.
సూది కోసం సోదికెళ్తే ఏదో బయటపడినట్టు… రేవంత్ రెడ్డి బావమరిదికి, తద్వారా రేవంత్ రెడ్డికి బొగ్గు మసి అంటించడానికి హరీష్ రావు, కేటీయార్ ట్రై చేస్తున్నారు… కానీ తమ పాలన కాలంలోనే సాగిన సింగరేణి అక్రమాలన్నీ బయటికొస్తున్నాయి… దీన్నే కౌంటర్ ప్రొడక్ట్ అంటారు…
ఈ బొగ్గు స్కాం మేం బయటపెట్టాం గనుకే… దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణల పేరిట డ్రామా ఆడుతున్నాడని, అందుకెే తమను విచారణలకు పిలుస్తున్నాడని హరీష్ అండ్ కేటీయార్ ఆరోపణ… కానీ ఫోన్ ట్యాపింగ్ విచారణలపై జనంలో చర్చను దారిమళ్లించడానికే హరీష్ అండ్ కేటీయార్ ఈ బొగ్గు మసి ఆరోపణలకు దిగారని కాంగ్రెస్ ఎదురుదాడి…
Ads
డిప్యూటీ సీఎం భట్టి, ఎన్టీవీ చానెల్ కలిసి… సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గని టెండర్లు అక్రమంగా సాధించబోయారని… తన కుటుంబానికి చెందిన సుశీ కంపెనీకి ఈ టెండర్లు దక్కేలా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డిని వెనక్కి నెట్టడానికి, అడ్డుకోవడానికి ఎన్టీవీలో మంత్రి రాసలీలలు అనే కథనం ప్రసారం చేశారనే వార్తలు తెలిసినవే కదా…
(నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు ఇదే సుశీ ఇన్‌ఫ్రా లంచాలు ఇచ్చినట్లు ఓ కేసు సీబీఐ విచారణలో ఉంది… సరే, అది వేరే కథ…)
నైనీ ఆరోపణలపై విచారణకూ సిట్ వేసిన ప్రభుత్వం ఆ టెండర్లను కూడా రద్దు చేసింది… కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ బొగ్గు స్కాంపై సీబీఐ విచారణ డిమాండ్ ఎత్తుకున్నదో… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంటరయ్యాడు ఇందులోకి..! కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అని బీఆర్ఎస్ కొత్త పాట ఎత్తుకోవడంతో ఇక కిషన్ రెడ్డి ఎంట్రీ తప్పలేదు…

తనది మైనింగ్ శాఖే… కేంద్ర సంస్థ కోల్ ఇండియాకు సింగరేణిలో 49 శాతం వాటా ఉంది… ఈ టెండర్ల రద్దు యవ్వారంపై ఓ అధ్యయన నివేదిక అవసరమే కిషన్ రెడ్డి సూచనల మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో ఓ సాంకేతిక కమిటీని అర్జెంటుగా వేసింది… నైనీ గని మాత్రమే కాదు, ప్రకాశంఖని కూడా తెరపైకి వచ్చింది… దాన్ని కూడా ప్రైవేటు కంపెనీలకే ఇవ్వనున్నారు…
అస్మదీయులకు నైనీ గని ధారాదత్తం చేయడానికే ఫీల్డ్ విజిట్ (సైట్ విజిట్) నిబంధన తీసుకొచ్చారని కదా విమర్శలు… కానీ కేసీయార్ పాలనకాలంలో ఇదే నిబంధన కింద బీఆర్ఎస్ వ్యక్తులే కొన్ని టెండర్లు దక్కించుకున్నారని తాజా వార్తలు చెబుతున్నాయి…

-
వీకేఓసీ-1 … బిడ్డర్లందరికీ సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చారు… దక్కించుకున్నది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిడ్డకు చెందిన కంపెనీ అట… వీకేఓసీ-2 కూడా వాళ్లకే ఇచ్చారట…
- కల్యాణఖని… ఇక్కడా సైట్ విజిట్ సర్టిఫికెట్లు… దక్కించుకున్నది ప్రతిమ శ్రీనివాస్, వినోద్‌కుమార్ కుటుంబానికి చెందిన వ్యక్తి…
- ఆర్జీవోసీ-2 … దీన్ని దక్కించుకున్నది సీ5 కంపెనీ, దీని డైరెక్టర్లలో నిశాంత్ రావు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకరరావు కొడుకు… ఈయన హరీష్, కేటీయార్ బంధువు…
- ఎస్ఆర్పీ ఓసీ-2 …. ఇక్కడా అందరికీ సైట్ విజిట్ సర్టిఫికెట్లు… దక్కించుకున్నది హర్ష కన్‌స్ట్రక్షన్స్… కేసీయార్ పీరియడ్‌లో అనేక సాగునీటి పనులు చేపట్టింది… హరీష్ రావు బంధువులు…
ఇతర రాష్ట్రాల్లో అనేక శాఖల పనులకు సంబంధించి సైట్ విజిట్ నిబంధనలున్నాయి… సింగరేణి పనుల్లో బీఆర్ఎస్ కాలంలో దాదాపు అన్నీ పాజిటివ్ రేట్లకే అప్పగించారు…

ఓబీ పనులు, జీవిఆర్ ప్లాంటపైనా ఆరోపణలున్నాయి… అంచనా విలువకు మించి ఎక్కువ రేట్లకు ఖరారు… 2015 నుంచి 2023 మధ్య 20 వరకు ఓబీ కాంట్రాక్టులు… పీకేఓసీ 4, ఎంఎనీ మైన్ కాంట్రాక్ట్ అంచనా రేటుపై అత్యధికంగా 35.57 శాతం తేడాతో ఖరారైంది… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన సంస్థ గత బీఆర్ఎస్ హయాంలో రెండు కాంట్రాక్టులు సాధించుకున్నది…
సింగరేణి అధికారిక కార్మిక సంఘాన్ని చాన్నాళ్లు లీడ్ చేసిన కవితకు అక్కడి యవ్వారాలు మొత్తం తెలుసు… ఆమె నోరు విప్పితే బీఆర్ఎస్ అక్రమాలు మరిన్ని బయటపడతాయి… సత్తుపల్లిలోని జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకల సమాచారాన్ని కూడా కాంగ్రెస్ సేకరిస్తోంది… రూ.398 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ నిర్మాణ లోపాలు కూడా బయట పడ్డాయి…
2024లోనే బంకర్ల బీమ్స్ పగుళ్లు ఏర్పడ్డాయి… దీంతో బంకర్ పని చేయకుండా పోయింది… ఈ కాంట్రాక్టులో కేవలం ఒక సంవత్సరం మాత్రమే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉండడం విమర్శలకు దారి తీసింది…
ఒడిశాలోని నైనీ మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ కాంట్రాక్టును 2021 డిసెంబర్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ కు అంచనా రేటు కంటే 44.82 శాతం అధిక ధరకు ప్రతిపాదించారు… అయితే, తర్వాత ఇది రద్దయింది… ఇలా తవ్వేకొద్దీ బోలెడు పెం‘కాసులు…
వీటిలో నిజాలేమిటో, అబద్ధాలు ఏమిటో తేలాలంటే... బొగ్గు మంత్రిత్వ శాఖ సాంకేతిక కమిటీ కేవలం నైనీ టెండర్ల మీద కాదు, గత పదేళ్లుగా సింగరేణిలో సాగుతున్న యవ్వారాలన్నీ తవ్వాలి... ఏమో, నిజంగానే సీబీఐ గనుక ఎంటరైతే... ఇంకెన్ని ‘బొగ్గు బాగోతాలు బయటపడతాయో..’ అందుకని బీఆర్ఎస్ గత పుష్కరకాలం పనుల మీద సీబీఐ ఎంక్వయిరీ అడగాలి...
చివరగా… మోడీతో గోక్కునే సమయంలో… ఎక్కడ తననో, తన కొడుకునో ఏ కేసులోనో లిఫ్ట్ చేస్తారనే భయంతో కేసీయార్ సీబీఐకి రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా చేశాడు…

Share this Article