——————–
అంటే… ఇండియాలో ఇక కరోనా లాక్ డౌన్ ఉండదు. కానీ కరోనా ఉంటుంది. మాస్క్ ఉన్నవారికి ఉంటుంది. లేనివారికి లేదు. భౌతిక దూరం దూరమై దగ్గర ఒక్కోటే దగ్గరవుతుంది. వ్యాక్సిన్ ఉంటుంది. మందులుంటాయి. పరీక్షలుంటాయి. మరణాలుంటాయి. ఉండేవి. ఉన్నాయి. ఉంటాయి. ఉండబోతాయి.
వ్యాకరణంలో భూత భవిష్యత్ వర్తమాన క్రియలు చాలా ప్రధానం. ఎంత వ్యాకరణం తెలిస్తే అంత గందరగోళం పెరుగుతుంది. ఎంత వ్యాకరణం అర్థమయితే అంత అయోమయం పెరుగుతుంది. కర్మ బలీయమయినపుడు ఖర్మగా కాలుతుంది.
Ads
సెకెన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు…మన లెక్కకొసమే కానీ- కరోనాకు ఈ లెక్కలు లెక్కలోకే రావు. కరోనా నిజానికి ఎవరినీ లెక్క పెట్టదు. కరోనాకు ఎదురు వెళ్లినా; కరోనానే ఎదురొచ్చినా కరోనాయే వస్తుంది.
కరోనా భూతం- భూతకాలం
————–
ఏడాది కరోనా రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది. లాక్ డౌన్లు, ఆంక్షలు, కొవ్వొత్తులు, బాల్కనీలో ప్లేట్లు కొట్టడాలు…ఎన్నెన్నో జరిగాయి. గడచిన భూత కాలంలో కరోనా పుట్టి పెరిగి నాలుగు నెలలకే ప్రపంచం పట్టనంత పెద్దదయ్యింది.
కరోనా- వర్తమానం
—————–
వర్తమానం కరోనా కాలానిదే. ఎప్పుడూ అలవాటులేని ఎన్నెన్నో కొత్త అలవాట్లు చూస్తున్నాం. కరోనా వర్తిస్తూనే ఉంది. ఒక వర్తన చాలక అనేక ఉత్పరివర్తనలతో మ్యుటేషన్లతో విలయ నర్తనం చేస్తూనే ఉంది. ల్యాండ్ మ్యుటేషన్ చాలా సులభం. ధరణి పోర్టల్లో ఇలా కొడితే అలా మ్యుటేషన్ అయిపోవచ్చు. కరోనా కూడా అంతే. తను తిరిగే భూమిని బట్టి ధరణి పోర్టల్లోకి వెళ్లకుండానే- ఆటోమేటిగ్గా మ్యుటేషన్ చేసుకుంటూ ఉంటుంది.
కరోనా- భవిష్యత్ కాలం
—————
జాతకాల మీద ఒక జోక్ బాగా ప్రచారంలో ఉంది. బాబూ మీకు నాలుగేళ్లు కష్టాలుంటాయి అంటే వెంటనే అయితే అయిదో సంవత్సరం నుండి కష్టాలుండవు- అంతే కదా? అని అన్నాడట. కాదు- తరువాత కష్టాలు అలవాటయిపోతాయి అన్నది జాతకం చెప్పిన పెద్దాయన ఓదార్పు పలుకు. అలా వేసవిలో వేడికి కరోనా మాడి మసైపోతుంది అన్నారు. వ్యాక్సిన్ వస్తే పోతుంది అన్నారు. రుతువులు మారాయి. వ్యాక్సిన్లు వచ్చాయి. అయినా కరోనా పోలేదు. పొయ్యేలా లేదు. పోతుందన్న గ్యారెంటీ లేదు. భవిష్యత్తు కరోనాదే.
కరోనా- కలకలం- కలకాలం
——————
కలకాలం ఉండవులే కష్టాలు, కన్నీళ్లు- అని ఓదార్పు పాటను కొంచెం తిరగరాసుకుని-
“కలకాలం ఉండునులే కరోనా కలకలం”
అని ఓదార్పు లేని పాట బృందగానంలా అందరూ పాడుకోవడమే ఇప్పుడు చేయాల్సింది.
ముందు ముందు జాగ్రత్త ఒక్కటే మందు…….. By….-పమిడికాల్వ మధుసూదన్
Share this Article