ఎన్ని గుండెలు నీకు? నాతోనే పెట్టుకుంటావా? అని సాధారణంగా ఒక బెదిరింపు మాట వాడుకలో ఉంది. ఇప్పుడు గుండె కూడా అక్షరాలా అదే మాటతో మనుషులను బెదిరిస్తోందని ఐక్యరాజ్యసమితి బాధపడుతోంది. ఒకరినుండి ఒకరికి సంక్రమించే వ్యాధులు కాకుండా- గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా 2019లో రెండున్నర కోట్ల మంది చనిపోయారట. ఇందులో గుండె జబ్బులవారే అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గుండెలు బాదుకుంటోంది.
వయసు ఎంతగా పండినా బహుశా పండితే బాగోదని ఎప్పటికీ గుండె కాయగానే ఉండిపోయినట్లు ఉంది. గుండెలయలోనే మన ప్రాణం ఉంది. గుండె గతిలోనే మన బతుకు గతి ఉంది. గుండె లబ్ డబ్బుల్లోనే మన ఆయుష్షు డబ్బంతా ఉంది. గుండె గూట్లోనే మన రక్తాన్ని శుద్ధి చేసే క్లీనింగ్ మిషన్ ఉంది. గుండె పవర్ హౌస్ నుండే ప్రాణ విద్యుత్తు కనెక్ట్ అయిన విద్యుత్‌తీగలు సిరలు ధమనులుగా శరీరమంతా వ్యాపించి ఉన్నాయి. గుప్పెడంత గుండె కంటి మీద కునుకు లేకుండా, ఒక సెకను కూడా ఆగకుండా పంపు చేస్తేనే శరీరంతా వెంట్రుకంత వ్యాసార్ధంలో ఉన్న పైపుల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. గుండె కవాటాల పనితీరు సృష్టిలోనే ఒక అద్భుతం.
Ads
తెలుగులో గుండె అంటే గుండే. సంస్కృతంలో హృదయం అంటే గుండెకు మించిన అర్థవ్యాప్తి ఉంది. అందుకే కార్డియాలజిస్ట్ ను గుండెల డాక్టర్ అని అనలేకపోయాం. హృద్రోగ నిపుణుడు అంటున్నాం. గుండెలు తెరిచి అతుకులు, కుట్లు, అల్లికలు వేసే కార్డియాలజిస్ట్ ను గుండెల డాక్టర్ అంటే గుండెలుతీసిన బంటు అన్న నీచార్థం వస్తుందేమో అని భయపడినట్లున్నాము.
ఒక రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువుంటే బై పాస్ రోడ్డు వేయడం ఒక్కటే పరిష్కారం. అలాగే గుండె నాళాల్లో ఎక్కడన్నా అడ్డు తగిలితే బై పాస్ చెయ్యాల్సిందే. కోయకుండా సన్న తీగను పంపి అడ్డును తొలగించే స్టెంట్ వేయడమా? లేక ఛాతీని నిలువునా కోసి ఓపెన్ హార్ట్ సర్జరీనా? అనేది డాక్టరు నిర్ణయం; ఆయన దయ; మన ప్రాప్తం; ప్రారబ్దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది.
“Don’t take it to heart”
అని ఇంగ్లీషులో ఒక మాట. “మనసులో పెట్టుకోకు” అన్నది బహుశా దీనికి తెలుగులో సరైన మాట. కానీ ఇది చెప్పినంత సులభం కాదు. అన్నీ గుండెకే తీసుకుంటాం. అన్నీ మనసులోనే పెట్టుకుంటాం. నిజానికి గుండెలా మనసు శరీరంలో ఒక అవయవం కాదు. గుండె- మెదడు మధ్య జ్ఞాపకాలు, స్పందనలు, అనుభూతులు ఇంకా ఏవేవో మాటల్లో చెప్పలేని అమూర్త భావనల సమాహారం మనసు. కోపతాపాలు, ఉద్వేగ ఆనందాలకు గుండె స్పందనల్లో మార్పు సహజం. ఆ సమయంలో రక్తపోటులో ఎగుడు దిగుళ్లు ఉంటాయి. నిజానికి మనం మనసు భారాన్ని గుండె మీద పెట్టి దాని దుంప తెంచుతున్నాం. ఏడిస్తే మనసు కుదుట పడుతుందనుకుని కుళ్లి కుళ్లి ఏడుస్తూ గుండెను తెగ ఏడిపిస్తున్నాం.
“గుండె మంటలారిపే సన్నీళ్లు కన్నీళ్లు”
అని మూగమనసులులో ఆత్రేయ అన్నాడు కదా అని గుండెమంటల మీద బక్కెట్లకు బక్కెట్ల కన్నీళ్లు చల్లుతున్నాం.
“బాలానాం రోదనం బలం”
అని పసిపిల్లలకే ఏడుపు బలం. పెద్దవారికి కాదు. పెద్దవారు ఎంతగా ఏడిస్తే; ఎంతగా ఏడుపు మొహం పెట్టుకుని ఉంటే గుండె అంతగా కుచించుకుపోతూ ఉంటుంది.
గుండె ఎక్కడ తనకుతాను కొట్టుకుంటూ ఆరోగ్యంగా ఉండి మనల్ను బతికిస్తుందో అన్న ఆందోళనలో సిగరెట్లు తాగుతూ, మద్యం పుచ్చుకుంటూ, నిద్ర లేకుండా, టెన్షన్ టెన్షన్ గా ఉంటూ దాన్ని అన్ని విధాలా చెడపడానికి శక్తివంచనలేకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం.
గుండె ధైర్యం
పిరికి గుండె
గుండె దిగులు
గుండె జారింది
మొండి గుండె
గుండెల్లో ప్రేమ
గుండె చప్పుడు
గుండె గూడు
గుండె గూటికి పండగ
గుండె మంట
గుండె బరువు
గుండె వేగం
గుండెకు గుండె
అని మన వ్యక్తిత్వాలను, స్వభావాలను, మంచి చెడులను అమాయక గుండెకు ఆపాదిస్తాం. దాంతో గుండె బాగా హర్ట్ అయ్యింది. చెయ్యో, కాలో హర్ట్ అయితే వీల్ చెయిర్ లో కూర్చున్నా దర్జాగా బతకవచ్చు. గుండె హర్ట్ అయితే-
హార్ట్ అటాక్
హార్ట్ బ్రేక్
హార్ట్ ఫెయిల్యూర్.
వడిబాయక తిరిగే ప్రాణ బంధుడా!
అని అన్నమయ్య అన్నది ఈ గుండె చప్పుడు గురించే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గుండె లయలోనే ప్రాణం దాగి ఉంది. గుండె కొట్టుకోవడం ఆగినా; తీసుకున్న ఊపిరి వదలకపోయినా,ఊపిరి వదిలి తీసుకోలేకపోయినా తుది శ్వాస వదిలినట్లే. ఇలా ఊపిరిగా, గుండె లయగా ఒక క్రమపద్ధతిలో తిరుగుతున్నది ప్రాణబంధుడయిన దేవుడే అంటాడు అన్నమయ్య.
కాస్త కుదురుగా కూర్చుకుని లయతప్పుతున్న గుండెను మళ్లీ శ్రుతి చేసుకోకపోతే- బతుకులో శ్రుతిలయలు మిగలవు. సంగీతంలో శ్రుతి లయ తప్పితే అపస్వరం- కర్ణ కఠోరం. గుండె శ్రుతి లయ తప్పితే అనారోగ్యం- ప్రాణాలకే ప్రమాదం.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article