అసలు విషయం అర్థం కానిదేమిటంటే..? కాంగ్రెస్ హైకమాండ్ అలనాటి వైఎస్ ఆత్మ అలియాస్ కేవీపీ మాటల్ని తెలంగాణ విషయంలో ఎందుకు వింటోంది అని..? అసలు వింటుందా అని..? నిజానికి కాంగ్రెస్ హైకమాండ్ అంటేనే అదొక గందరగోళం… ఎవరేం చెబుతారో, ఎవరేం నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు… పనిచేసే నాయకుడికి కాస్త స్వేచ్ఛ ఇచ్చి, గోఎహెడ్ అనే ధోరణి లేకపోవడం… ! దేశవ్యాప్తంగా దెబ్బతినడానికి సరైన ఫీడ్ బ్యాక్ లేకపోవడమే, స్వీయ విశ్లేషణ, విచక్షణ లేకపోవడమేనా..? ఇది ఇప్పుడు టీపీసీసీ సెక్షన్లలో, కాంగ్రెస్ తెలంగాణ కేడర్‌లో చర్చనీయాంశంగా ఉన్న విషయం… కాంగ్రెస్‌ను ఇన్నాళ్లూ తొక్కీ తొక్కీ నారతీసిన కేసీయార్‌ను అదే కాంగ్రెస్ వైపు అడుగులు వేయించే కుట్ర ఏదైనా జరుగుతోందా..? లేక ఇదంతా ఉత్త హంబగేనా..? రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పగ్గాలకు దూరం చేసి, అస్థిరం చేసి, పార్టీని నామమాత్రం చేసి, కేసీయార్ క్యాంపులో ఓ అనుబంధ విభాగంగా మార్చే ప్రయత్నాలా..? అసలేం జరుగుతోంది..?
అయితే ఈ వాదనల్లో చాలా లూజ్ ఎండ్స్ ఉన్నయ్… ముందుగా ఈ తాజా ప్రచారం ఏమిటో సంక్షిప్తంగా చూద్దాం………………………………….. ‘‘టీపీసీసీ పై “ఆత్మ” స్కెచ్, నెక్ట్స్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ తో పొత్తే లక్ష్యం, టీపీసీసీని అస్థిర పరిచే కుట్ర… మొయినాబాద్ ఫాంహౌస్ కేంద్రంగా ప్రణాళిక, ఖాన్ రాజీనామా వెనుక “ఆత్మ” అదృశ్య హస్తం……. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైఎస్ ఛైర్మన్ పదవీ ప్రకటన జరిగిన తర్వాత మూడు రోజులు మౌనంగా ఉన్న ఖాన్ సడెన్ గా నాకొద్దు ఈ పదవీ అని రాజీనామా పత్రం సమర్పించడం వెనుక ఏ అదృశ్య హస్తం ఉంది? తెలంగాణ కాంగ్రెస్ ను మరోసారి ”ఆత్మ” ఆవహించిందా? మొయినాబాద్… ఔటర్ రింగ్ రోడ్డుకు 20 – 30 కిలో మీటర్ల దూరంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ఉన్న ఫాంహౌస్ కేంద్రంగానే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో కొత్త ఎత్తుగడలకు తెర లేచిందా..? అందులోనే ఈ ఆత్మ ప్లస్ టీ కాంగ్రెస్ లోని తన ఆత్మీయులు కలిసి ఈ ఫాంహౌస్ కేంద్రంగా టీపీసీసీ నే టార్గెట్ గా భారీ స్కెచ్ కు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా..?
Ads
ఖాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు (2008-2014 —– 2014-2020) రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి “ఆత్మ” సహకారంతో రాజ్యసభలోకి ప్రవేశించాడు. అలా “ఆత్మ”కు ఖాన్ కు అవినాభావ సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖాన్ ను సోనియాగాంధీ తాజాగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఆయన ఓకే చెప్పిన తర్వాతే ఈ నియామకం జరిగిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రకటన వెలువడిన మూడు రోజుల వరకు కామ్ గా ఉన్న ఖాన్… సడెన్ పదవి ఇచ్చే ముందు నన్ను సంప్రదించలేదు అని రాజీనామా ప్రకటించాడు. ఒకవేళ సంప్రదించకపోయినా, పదవి ఇష్టం లేకపోయినా పార్టీకి అంతర్గతంగా సమాచారం ఇవ్వొచ్చు, సోనియాకు లేఖ రాసి మౌనంగా ఉండొచ్చు. కానీ, రాజీనామా లేఖను మీడియాకు రిలీజ్ చేయడం “ఆత్మ” వ్యూహాంలో భాగమని చెబుతున్నారు…
రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ కు జవజీవాలు వచ్చాయన్నది వాస్తవం. భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ ఒకింత రేస్ లోకి వచ్చింది. గడిచిన నాలుగు నెలల్లో పార్టీ లేచి నడవడం మొదలు పెట్టింది. ముఖ్యంగా గజ్వేల్ సభ తర్వాత కేడర్ లో భవిష్యత్ పట్ల ఆశలు చిగురించాయి. అదే సమయంలో టీ కాంగ్రెస్ పాత కాపులు కొందరికి ఈ దూకుడు అస్సలు నచ్చడం లేదు అన్నది కూడా జగమెరిగిన సత్యం. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు అడపా దడపా చేస్తోన్న ప్రకటనలతో కలకలం రేగుతూనే ఉంది. ఆ ప్రకటనలు టీ కాంగ్రెస్ కు కనిపించని నష్టాన్ని మూటగడుతున్నాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన అంశం. మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తానంటే కేసీఆర్ కు సహకరిస్తానంటూ జగ్గారెడ్డి ఇటీవల కామెంట్ చేశారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా… ఆ ప్రకటన కాంగ్రెస్ కు తీరని నష్టం చేసిందనే చెప్పాలి. ఆ విషయం జగ్గారెడ్డికి తెలియదా..? ఇలాంటి ప్రకటనల వెనుక “ఆత్మ” ఉన్నాడన్నది ఇన్ సైడ్ టాక్. ఇటువంటి ప్రకటనలే టీఆర్ఎస్ కు రేపటి నాడు అస్త్రాలుగా మారతాయడంలో డౌట్ లేదు…
ఖాన్ రాజీనామా వెనుక ఆత్మ అదృశ్య హస్తం ఉందని చెబుతున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్ తో పాటు, బంజారాహిల్స్ లోని ఆత్మ అపార్ట్ మెంట్ కేంద్రంగా టీ కాంగ్రెస్ బడాబాబుల మీటింగ్స్ రెగ్యూలర్ గా జరుగుతున్నాయట. కొత్త పీసీసీ కార్యవర్గాన్ని అస్థిరపరచడమే ఈ మీటింగ్స్ లో చర్చల సారాంశంగా తెలుస్తోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషిస్తున్నారని గుసగుస. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకుండా ఆ తాజా మాజీ పీసీసీ చివరి వరకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. టీపీసీసీలో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ఓ బీసీ నాయకుడుకి వీళ్లు పీసీసీ అధ్యక్ష పదవి ఎర వేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని తప్పించే పనిలో కలిసి వస్తే తదుపరి నీకే పీసీసీ పదవి ఇప్పిస్తాం అని బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. నల్గొండ జిల్లాకు చెందిన మరో రెడ్డి నాయకుడుకి కూడా ఇదే ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా… రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగించి, ఉక్కిరి బిక్కిరి చేయడమే ఆత్మ మిషన్ గా చెబుతున్నారు.
ఆ వైఎస్ ఆత్మ ఇప్పుడు కేసీఆర్ కు ఆత్మగా మారాడని టీపీసీసీలో ఒక వర్గం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడు ఆత్మ ఆపరేషన్ వెనుక కూడా కేసీఆర్ ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయని చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బలహీనపడుతోందన్న టాక్ సీరియస్ గా నడుస్తోంది. ఈటెల గెలుపు టీఆర్ఎస్ ఓటమికి సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ సైజును ఎంత తగ్గించ గలిగితే కేసీఆర్ కు అంత మేలు జరుగుతుందన్నది ఆత్మ వ్యూహంగా తెలుస్తోంది. టీ కాంగ్రెస్ మినీ కాంగ్రెస్ గా మారిపోతే… టీఆర్ఎస్ తో పొత్తు తప్ప ఆ పార్టీ ముందు మరో ఆప్షన్ ఉండదు…………………..’’
ఈ ప్రచారం ఒకటి కాంగ్రెస్ వర్గాల్లో సీరియస్‌గా చక్కర్లు కొడుతున్న ప్రచారం… రాజకీయాల్లో ఏదీ కొట్టేయలేం నిజమే… కానీ ఒకప్పటి వైఎస్ ఆత్మను నమ్ముకుని, ఇప్పటికే నిండా మునిగిన కాంగ్రెస్ హైకమాండ్ నిజంగానే ఇంకా ఆయనకు విలువ ఇస్తోందా..? ఇస్తే ఎవరు సోనియాను మిస్ గైడ్ చేస్తున్నది..? అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో హైకమాండ్‌కు సరైన ఫీడ్ బ్యాక్ ఇచ్చే మార్గాలే లేవా..? ఎస్, రేవంత్ చంద్రబాబు మనిషే కావచ్చు, కానీ చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టనరే కదా… ఇప్పుడు రోజులు బాగాలేక కాంగ్రెస్‌తో దూరం దూరం ఉంటున్నాడు గానీ, మోడీ అంటే భయంతో కిక్కుమనకుండా ఉంటున్నాడు గానీ, రేప్పొద్దున మళ్లీ సోనియాతో చెట్టపట్టాలు వేసుకోడని గ్యారంటీ ఏమిటి..? అప్పుడు రేవంత్ పట్ల సోనియా వైఖరి ఎలా ఉండబోతోంది..? సో, మంచి అనుకూల వాతావరణాన్ని వాడుకోవడంలో కాంగ్రెస్ చేజేతులా తప్పులు చేస్తోందా..? అసలు పార్టీకి సరైన పొలిటికల్ స్ట్రాటజీలు ఉన్నాయా..? పెద్ద ప్రశ్నలు….. ఇవే కేసీయార్‌కు అనుకూలించే పరిస్థితులు…!!
Share this Article