అంతరిక్ష భోజనంబు!
ఓహోహో నాకే ముందు!!
——————–
“అస్తు..అస్తు.. శాస్త్రమెప్పుడూ ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి”
ఇది తెలుగు సినిమాలకు వెలుగు దీపమయిన మాయాబజార్ లో పింగళివారి గొప్ప మాట. “పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం” అని ఘటోత్కచులవారి చేత ఇందులోనే చెప్పించారు. భారతంలో అసలు జరగని కథను కల్పించి, దానికి మాయాబజార్ అని అత్యాధునిక ట్రెండీ పేరు పెట్టి, మాటల్లో, పాటల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, మాటల మధ్య మాటల్లో చెప్పలేని సముద్రమంత భావాన్ని దట్టించిన పింగళిలాంటి వారు ఒకరిద్దరు ఇప్పుడు పుడితే మరో వెయ్యేళ్ల దాకా తెలుగు భాషకు ప్రాణవాయువు దొరుకుతుంది. ఎన్నో అనుకుంటాం. అనుకున్నామని జరగవు అన్ని. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని!
Ads
అంతరిక్షంలో వ్యవసాయం చేసుకోవచ్చు అని శాస్త్రం నిష్కర్షగా చెబుతోంది. పింగళివారి సిద్ధాంతం ప్రకారం మనం సౌమ్యంగా సారాన్ని మాత్రమే గ్రహిద్దాం. నిజమే. అసలే రైతులు రోడ్లెక్కి నాలుగయిదు నెలలుగా బాధపడుతున్న రోజులు. పండే పంటకు గిట్టు బాటు ధర లేకపోగా, ఆ పంటను కబళించడానికి ఏవో కార్పొరేట్ కబంధ హస్తాలు చేతులు చాచి ఉన్నవేళ-భూమ్మీద వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా లేదు. వెళ్లాల్సిందే. ఇంకెక్కడికయినా వెళ్లి వ్యవసాయం చేయాల్సిందే. అందుకు అంతరిక్షమే అనువయినది.
అంతరిక్ష వ్యవసాయంలో లాభనష్టాలు:-
1 . నేల మీద అయితే రిక్షాలో తిరుగుతూ అయినా వ్యవసాయం చేయవచ్చు. అంతరిక్షంలో రిక్షాలు పనిచేయవు. రాకెట్లు తప్పనిసరి.
2 . రోజూ వ్యవసాయ కూలీల రాకపోకలకు బహుశా ఎడ్ల బండి సైజులో రాకెట్లు తయారవుతూ ఉన్నాయేమో?
3 . సాధారణంగా మనకు ఏ ఫారిన్ బ్రాండ్ అయినా చాలా ఇష్టం. స్విట్జర్లాండ్, బెల్జియం చాకోలెట్లు, ఇటలీ పిజ్జాలు, అమెరికా బాదం, గల్ఫ్ ఖర్జూరం…ఇలా మన దగ్గర పండినవి తప్ప మిగతావన్నీ మహా రుచిగా ఉంటాయి. అలాగే రేప్పొద్దున రోదసిలో పండిన, వండిన బృహస్పతి బియ్యం, కుజ గ్రహం గోధుమలు, బుధ గ్రహం కొత్తిమీర, అంగారక అంగూర్, కేతువు కరివేపాకు, శని శాకాహారం, చంద్ర ఐస్ క్రీమ్, రాహువు రాగులు , సూర్య హాట్ చిప్స్ మాత్రమే మనకు రుచించవచ్చు.
4. సత్యనారాణ స్వామి పూజలో నవగ్రహాలను ఆహ్వానించి, ఆరాధిస్తూ ఉంటారు. ఇకపై అన్ని గ్రహాలకు ఒకేలా పసుపు కొమ్ము, ఖర్జూరం, వక్కలు, దక్షిణ పెట్టాల్సిన పనిలేదు. ఏ గ్రహం పంటలు ఆ గ్రహానికి రుచిగా, ఆరారా వేడి వేడిగా వడ్డించవచ్చు.
5 . మన గ్రహచారనికి ఈ గ్రహం మీద పంటలు తింటేనే – ఆరోగ్యాలు ఇలా అఘోరిస్తున్నాయి. ఇక అంతరిక్షం పంటలు కూడా తిని, జీర్ణం చేసుకునే రోజులు వస్తే- గ్రహాంతరవాసుల కోసం విడిగా వెతకాల్సిన పని ఉండదు. మనమే గ్రహాంతరవాసులుగా రూపాంతరం చెందుతాం.
6 . అయినా మనలో మన మాట- ఇప్పుడు మనం గ్రహాంతరవాసులం కాదా? అందుకే మనకోసం అంతరిక్ష పంటలు పండుతాయి. అంతరిక్ష ఆహారం వంటలు సిద్ధమవుతాయి.
7 . సమతుల ఆహారంలా భవిష్యత్తులో పోషకాహార నిపుణులు అంతరిక్ష ఆహారాన్ని ప్రిస్క్రైబ్ చేయకపోరు.
8 . పండిన పంటలు అమ్ముకోవడానికి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులు గంపల్లో కొత్తిమీర, కరివేపాకు, పుదిన, చుక్కాకు, గోంగూర కట్టలు పెట్టుకుని నెత్తిన మోస్తూ గ్రహం గ్రహం తిరిగి అమ్ముకోవాల్సిన రోజులు రావచ్చు. గ్రహచారం బాగలేనప్పుడు వసుదేవుడంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు. గ్రహచారం ఇలా పండితే గ్రహాలు కూడా అంతరిక్షంలో ఆకుకూరలు అమ్ముకుని బతకాల్సిందే!……… అంతరిక్ష భోజనంబు! ఓహోహో నాకే ముందు!!………… By…….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article