.
నేచరల్ స్టార్ వంటి భుజకీర్తులు కాసేపు పక్కన పెట్టండి… ఓ అత్యంత దిగువ స్థాయి నుంచి ఇండస్ట్రీలో ఓ హీరోగా ఎదిగి, ఇప్పుడు నిర్మాతగా మారిన నాని ఓ నటుడు అందాం కాసేపు… ఎందుకంటే, తెలుగులో హీరో అనగానే నానారకాల అవక్షణాలతో కూడిన ఓ దిక్కుమాలిన రూపం కనిపిస్తుంది కాబట్టి…
ఎస్, నాని ఎదిగేకొద్దీ ఒదగడం లేదు… తను హీరోగా అదే దిక్కుమాలిన రొడ్డకొట్టుడు ఫార్ములా చెత్తా హీరో పాత్రలు చేస్తున్నాడు కానీ… ఓ నిర్మాతగా మాత్రం భిన్నమైన కథల్ని ప్రజెంట్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు, కొత్తవాళ్లను నమ్మి అవకాశాలిస్తున్నాడు… గుడ్…
Ads
(ఈ సినిమా నచ్చకపోతే నా రాబోయే సినిమా హిట్3 సినిమాను చూడకండి అని నాని వ్యాఖ్య ఓవరాక్షన్… ఏ సినిమా కథ ఆ సినిమాదే… పాలునీళ్లను విడగొట్టగలిగే నైపుణ్యం తెలుగు ప్రేక్షకుడికి ఉంది… టూమచ్ చేయకు నానీ… దీన్నే తెలుగులో ‘అతి’ అంటారు…)
దానికి అభినందిద్దాం… ఇప్పుడొచ్చిన కోర్ట్ అనే సినిమా కూడా అంతే… తను హీరో కాదు, ఓ సాదాసీదా నటుడు ప్రియదర్శి హీరో… హీరో హీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా కొత్తవాళ్లు… బాల స్టార్స్ కావచ్చుగాక… ఈ సినిమాలో అనుభవమున్న నటీనటుల్లాగే ఈజ్‌తో చేసేశారు గుడ్…
దర్శకుడు రామ్ జగదీష్‌నూ నమ్మాడు నాని… తనూ నిరూపించుకున్నాడు, తనలో దమ్ ఉంది… పాపులర్ కాని సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్‌ను నమ్మాడు నాని… పర్లేదు, గొప్పగా ఏమీ లేకపోయినా బాగానే ఉంది…
ఎహె, ఇవన్నీ కాదు చెప్పాల్సింది… అసలు సినిమా ఎలా ఉంది…? కథేమిటి..? ఎస్, ఆ కథ దగ్గరకే వద్దాం… అనేకానేక స్టార్ హీరోల పరమ చెత్తా దరిద్రపు నీచమైన కథలకన్నా ఈ కథ చాలా చాలా బెటర్… అత్యంత కఠినమైన పోక్సో చట్టం దుర్వినియోగం గురించిన కథ… ఆ కథ ఎంచుకోవడమే ఓ సాహసం…
ఓ మైనర్ అమ్మాయి, ఓ ప్రియుడు… ఆ ప్రేమ నచ్చని ఓ లాయర్… ఈ యువకుడిని కఠినమైన చట్టాల్లో ఇరికిస్తాడు… టార్గెట్ చేస్తాడు… ఏ లాయర్‌ను అడిగినా చేతులెత్తేస్తారు… అప్పుడు హీరో, అనగా ప్రియదర్శి రంగంలోకి దిగుతాడు… తెలుగు సినిమా అంటే అంతే కదా…
ఆ కేసుల నుంచి ఏయే పాయింట్లలో సదరు ప్రియదర్శి ఆ ప్రియుడిని కాపాడతాడు, ఏయే ట్విస్టులు చోటుచేసుకుంటాయనేదే సినిమా… ఎందుకు ఈ కథను మెచ్చుకుంటున్నాను అంటే… ఎస్, భిన్నమైన కథలు తెలుగు తెరను పరిపుష్టం చేయాలి… పాత వెగటు వాసనల్ని ప్రక్షాళన చేయాలి… అందుకే…
హీరోయిజం కాదు, కథే హీరో కావాలి… ఆ కొత్త, కుర్ర, తాజా హీరోహీరోయిన్లు బాగానే చేశారు… దర్శకుడు ఓకే… ప్రియదర్శి ఆ పాత్రకు ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు… కాకపోతే కోర్టు రూమ్ వాదనల్లో తన బాడీ లాంగ్వేజీ, డైలాగ్ డెలివరీ గట్రా కావల్సినంత పంచ్ క్రియేట్ చేయలేదేమో అనిపించింది… అంటే ఓ బలమైన ఇంపాక్ట్ లోపించింది… క్లైమాక్సులో కూడా..!
చెప్పుకోవాల్సింది శివాజీ పాత్ర గురించి… మామూలుగానే తన ఓవరాక్షన్, గరుడ పురాణం బాపతు నెగెటివిటీ, బిగ్‌బాస్ బాపతు నెగెటివిటీ తనపై ఓ ముద్ర వేశాయి… నిజానికి పెద్ద నటుడేమీ కాదు… ఓ సాదాసీదా నటుడు… కానీ ఈ దర్శకుడు బాగానే వాడుకున్నాడు… మంగపతి అనే విలనీ కేరక్టర్‌లో శివాజీని బలంగా ఎక్స్‌పోజ్ చేశాడు… దాంతో సినిమా షో మొత్తం శివాజీ హైజాక్ చేశాడు, ప్రియదర్శి తెల్లమొహం వేశాడు…
ఐతే… ఈ సినిమా జనాన్ని థియేటర్లకు రప్పిస్తుందా..? డౌటే… తెలుగు ప్రేక్షకుల టేస్టు మీద మనకు కొన్ని బలమైన అభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయి కదా… ఓటీటీలో చూద్దాంలే… కోర్టు రూం డ్రామా, డైలాగులే కదా… థియేటర్లలో చూడాల్సినంత సీనేముంది అనుకుంటారు… అదీ ఈ సినిమాకు మైనస్… ఐనాసరే నాని టేస్టు, ప్రయత్నం, చొరవను అభినందించాల్సిందే…
సినిమాను రెండు గంటలు చూపించాలి కదా… హీరోహీరోయిన్ల ప్రేమకథ ఫస్టాఫులో విసిగిస్తుంది… కొత్తదనం లేదు, మంచి సీన్లు పడలేదు… కాకపోతే ఎప్పుడైతే కేసులు, వాదనలు, కోర్టు విచారణలు స్టార్టవుతాయో కాస్త ఆసక్తి కలుగుతుంది… దర్శకుడు చెప్పిన లీగల్ పాయింట్లను అందరూ ఆమోదించాలని ఏమీ లేదు… కాకపోతే డిబేట్ మాత్రం అవసరమే…
కోర్టు రూమ్ డ్రామాలు కూడా కదిలించేలా, ఎమోషనల్‌గా ఉన్నాయా అంటే, అదీ లేదు… ఇంకాస్త పంచ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది… హర్ష వర్ధన్ ఓ నెగెటివ్ లాయర్ పాత్రలో, అసలైన కాఠిన్యాన్ని చూపించాల్సినప్పుడు కొంత ఓవర్ యాక్టింగ్ చేశాడు… కృతకంగా అనిపించింది… మొత్తానికి దర్శకుడికి పాస్ మార్కులు… వాల్‌పోస్టర్ బ్యానర్ నిర్మాత నానికి కూడా..!!
Share this Article