ఎందుకు మెచ్చుకోకూడదు..? స్టాలిన్‌ను ఇన్నేళ్లూ కరుణానిధి కొడుకు అనే చట్రంలోనే చూశాం… తండ్రి చాటు కొడుకు… పాలనలో తన నిర్ణయాధికారం ఏమీ లేదు… డీఎంకే గత పాలన తీరూతెన్నూకు స్టాలిన్ జవాబుదారీ కాదు, ఓనరూ కాదు… ఇప్పటి ప్రభుత్వం తనది, ఇప్పటి గెలుపు తనది… సీట్ల పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం పూర్తిగా తన శ్రమ, తన ప్రయాస, తన బుర్ర… అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రతి నిర్ణయానికీ స్టాలిన్ బాధ్యుడు… ఇప్పటివరకైతే ప్రతి అడుగూ సక్రమం, విభిన్నం, పరిపక్వం… నిజానికి స్టాలిన్ పాలన ఇలా మెచ్యూర్డ్‌గా ఉంటుందని చాలామంది అనుకోలేదు… రేప్పొద్దున తను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడేమో, అవీ వేచిచూద్దాం… కానీ ఇప్పటివరకైతే సరైన అడుగులు… క్షుద్ర రాజకీయ భావనలతో పాత అన్నాడీఎంకే అమ్మ క్యాంటీన్లను మూసేయకుండా, వాటినలాగే కొనసాగించిన తీరు స్టాలిన్ మీద సదభిప్రాయానికి తొలిమెట్టు… అలా కొన్ని కొన్ని… మరి ఇప్పుడు..? (తమిళ నెటిజన్ల సోషల్ మీడియా తాజా పోస్టులను బట్టి…)
తెల్ల రేషన్ కార్డు దారులకు 14 రకాల నిత్యావసరాల వస్తువుల పంపిణీ… నూకలు, గడ్డల దొడ్డుబియ్యం ఇచ్చి పండుగ చేసుకొండి అనే ముఖ్యమంత్రి కాదు తను… ఈ విపత్తువేళ నిజంగా ఆదుకునే సంకల్పం ఇది… ఉప్పు, పప్పు, బెల్లం, చమురు, చక్కెర… సింపుల్, ఆ బ్యాగుల మీద కరుణానిధి బొమ్మ లేదు, కలైంగర్ గోరుముద్ద అని గానీ, పెరియార్ బువ్వగిన్నె అని గానీ పథకం పేరు పెట్టలేదు… పత్రికల్లో ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ లేవు, టీవీల్లో కోట్ల యాడ్స్ లేవు… డప్పుల్లేవు, చప్పుళ్లు లేవు… సొంత కరపత్రికల్లో కాలాల కొద్దీ డొల్ల కథనాల్లేవు… చివరకు సోషల్ మీడియా వికారాలూ లేవు… జస్ట్, స్టార్ట్ చేసేశాడు… అప్పట్లో చంద్రబాబు హయాంలో ఓసారి చూశాం కదా ఇలాంటి కానుకల పంపిణీ సమయంలో ఎంత హంగామా, ఎంత ప్రచారం… సాయం మూరెడు, అట్టహాసం బారెడు… ఇప్పుడూ అంతే… (కోట్ల ఖర్చుతో నిరర్థకంగా సాగే సహపంక్తి భోజనాలకన్నా ఇలాంటి కిట్లతో ఎన్ని కోట్ల కడుపులు నింపొచ్చో అర్థమైందా కేసీయార్ సారూ… ఆకలి తీర్చే ప్రభువుల పేర్లే చిరస్థాయిగా ఉంటాయి చరిత్రలో…)
Ads
నిజానికి వోట్ల లబ్ది కోసం సాగే కానుకల పంపిణీ, వేల కోట్ల పంచుడు పథకాల ధనదుర్వినియోగంతో పోలిస్తే స్టాలిన్ చర్య గుడ్… ఇది నేరుగా పేదవాడి కడుపును చేరుతుంది… అనర్హులు ఉంటే ఉండవచ్చుగాక, ఇచ్చిన సరుకుల్ని పారేయరు కదా… వండుకుంటారు కదా… లేక ఇంకెవరికో ఇస్తారు కదా… అంటే సరైన వినియోగం… పౌష్ఠికాహారం దాకా ఎందుకు..? కరోనా కాలంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు… అప్పులు చేసి బతుకున్నారు… బయటికి చెప్పుకోలేకపోయినా ఈ కిట్లు వారం రోజులు అలాంటోళ్ల కడుపులు నింపినా సరే, ఆ డబ్బుకు ఎంత సార్థకత… పైగా ఆ సరుకుల సంచుల మీద కేవలం తమిళనాడు ప్రభుత్వ అధికార ముద్ర తప్ప ఇంకేమీ లేదు, పార్టీ జెండాల రంగులు పులమలేదు… తండ్రి బొమ్మ లేదు, తన పేరు లేదు,.. విజ్ఞత… అయితే స్టాలిన్ చేసేవన్నీ మెచ్చుకోదగినవేనా..? ఇది పెద్ద ప్రశ్న, చిక్కు ప్రశ్న… ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవీ మాట్లాడుకుందాం… ప్రస్తుతానికి చెప్పుకోవాల్సినవి మాత్రం ఇలాంటివే…!!
Share this Article