.
వందల జేసీబీలు అడవిపైకి దండయాత్రకు వెళ్లాయి… పక్షులు, జింకలు, కుందేళ్లు, నెమళ్ల ఘోష వినిపిస్తోంది… 400 ఎకరాల అడవిని ధ్వంసం చేసేసి, కాంక్రీట్ జంగిల్ డెవలప్‌మెంట్ కోసం కార్పొరేట్లకు అమ్ముకోబోతున్నాడు రేవంత్ రెడ్డి… తమ యూనివర్శిటీ భూమిని కాపాడుకోవడానికి విద్యార్థులు పోరుబాట పట్టారు… పలు వృక్షజాతులు, వన్యప్రాణులు, నాలుగు కుంటలు, దట్టమైన చెట్లు, రాక్ ఫార్మేషన్స్ ఉన్న జీవావరణ భూమిని ధ్వంసం చేయబోతున్నాడు సీఎం….
…….. ఇదుగో ఈ అంశాలు, ఈ వార్తలు, ఈ ఫోటోలు, ఈ వీడియోలు చాలా కనిపిస్తున్నాయి… ఇక్కడ రేవంత్ రెడ్డి చర్య సమంజసమా కాదా..? ఇదొక చిక్కు ప్రశ్న… వోట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, ఆర్థిక సర్దుబాట్లు లేక, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలకు తెగబడటం కరెక్టేనా అనేది మరో సంక్లిష్ట ప్రశ్న… ఐతే దీనికి భిన్నంగా మరికొన్ని ప్రశ్నలు…
Ads
దాదాపు 30, 40 వేల కోట్ల ఆ భూమి సుదీర్ఘ కోర్టు కేసుల తరువాత రాష్ట్ర ప్రభుత్వం పరమైంది… కేసీయార్ అధికారంలో ఉండి ఉంటే అమ్మేవాడు కాదా..? తను ప్రభుత్వ భూములు అమ్మలేదా..? వెంచర్లు వేసి మరీ అమ్మాడు కదా… అసలు వైఎస్ నుంచి రేవంత్ దాకా ప్రభుత్వ భూములు అమ్మని సీఎం ఎవరైనా ఉన్నారా..? ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణవాదులు అయిపోయారు అర్జెంటుగా…!
సరే, ఈ ప్రశ్నల్ని కాసేపు పక్కన పెట్టి… అసలు ఈ భూముల కథ తెలుసుకోవాలి… నేను హైదరాబాద్ కట్టాను వంటి శుష్క వ్యాఖ్యలు చేస్తుంటాడు కదా చంద్రబాబు… నిజానికి ఈ 400 ఎకరాల్ని కబళించడానికి 2004లో… అంటే తను కుర్చీ కోల్పోయే ముందు హడావుడిగా ప్రయత్నించాడు తను… ఇదీ కాంగ్రెస్ విమర్శ అప్పట్లో… తన బినామీ, అత్యంత ఆప్తుడు బిల్లీరావుతో అప్పటికప్పుడు ఐఎంజీ భారత్ అనే సంస్థను ఏర్పాటు చేయించాడు…
ధారాదత్తం చేశాడు… అదే గనుక తన చేతిలో ఉండి ఉంటే దాని విలువ ఇప్పుడు 30, 40 వేల కోట్లు… ఒకసారి అర్థం చేసుకోవాలి చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉండేదో… వైఎస్ వచ్చాక ఈ అప్పగింతల్ని రద్దు చేశాడు… సదరు బిల్లీరావు హైకోర్టుకు పోయాడు, ఫెయిలయ్యాడు… సుప్రీంకోర్టు వెళ్లాడు, చుక్కెదురైంది…
ప్రభుత్వ ఆస్తికి ఎట్టకేలకు విముక్తి… ప్రభుత్వం చకచకా టీజీఐఐసీకి అప్పగించేసింది… అంటే, ఎవరికైనా కేటాయించడానికి లేదా అమ్మడానికి..! అత్యంత విలువైన భూమి అది… రియల్ ఎస్టేట్ అనకొండలు, కార్పొరేట్ శక్తుల కళ్లున్నాయి ఇప్పటికే ఆ భూములపై… ప్రభుత్వానికేమో డబ్బు కావాలి… ఇదీ సిట్యుయేషన్… కాలుష్యం పెరిగిన నగరానికి కాసింత ఆక్సిజెన్ ఇస్తున్న ఆ భూములను అమ్మడం దుర్మార్గం కాదా..?
ఈ ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు… ఉండదు… ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ పాలన సాగించే ఏ ప్రభుత్వం దగ్గర కూడా సమాధానాలు దొరకవు… అవును, నాటి వైఎస్ నుంచి నేటి రేవంత్ దాకా… ఆస్తులు అడ్డంగా కరిగిస్తూ పాలించడమే..!!
1969లో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డంగా అణిచివేశాక సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు ఇచ్చింది… ఈ 400 ఎకరాలు అందులోనివే అని ఒక వాదన… మరి అందులోనివే అయితే చంద్రబాబు ఎలా అప్పనంగా అప్పగించాడు వాటిని ఓ ప్రైవేటు సంస్థకు..? ఏ ప్రొసీజరల్ జస్టిపికేషన్ కూడా లేకుండా..,!! జస్ట్, అలా ఎలా అప్పనంగా ఇచ్చేశాడు…
సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానివే ఈ భూములు అని ఈమధ్యే తేల్చింది కదా… మరిప్పుడు హఠాత్తుగా అవి యూనివర్శిటీ భూములు ఎలా అయ్యాయి..? ఇంతకీ అవి ఎవరి భూములు..? తేల్చాల్సిందిప్పుడు ఎవరు..?! అప్పట్లో తీసుకున్న ఈ 400 ఎకరాల భూమికి ప్రతిగా 36, 37 సర్వే నంబర్లలో వేరే 400 ఎకరాల్ని రాష్ట్రం యూనివర్శిటీకి కేటాయించిందని ప్రభుత్వ వాదన…!! అలాంటప్పుడు ఈ 400 ఎకరాలు యూనివర్శిటీవే అని ఎలా నిర్ధారిస్తారు..?!
Share this Article