సోషల్ మీడియా ట్రోలర్లకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ నడుస్తూ ఉండాలి…. లేకపోతే బోర్… అటూఇటూ రెండుగా చీలి వాగ్వాదాలు సాగుతూ ఉండాలి… సమయానికి ఏదీ దొరక్కపోతే క్రియేట్ చేస్తారు కూడా…
విచిత్రమేమిటంటే..? రచయితలు కూడా ఇలాంటివి మొదలుపెడుతున్నారు… అగ్గిపుల్ల గీస్తారు, ఇక ఎవరెవరో పెట్రోల్ జల్లుతూ పోతారు… ఇదీ అంతే… పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున స్టార్ షటిలర్, మన తెలుగుమ్మాయి పీవీ సింధు ఫ్లాగ్ బేరర్… అరుదైన గౌరవం అది… అందుకే సంబరంగా ఉందంటూ ట్వీట్ చేసి మురిసింది… సహజం…
అయితే ఆమె కట్టుకున్న చీరె మీద రచ్చ… ఇండియన్ డ్రెస్ కల్చర్‌కు అనుగుణంగా తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన డ్రెస్సులవి… భారతీయ పతాకం రంగులు కూడా ప్రముఖంగా కనిపించే దుస్తులు… మహిళలయితే చీరెలు, జాకెట్లు… పురుషులయితే తెల్లటి కుర్తా, బూండీ జాకెట్లు… కానీ బెంగుళూరు రచయిత నందితా అయ్యర్‌కు నచ్చలేదు…
Ads
అసలు ఇవేం డ్రెస్సులు, మన సంస్కృతికి దీటైన డిజైన్లు ఉండాలి కదా… ముంబైలో 200 రేటుకన్నా తక్కువకు ఇంతకన్నా మంచివి దొరుకుతాయి… చౌక పాలిస్టర్ బట్టతో అడ్డదిడ్డంగా హడావుడిగా, అప్పటికప్పుడు గంటల్లో ఈ యూనిఫామ్స్ డిజైన్ చేసినట్టున్నారు… మన దేశం సుసంపన్నమైన చేనేత కళకు ప్రసిద్ధి అయినా ఓ అంతర్జాతీయ ఉత్సవ వేదిక మీద ఇంత అధ్వానపు డ్రెస్సులను ధరింపచేయడం ఏమిటనేది ఆమె ప్రశ్న…
ఐతే, వాటిని ధరించిన వాళ్లను నేను అగౌరవపరచడం లేదనీ, తన విమర్శ కేవలం ఆ దుస్తుల మీదేనని క్లారిటీ కూడా ఇచ్చింది పాపం… నిజానికి అంత అధ్వానంగా ఏమీ కనిపించలేదు ఆ డ్రెస్సులు… మంచి డిజైన్‌తో మన త్రివర్ణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి… ఎంబరాసింగ్ ఏమీ లేదు… జాకెట్, చీరె అంచులు కూడా బాగున్నట్టే ఉన్నాయి…
చూడండి అంటూ… ఇతర దేశాల డ్రెస్సులను కూడా ఆమె తన ట్వీట్లకు జతచేసింది… నిజానికి అక్కడ ఆడంబరమైన, అత్యంత ఖరీదైన వస్త్రాలు కాదు కనిపించాల్సింది… వీడియోల్లో, ఫోటోల్లో వాటి ఖరీదు ఏమీ కనిపించదు… లుక్ అనేదే ప్రధానం… సంపద ప్రదర్శనకు అదేమైనా అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కాదు కదా…
గెలవాల్సింది, నిలవాల్సింది పతకాల సాధనలో… ఒక్కో పతకం పట్టుకుని గర్వంగా జెండా ఎగరేస్తున్నప్పుడు ఆ కళ్లల్లో వెలుగు, ఆ జెండా మెరుపు తళతళలాడాలి… ఆ సంఖ్య ముఖ్యం గానీ ఆ చీరె ఖరీదు ఎంతయితేనేం..? ఏమంటావు డాక్టర్ నందితా అయ్యర్… ఐనా ఎలా డిజైన్ చేసినా, బాగున్నా మహిళలకు ఓపట్టాన నచ్చవు కదా…!!
Share this Article