మేనరికం… మన తెలుగు కుటుంబాలకు సంబంధించి మేనమామ, మేనకోడలి నడుమ… మేనబావ, మేన మరదలి నడుమ పెళ్లిళ్లు అత్యంత సహజం… అది వరుస… అనేక తరాలుగా అదొక ఆనవాయితీ… అసలు వరసైన సంబంధం సొంతింట్లోనే ఉంటే బయటి సంబంధాలు చూడడాన్నే సమాజం ఈసడించుకునేది… మేనరికం ఉండగా, మాకు ఇవ్వకుండా వేరే వాళ్లకు పిల్లనెలా ఇస్తావనే పంచాయితీలు… నువ్వెలా బయటి సంబంధం చేసుకున్నావనే దబాయింపులు, తగాదాలు బోలెడు… కారణం..?
సింపుల్… బయటి వాళ్లకన్నా సొంత వాళ్లను నమ్మడం బెటర్… రక్తసంబంధం… మన కుటుంబసభ్యుల పట్ల ప్రేమగా మెలగుతారు… ఆస్తులు అటూఇటూ డిస్టర్బ్ కావు… మన కళ్ల ముందు పెరిగినవాళ్లే కాబట్టి వాళ్ల తత్వాలు తెలుసు… బలగం బలం పెరుగుతుంది… ఇలా చాలా కారణాలు… కొన్ని ఇతర జాతుల్లో పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న బిడ్డల్ని, కొడుకుల్ని కూడా చేసుకుంటారు… మరీ తోడబుట్టినవాళ్లు గాకుండా ఉంటే చాలు… ఇలా సొంత రక్తపు సర్కిల్ నడుమే సంబంధాలు…
Ads
తమ కుటుంబాల సంఖ్య తక్కువగా ఉండి, బయటి సంబంధాలు పెద్దగా లేని పరిస్థితుల్లో ఈ మేనరికాలు, సొంత నెత్తుటి సంబంధాలు అనివార్యం… మరీ ఈ చరిత్రలోకి పోకుండా తాజా విషయానికి వస్తే… మేనరికాల వల్ల పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు పుట్టుకతోనే వస్తున్నాయి… ఇది తెలిశాక మేనరికాలు చాలావరకూ తగ్గిపోయాయి… నిజానికి రకరకాల బయటి జీన్స్ కలుస్తూ ఉంటేనే ఏ జాతి అయినా కొత్త బలాన్ని సంతరించుకుంటుంది…
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అప్పట్లో 2015-16 వరకు ఉన్న గణాంకాలతో రిలీజ్ అయింది తెలుసు కదా… అందులో ఈ మేనరికాల వివరాలూ ఉన్నయ్… అవి కాస్త ఇంట్రస్టింగు… ఇంకా మనం అనుకున్నంతగా సమాజం మరీ మేనరికాలకు దూరంగా పోలేదు… జరుగుతూనే ఉన్నయ్… సమస్యలు వస్తాయని తెలిసీ మేనరికాలను వదులుకోవడం లేదు సమాజం… ఒక్కసారి ఇది చూడండి..,
…. ఇండియాలో సగటు 14 శాతం… కానీ దక్షిణ భారత రాష్ట్రాల్ని ఓసారి చూడండి… తమిళనాడులో 33, లక్షద్వీప్‌లో 33, ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 30, అండమాన్‌లో 27, కర్నాటకలో 26, పుదుచ్చేరిలో 22 శాతాలు… అంటే పావు వంతు నుంచి మూడో వంతు వరకు ఇంకా మేనరికాలు, మరీ కుటుంబ సంబంధాలే… కానీ కేరళలో మాత్రం ఇది ఆరు శాతానికి తగ్గిపోయింది…
….. అనేక సామాజిక అంశాల్లో, జీవననాణ్యతకు సంబంధించిన సూచికల్లో కేరళ ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది… అక్షరాస్యత నుంచి ఆరోగ్యస్థితుల దాకా… వేరే రాష్ట్రాలతో పోలిస్తే చైతన్యస్థాయి ఎక్కువ… అందుకే మేనరికాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే కేరళ, అవి మంచివి కావని తెలియగానే… దాన్నుంచి వేగంగా దూరం జరిగింది… ఒకసారి ఈ చార్ట్ చూశారు కదా…
ఉత్తరభారతంలో ఈ మేనరికాలు తక్కువ… ఈశాన్య రాష్ట్రాల్లో మరీ తక్కువ… అంటే ఉత్తరభారతంకన్నా మేం బెటర్, బాగా చదువుకున్నాం, బాగా డెవలప్ అయ్యాం, మన సోషల్ కాన్షియస్ చాలా ఎక్కువ అని మనం భుజాలు చరుచుకోవడమే తప్ప… అంకెలు నిజాల్ని చెప్పేస్తున్నాయ్… మనం ఇంకా ముందుకు పోలేకపోతున్నామని…!! ప్చ్… మనం ఇంకా ఈ ‘సంబంధాల’ నుంచే బయటపడలేకపోతున్నాం… ఇక ఎక్కువ కులాంతరాలు, ఖండాంతరాలతో మన బ్లడ్ అండ్ బ్రీడ్ సుసంపన్నం అయ్యేదెప్పుడని…!!
Share this Article