తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలను కొందరు టోకున కొనుగోలు చేసి, పెళ్లిళ్లలో అతిథులకు ఓ స్వీట్ అయిటమ్‌గా పంచిపెడుతున్నారనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు… ఓ అస్పష్టతలోకి తోసేసింది నన్ను… ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేసి దాని పవిత్రతను దెబ్బతీశారని అనుకోవాలా..? అంతమందికి శ్రీవారి ప్రసాదాన్ని పంచిపెట్టి పుణ్యం మూటకట్టుకున్నారు అనుకోవాలా..?
మొన్నెవరో జబర్దస్త్ కమెడియన్ చేసిన వ్యాఖ్య చూశాను… రోజా వందల మందిని తీసుకుని తిరుమలలో స్పెషల్ దర్శనాలు ఇప్పించేది… మందలుమందలుగా తీసుకెళ్లి, చూశారా నేను ఇంతమందికి ప్రత్యేక దర్శనాలు ఇప్పించాననే ఓరకమైన ఫాల్స్ ఇమేజీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసిందని జాలిపడాలా..? అంతమందికి ప్రత్యేక దర్శనాలు చేయించి పుణ్యం మూటగట్టుకున్నదని అనుకోవాలా..?
నిన్న ఓ వార్త… టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టీకరణ అది… తను ఈవో అయ్యాక రెగ్యులర్ తనిఖీలు, సత్వర నిర్ణయాలతో అక్కడి వ్యవస్థను ఎంతోకొంత స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు, గుడ్… కానీ ఈ వార్తలో తను చెప్పిన అంశాలు కొంత అయోమయాన్ని క్రియేట్ చేసేవే… ఇకపై దర్శనం చేసుకొనని వారికి ఆధార్ కార్డుపై రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పాడు…
Ads
లడ్డూ ప్రసాదం పంపిణీని రెండున్నర నెలలు పరిశీలించాకే ఈ నిర్ణయం అంటున్నాడు… ఎందుకంటే..? రోజూ 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తుంటే, దర్శనం టోకెన్లు ఉన్నవారు 2.5 లక్షల లడ్డూలు పొందుతూ ఉంటే, దర్శనం చేసుకొననివారు లక్ష లడ్డూలు పొందుతున్నారట… అంటే సగటున దర్శనం చేసుకున్న భక్తుడు సగటున 3 లడ్డూలు పొందుతుంటే, దర్శనం చేసుకొననివారు సగటున అయిదు లడ్డూలు పొందుతున్నారట…
సో, దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఓ కొత్త పద్ధతి పెడుతున్నారు ఇప్పుడు… దర్శనం చేసుకున్న వారికి ఎలాగూ ఒక లడ్డూ ఫ్రీ… అదనంగా కావాలంటే ఎన్నయినా కొనుక్కోవచ్చు… దర్శనం చేసుకొననివారు మాత్రం ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డూలు తీసుకోవచ్చునట… ఇక్కడ మదిని తొలిచే ప్రశ్న ఏమిటంటే..? దర్శనం చేసుకొననివాళ్లకు లడ్డూలు ఎందుకు ఇవ్వాలి…? డబ్బు పెట్టి కొన్నా సరే..! శ్రీవారిని దర్శనం చేసుకునేవారికే కదా ప్రసాదం ఇవ్వాల్సింది… ఉచితంగా ఇచ్చినా, వాళ్లు కొనుగోలు చేసినా…!
ఎవరికిపడితే వారికి అమ్మడానికి అదేమైనా స్వీట్ అయిటమా..? మరలాంటప్పుడు ఈ లడ్డూలను పెళ్లిళ్లలో స్వీట్ అయిటంగా పెట్టే పెద్దమనుషులకూ టీటీడీకి తేడా ఏమున్నట్టు..? ఆ లడ్డూ పవిత్రతను ఏం కాపాడుతున్నట్టు..? ఎవరో ఔట్ సోర్సిం్ ఉద్యోగులు ఇలా టోకున లడ్డూలు అమ్మేస్తున్నట్టు గమనించారట… వ్యక్తులు కాదు ఇక్కడ, అలా కొనుగోలు చేయడానికి అవకాశం ఇచ్చే సిస్టమ్‌ది, అందులోని లోపాలది కదా తప్పు..? ఉద్యోగులను తీసేస్తారు సరే, కానీ ఆ లోపాలను కదా ముందు సరిదిద్దాల్సింది…
దర్శనం చేసుకునేవారికి మాత్రమే లడ్డూ ఇస్తే, దానికి విలువ… అందరికీ అమ్మేస్తే దానికి విలువ ఏమున్నట్టు..? టీటీడీయే ఆ విలువను తగ్గిస్తున్నట్టు కాదా..? అది సమంజసమా..? గతంలో తిరుమల వెళ్లొస్తే లడ్డూ ప్రసాదాన్ని ఇరుగూపొరుగుతో, బంధుమిత్రులతో పంచుకునేవారు… అందులో భక్తిభావన ఉండేది… మరిప్పుడు..? ఎన్నంటే అన్ని కొనుక్కువచ్చి పంచేస్తుంటే అది ‘అంగడి మిఠాయి’ అయిపోయింది తప్ప, అరుదైన ప్రసాదం ఎలా అనిపించుకుంటుంది..?
లడ్డూల పేరిట ఎంత ఖర్చవుతుంది..? ఎంత తిరిగి వస్తుంది..? రోజూ ఎంత నష్టం..? ఈ లెక్కలు కాదు… నాణ్యత, పవిత్రత… రెండూ ప్రధానమే… ప్లస్ లభ్యత కూడా..! నాణ్యత ఎలాగూ ఏటేటా దెబ్బతీస్తూనే ఉన్నారు… లభ్యతను కూడా పెంచి విలువనూ తగ్గిస్తున్నారు… రెండూ పాపాలే…!!
టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల అధ్యక్షుడట… వేలాది మంది భక్తులు దర్శనం చేసుకోలేక అఖిలాండం దగ్గరే మొక్కుకుని వెళ్లిపోతున్నారనీ, వాళ్లకు ప్రసాదం లభిస్తే బంధుమిత్రులతో పంచుకుంటారనీ, లడ్డూ అమ్మకాల్లో టీటీడీకి లాభమే ఉందని ఏదేదో చెప్పుకొచ్చాడు… దర్శనభాగ్యం లేని వారికి ప్రసాద భాగ్యం కూడా ఉండొద్దు కదా సోదరా..? ఐనా ఇలాంటి విధాన నిర్ణయాల్లో మీ అభిప్రాయాలు, ఆంక్షలు, ఒత్తిళ్లు ఏమిటి..? లడ్డూపై టీటీడీకి లాభమే వస్తుంది కాబట్టి ‘అమ్మకాలు’ ఉదారంగా ఉండాలా..? ఇదెక్కడి వితండవాదం..?
Share this Article