో గవర్నర్ సరిగ్గా వ్యవహరించడం లేదని కూడా కోర్టు తప్పుపట్టింది… అంటే, పెరరివాలన్ విడుదలకు సంబంధించిన అన్ని కోణాలనూ కోర్టు నిశితంగా తన పరిశీలనకు తీసుకుంది… అందుకే అసాధారణమైన రీతిలో తన అధికారాల్ని వాడుకోగలిగిన 142 ఆర్టికల్‌ను బయటికి తీసింది… ఈ కేసులో పెరారివాలన్ వాంగ్మూలాన్ని సరిగ్గా రికార్డు చేయలేదని ఆ దర్యాప్తులో పాల్గొన్న అధికారే సుప్రీంకు అఫిడవిట్ ఇచ్చాడు… మొత్తం 41 మంది మీద చార్జిషీటు ఫైల్ చేస్తే, అందులో 12 మంది ఆల్‌రెడీ మరణించారు అప్పుడే… మొత్తం 26 మందికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధిస్తే, తరువాత సుప్రీంకోర్టు 19 మందిని విడుదల చేసింది… మిగతా ఏడుగురిలో నలుగురి మరణశిక్షనే ఖాయం చేసింది… తరువాత యావజ్జీవానికి తగ్గించబడింది…
2014లోనే… సుప్రీంకోర్టు ఒకవేళ ప్రవర్తన బాగున్నట్టయితే వారిని విడుదల చేయవచ్చునని చెప్పింది… జయలలిత ప్రభుత్వం దానికి సిద్ధపడింది కూడా… ఎఐడీఎంకే కేబినెట్ వీళ్ల విడుదలకు గత ప్రభుత్వహయాంలో తీర్మానం చేసింది… ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ ఎక్కడా మన దేశ చట్టపరిధులను దాటి వ్యవహరించలేదు… చివరగా… శిక్ష దేనికి..? మరణశిక్ష అయితే ఇలాంటి మనుషులు సమాజంలో ఉండకూడదనే ప్రకటన… మిగతా శిక్షలు పరివర్తన కోసమే… జీవితాంతం జైలులోనే మగ్గే స్థితి ఉంటే ఇక ఆ పరివర్తనకు సార్థకత ఏమున్నట్టు..?
పెరారివాలన్ సంగతే తీసుకుందాం… ఓపెన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చదివాడు, కంప్యూటర్స్‌లో పీజీ చేశాడు… పాతికేళ్లపాటు బెయిల్ లేదు, పెరోల్ లేదు, బయట లోకాన్ని చూడలేదు… సత్ప్రవర్తన కోణంలో తనకు వంక లేదు… అసలు రాజీవ్ హత్యకు తను కొన్న బ్యాటరీలను ఉపయోగిస్తారనే సోయి కూడా తనకు లేదు… నిజంగా తను కుట్రదారేనా..? మొత్తం కుట్రకు ప్రధాన సూత్రధారి ప్రభాకరన్ సహా, తన టైగర్ల గ్రూపు మొత్తానికే అంతరించిపోయాయి… హత్యకు సాయపడిన ఈ చిన్న చిన్న వాళ్లదేముంది..? ఇంకా జైళ్లలో పెట్టినా దానికి అర్థమేముంది..?!
Share this Article