Sankar G……… పాత శీతల పానీయాలు (కూల్ డ్రింక్) బ్రాండులు ఎన్ని గుర్తు ఉన్నాయి మీకు ? ఎప్పుడో 1971 లో వచ్చిన “రౌడీ లకు రౌడీలు” సినిమాలో ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాత పాట “తీస్కో కోక కోలా ..ఏస్కో రమ్ము సోడా ‘. ఇది ఆ కాలంలో క్లబ్బు పాటలకి బాహుబలి. దీన్ని రాసింది ఆరుద్ర . అంటే ఆకాలంలోని క్లబ్బుల్లో కోకా కోలా హవా నడుస్తుండేదన్న మాట . ఈ మధ్య వచ్చిన “లూకా చుప్పి” లో “కృతి సనన్” , “కోకాకోల తు …షోల షోల తు “అని పాడుతుంది . అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా కోకోకోలా మత్తు మనకి దిగనే లేదు . దాని స్ట్రాటజీయే వేరు .
1977 లో తొలిసారి దేశంలో కాంగ్రెస్ పాలన పోయి, జనతా గవర్నమెంట్ వొచ్చింది. అప్పుడున్న పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నండేస్, కమ్యునిస్టు భావాలున్న వ్యక్తి. కార్మిక ఉద్యమాల్లో తిరిగి, ఎర్ర ఎర్రని, భావాలతో కొత్త దేశీయ ప్రాధాన్యత ఉన్న, పరిశ్రమల విధానం తెచ్చాడు. దీని ప్రకారం అప్పుడున్న విదేశీ కంపనీలు , మన దేశీయ భాగస్వాములతో, కలిసి పనిచేయాలి .
Ads
కొన్ని కంపనీలు ఒప్పుకున్నాయి కానీ, కోకా కోలా ససేమిరా కుదరదు అంది. ఎందుకంటే, వాళ్ళ ఫార్ములా ఇతరులతో పంచుకోము అని , మనదేశం నుంచి వెళ్ళిపోయింది. సరే కొత్త ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా వెంటనే దేశీయత మంత్రం జపించి , మోడరన్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనే ప్రభుత్వ సంస్థ తో ,”డబుల్ సెవెన్” అనే డ్రింక్ తయారీ కి అనుమతులిచ్చింది.
బహుశా ఈ డ్రింక్ ని ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ ,రాగానే దీన్ని ఉప్పు పాతర వేసి ,చెత్త బుట్టలో తొక్కేసింది. ఈ సారి మన దేశం లో ఉన్న తొలితరం లేదా ఈ మధ్య దాక ఉండి కనుమరుగు అవుతున్న శీతల పానీయాలు, అదేనండి కూల్ డ్రింకుల గురించి తెలుసుకుని , కొంచెం ఫ్లాష్ బేక్ లు పంచుకుందాం .
ఇండియాలో తొలి కోలా సాఫ్ట్ డ్రింక్ చేసిన ఘనత ” పార్లే బాట్లింగ్ కంపనీ” స్థాపించిన చౌహాన్ కుటుంబానికి చెందుతుంది . 1929 లో అప్పటికే గ్లూకో బిస్కట్లు చేసే ఈ కంపనీ “గ్లూకో కోలా “పేరుతొ కెఫీన్ లేని శీతల పానీయం చేయటం మొదలెట్టింది. అయితే కోలా అన్న తోక ఎవ్వరు తగిలించుకున్నా కోకోకోలా ఊరు కోదు. పెప్సీ పైన 22 ఏళ్ళు కోర్టులో వ్యాజ్యం వేసి దాన్ని ఓడిపోయింది. కాలంతో ఇది కూడా మెల్లగా కనుమరుగైంది . తరువాతి బ్రాండ్ మీ కందరికీ సుపరిచితమే.
లిమ్కా : నిమ్మ రుచితో ఉండే లిమ్కా ఇప్పటికి నిలిచి ఉంది. 1977 లో పైన చెప్పుకున్న జనతా ప్రభుత్వ దేశీయ ఉత్పత్తుల హంగామా లో, వచ్చిన పానీయం ఇది. దీన్ని కూడా పార్లే వారే చేసారు. “లింబు కా “ అంటే నిమ్మతో అని అర్ధం వచ్చే మాటని కలిపి లిమ్కా గా మార్చి ప్రకటన చేసారు. దీని టేగ్ లైన్ ” లైమ్ అండ్ లెమనీ” కూడా జనాల నోళ్ళలో బాగా నానింది .
గోల్డ్ స్పాట్ : విజయ వాడ లో గుణదల దాటాక గోల్డ్ స్పాట్ బస్టాప్ ఉండేది. అక్కడ వారికి అతి పెద్ద బాట్లింగ్ ప్లాంట్ ఉండేది. 1977 లో పార్లే ఉత్పత్తి చేసిన మూడు డ్రింక్ లు “లిమ్కా,గోల్డ్ స్పాట్ ,థమ్స్అప్ “లలో ఇదొకటి. నిజానికి ఇది 1952 నుంచే ఉన్నా, పాపులర్ అయ్యింది మాత్రం 77తర్వాతే . దీనికి అప్పటికే పార్లే చేస్తున్న “గోల్డ్ స్టార్ పిప్పరమెంట్” పేరుని వాడుకుని “గోల్డ్ స్పాట్ “పేరు పెట్టారు . నిజంగా అది ఒక తిమ్మిరి గా ఉండే ఆరంజ్ ఫ్లేవర్తో బాగుండేది. బాగా అమ్ముడు పోయేది కూడా . అయితే ఈ బ్రాండులనే ,కోకోకోలా తిరిగి వచ్చాక కొనేసుకుని, వెంటనే కొన్నిటిని ఆపేసింది. ఎందుకంటే “ఫేంటా” పేరుతో అది చేసే ఆరంజ్ డ్రింకుకి పోటీ ఉండకూడదు అని భావించడమే . గోల్డ్ స్పాట్ టాగ్ లైన్ “ది జింగ్ థింగ్”.
సిట్రా: ఇది కూడా పార్లే వారిదే. లిమ్కా కంటే ఇంకొంచెం ఘాటుగా ,కొంచెం పెద్దవారికి తగినట్టుగా ఉండే పానీయం.ఎక్కువ కేరళలో ప్రాచుర్యం పొంది తర్వాత నెమ్మదిగా మాయం అయ్యిపోయింది .
థమ్స్అప్:” టేస్ట్ ద థండర్” అంటూ దూసుకుని వచ్చిన, ఈ పానీయం కోకాకోలా కి ప్రత్యామ్నాయం గా బోలెడు హృదయాల్ని గెలుచుకుంది. బ్రాండ్ లోగో లోనే -ఒక చేయి ఎర్ర రంగులో బొటనవేలు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. దీన్ని కోకాకోల కంటే ఘాటు రుచి ఉండేట్లు చేసారు. 1991 లో సరళ ఆర్ధిక విధానాల్లో పెప్సీ వచ్చాకా ఈ రెంటికి బాగా పోటీ ఉండేది. మొదట “హేపీ డేస్ ఆర్ హియర్ అగైన్ “అని తర్వాత” ఐ వాంట్ మై థండర్” అని చివరకు “టేస్ట్ ద థండర్” లా మారిపోయిన దీని ప్రకటన అందరికి తెగ నచ్చేది. 2010 తర్వాత మగతనం(macho,) అనే కాన్సెప్ట్ పెరిగి సల్మాన్ ఖాన్ , మహేష్ బాబు ఇలా సినీతారల ప్రకటనలతో బాగా పాపులర్ అయ్యింది.
కేంపా కోలా : పైన చెప్పిన వాటికన్నా భిన్నంగా పార్లే కాకుండా ” ప్యూర్ డ్రింక్స్” అనే కంపనీ తయారు చేసిన శీతలపానీయం ఇది. 1970 నుంచి ఉన్నా కూడా, కోకాకోలా నిష్క్రమణ తర్వాతే, ఇది ఫేమస్ అయ్యింది. ఈ గ్రూప్ వారు కోకాకోలా వెళ్లకముందు, వారికి ఈ దేశం లో ముఖ్య సరఫరాదారు. వీరి స్లోగన్ “ద గ్రేట్ ఇండియన్ టేస్ట్”.
పెప్సీ :అమెరికా లో నార్త్ కరోలినా లో” బ్రాడ్స్ డ్రింక్” పేరుతొ ,1893 లో మొదలైయిన ఈ డ్రింక్ ప్రస్థానం తొలిదశలో “డిస్పెప్సియ” (dyspepsia) అంటే అజీర్ణం కి విరుగుడు లా ప్రచారం అయ్యిందట . ఆ భావానికి గుర్తు ఉండేలా “పెప్సిన్ “అనే ఎంజైమ్ పేరు తో పెప్సీ అని పేరెట్టారు. పేరు మాత్రమె ఇందులోఉంది కానీ, ఎంజైమ్ లాంటిదేమీ లేదు. మొదట్లో సరిగా అమ్మకాలు లేక 1962 లో దేశం వీడిన పెప్సీ, మళ్ళీ 1988 లో వచ్చింది. ఈ సారి ఆర్ధిక చట్టాల కారణంగా భారతీయ కంపనీ తో కలిసి, “లెహర్ పెప్సీ” అని పేరు మార్చుకోవలసి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత చట్టం లో వచ్చిన మార్పుతో తిరిగి పెప్సీ గా మారింది. లెహర్ పెప్సీకి “యెహీ హై రైట్ ఛాయస్ బేబీ” అని అమీర్ ఖాన్ ప్రకటన ఇచ్చ్చేవాడు. ఇలాగ…. క్యూట్ గా …
7అప్: ఇది పెప్సీ వాళ్ళ నిమ్మ రుచి గల పానీయం . దీని రుచి కంటే దీని ప్రకటనే బాగా గుర్తుంది పోయేది. ఎందుకంటే దీని అనిమేషన్ లో వాడిన “ఫిడో ద డిడో “ (fido the dido) అనే కేరక్టర్ సంచలనం సృష్టించాడు. ఇవన్నీ కాల పరీక్షలో శీతలాన్ని ,అస్తిత్వాన్ని కోల్పోయి చాలావరకు జ్ఞాపకాల్లో పదిలంగా నిల్చున్నాయి. ఇంకా ఈ లిస్టు లో ప్రాంతీయం గా పేరు బడిన- “ఆర్టోస్, బోవొంటో, టోరినో, అప్పీ, బెజోఇస్, ఫ్రుటి, రిమ్జిం, రస్నా, మంగోలా, డ్యూక్, సోస్యో, కేవెంటర్, ఎనర్జీ , విమ్టోకోలా’ లాంటి వాటిని చేర్చలేదు…
Share this Article