బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ నిజంగానే భగవద్గీతను కించపరిచిండా..? ఏమని కించపరిచిండు..? ఎందుకు చేస్తున్నాడిలా..? ఈ ప్రశ్నల వివరాల్లోకి వెళ్లడం లేదిక్కడ… ఒక వివాదం ఇది… తనేదో గీతను కించపరిచే వీడియో చేశాడని, హిందువుల మనోభావాలు కించపరిచాడని రాష్ట్రీయ వానరసేన అనే హిందూ సంస్థ హైదరాబాద్ సైబర్ క్రైమ్ నమోదు చేసింది…
ఐతే ఒక వీడియోలో బిత్తిరి సత్తి తన మీద వచ్చిన విమర్శలకు సమాధానాలిచ్చిన తీరు అస్సలు బాగాలేదు… తన యాటిట్యూడ్ బయటపెడుతోంది… రాష్ట్రీయ వానర సేన బాధ్యుడెవరో తనకు ఫోన్ చేశాడు… (ఆ ఆడియో నిజమైందే అని నమ్ముతూ… ఈ అభిప్రాయం, అందులో ఉన్నది నేను కాదు అని ఒకవేళ బిత్తిరి సత్తి ఖండిస్తే అది వేరే సంగతి…)
అందులో నా పేరు కేశవరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు సదరు రాష్ట్రీయ వానరసేన తరఫున… నువ్వు గీతను కించపరుస్తున్నవ్, సరిగ్గా లేదు అని చెప్పగానే ఇదేదో వేరే పార్టీ తరఫున తన మీద కంప్లయింట్ అనుకున్నట్టున్నాడు సత్తి… ఇగో, పార్టీపరంగా మాట్లాడొద్దు అని దబాయించే ప్రయత్నం చేశాడు… నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాది హిందూ ఆర్గనైజేషన్ అని కేశవరెడ్డి చెబుతూనే ఉన్నాడు…
Ads
వెంటనే సత్తి కంప్లయింట్ ఇచ్చుకోపో నా మీద అన్నాడు… ఎందుకంత భరోసా..? ఈ సైబర్ క్రైమ్ డిపార్టమెంట్ ఏమీ చేయలేదనే ధీమా ఎందుకొచ్చింది..? (ఇంతకీ సత్తి ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు..?) ఆయన ఒకవైపు గీత మీద నీ వీడియో కరెక్ట్ కాదు అని చెబుతుంటే, పార్టీపరంగా మాట్లాడకు అనడమేమిటో…
నేను హిందువును కానా మరి అంటూ కాస్త తొవ్వకు వచ్చిన సత్తి మళ్లీ తనే అంటాడు… నీకు చెప్పి చేయాల్నా..? నీకు నచ్చకపోతే చూడకు, అన్ సబ్‌స్క్రయిబ్ చేసుకో అంటాడు… పబ్లిక్ డొమెయిన్‌లో నా ఇష్టమొచ్చింది పెడతాను, చూస్తే చూడు, లేకపోతే లేదు అనేది అత్యంత బాధ్యతారహితమైన జవాబు…
ఏం చెప్పాలో అర్థం గాక… నీ పేరేంది..? నీ ఏజ్ ఏంది..? అని ఎటో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు… చూడు కేశవ ‘రెడ్డీ’ అని ప్రస్తావిస్తే, ఎదుటాయన అవును రవి ‘ముదిరాజ్’ అని రిటార్ట్ ఇచ్చాడు… ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినట్టు సత్తి..? మళ్లీ తన వీడియో వేల మందికి నచ్చింది అంటాడు… వేల వ్యూస్ రాగానే దానికి యాక్సెప్టెన్సీ వచ్చేసినట్టేనా..?
బ్లాక్ చేయి, డిలిట్ చేయి, చూడకు అనే మాటలకు తోడు… అందరికీ అందరూ వస్తారు అంటాడు… అంటే తనకు ఇంకేదో కమ్యూనిటీ సపోర్టుగా వస్తుంది అని దబాయించడం…! పైగా నేను శ్లోకాలు పాడుతా, నువ్వు పాడు అని సవాల్ విసిరాడు… అంటే, శ్లోకాలు పాడగలిగితే ఏమైనా చేయొచ్చా..? శ్లోకాలు పాడితేనే తన గీత వీడియో మీద మాట్లాడాలా..? ఇదేం ధోరణి..? బరాబర్ కేసు పెడతా అని వానరసేన చెబితే, బరాబర్ ఎదుర్కుంటా అని సత్తి ఆ సవాల్ స్వీకరించాడు..!!
Share this Article