.
ఇప్పుడు ఏది దొరికినా నెటిజనం వదలడం లేదు… గాయిగత్తర చేసేస్తారు… సో, గతంలోలాగా కాదు, సినిమాలు, టీవీ సీరియళ్లు, వెబ్ కంటెంటు… ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకోవాల్సిందే… అన్నింటికీ మించి తమ వివరణలు, స్పష్టీకరణలు, సారీల్లో కూడా…
ఈమధ్య ఈటీవీ విన్ తమ ఒరిజినల్ కంటెంటు మీద బాగా కాన్సంట్రేట్ చేస్తోంది కదా… ఈ వీకెండ్‌లో ఎఐఆర్ అని ఒకటి వదిలింది… వెబ్ సీరీస్… ఎఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఫుల్ ఫామ్ అన్నమాట… నిజానికి దీనికి కొంత పాజిటివ్ టాకే వచ్చింది… గుడ్, ఇదీ క్లిక్కయినట్టే అని సదరు క్రియేటివ్ టీం ఆనందించేలోపు ఓ వివాదం రానే వచ్చి చుట్టుముట్టింది…
Ads
నిజానికి అది చిన్నదిగానే కనిపించవచ్చు చాలామందికి… కానీ అసలే కులాల పోరు ఉధృతంగా సాగే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కులం పేరిట చిన్న సీన్, చిన్న డైలాగ్ చాలు మంట రాజుకోవడానికి… ఇదీ అంతే…
ఒక కులాన్ని (విజయవాడలో సాధారణంగా పైన అమ్మవారు, కింద కమ్మవారు వంటి డైలాగులు చాలామంది నిజజీవితంలో వాడేవే…) టార్గెట్ చేస్తున్నట్టు ఓ సీన్ ఉంది… అది తమ కులాన్ని లక్ష్యంగా చేసుకుందనే భావనతో ఇక మొదలుపెట్టారు పంచాయితీ…
అసలు ‘‘మన ఈటీవీ విన్’’ లో ఈ వివాదాస్పద సీన్ ఏమిటనేది మరో అభ్యంతర కారణం… సోషల్ మీడియాలో ఇది బాగా చర్చనీయాంశమైంది… ‘ఏఐఆర్’ హాస్టల్లో ఉంటూ చదువుకునే ఇంటర్మీడియట్ కుర్రాళ్లకు సంబంధించిన కథ ఇది…
ఈ స్టూడెంట్స్‌లో క్యాస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. కొత్త వాళ్ల మీద దాన్ని ఎలా రుద్దుతారు.. సినిమా హీరోలను అభిమానించే విషయంలోనూ కులం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కొన్ని సన్నివేశాల్లో చూపించారు… ఈ క్రమంలోనే సదరు వివాదాస్పద సన్నివేశం వస్తుంది… ఫలానా కులం అని పేరు పెట్టకపోయినా.. ఏ క్యాస్ట్‌ను టార్గెట్ చేశారన్నది అక్కడ స్పష్టంగానే అర్థమైపోతుంది…
దీంతో ఈ సిరీస్ మేకర్స్‌తో పాటు ఈటీవీ విన్‌ను కూడా టార్గెట్ చేశారు… అసలే సన్నివేశం అభ్యంతరకరంగా ఉంటే… దానికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులను ‘ఈటీవీ విన్’ ఎక్స్ హ్యాండిల్లో రీపోస్ట్ చేయడం ఈ వివాదం మరింత ముదరడానికి కారణమైంది…
రాను రాను ఇది ముదిరే సూచన కనిపించి ఇకపై జాగ్రత్తగా ఉంటామంటూ ఈటీవీ విన్ ఓ పోస్ట్ పెట్టింది… మరోవైపు ఈ సిరీస్ నిర్మాత, దర్శకుడు సందీప్ రాజ్‌ను కూడా ఆ వర్గం గట్టిగానే టార్గెట్ చేసింది కదా… దీంతో అతను సుదీర్ఘ వివరణ ఇస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాడు…
సమర్థించుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు… సాకులేమీ చెప్పలేదు, కవర్ చేయడానికి ప్రయాసపడలేదు… సింపుల్‌గా తప్పే అని అంగీకరించి, దాన్ని సీరీస్ నుంచి తీసేశామని చెప్పుకొచ్చాడు… నిజమే, ఈటీవీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగానే ఉంటుంది కదా… ఇదెందుకు అలా ప్రసారంలోకి వచ్చిందో మరి..!!
Share this Article