.
‘చదువు తో పాటు చట్టం గురించి కూడా పిల్లలకి నేర్పించాలి. అసలు చదువు లేకపోయినా పర్లేదు, చదువు కన్నా చట్టం అందరికీ తెలియాలి’ –
మన దేశంలో చట్టాల మీద అవగాహన గురించి ఒక సినిమా – తెలుగు సినిమా – చర్చించడం గొప్ప విషయం. కోర్ట్ సినిమాలో ఆ ప్రయత్నం చాలా బాగా చేసారు. ఇది చాలా సున్నితమైన అంశం. న్యాయ వ్యవస్థకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, ఎవరినీ నొప్పించకుండా, విమర్శించకుండా సాధారణ ప్రేక్షకులకి మంచి విషయం చెప్పడం కత్తి మీద సాము.
Ads
దర్శకుడు రామ్ జగదీష్ ఆ పని సునాయాసంగా చేసాడు – అనిపిస్తుంది కానీ, దాని వెనుక ఆయన చాలా పెద్ద పరిశోధనే చేశాడు అని ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. POCSO చట్టం మీద ఉన్న అపోహలనీ, సామాన్య ప్రజలతో పాటు ఆ చట్టం అమలులో కీలకమైన పోలీసులకే లేని అవగాహన నీ ప్రదర్శించిన విధానం అభినందనీయం.
నిజానికి ఈ సినిమా ఆ ఒక్క చట్టం గురించే మాట్లాడినా, అవగాహనా లోపం అనేది అన్ని చట్టాల విషయంలో వాస్తవం. ఆ లోటు గురించి హీరో పాత్రతో – చదువుతో పాటు చట్టాల మీద అవగాహన కావాలి అన్న ఆలోచన – కోర్టులోనే చెప్పించాడు దర్శకుడు.
భీమిలి నేపథ్యంలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ, అమ్మాయి కుటుంబంలో ఉన్న ఒక పెద్ద మనిషి దీనిని పరువు సమస్యగా తీసుకుని అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టించడం, అది కోర్ట్ ట్రయల్ కి వెళ్లడం, అక్కడ జరిగే కోర్ట్ డ్రామా ఈ సినిమా.
మామూలుగా అయితే కథలో ఉండే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, కేసు గురించి లాయర్ హీరో తెలివితేటలు చూపించి వాదించడం అనేది మన సినిమాలలో కనిపిస్తుంది. హాలీవుడ్ లో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా ఫేమస్. అయితే మన ప్రేక్షకులకి ఆ తరహా సినిమాలని ప్రోత్సహించడం అలవాటు లేకపోవడం, పైగా కోర్టు రూమ్ లో జరిగే తతంగం ఆసక్తికరంగా తీయడం, జనాన్ని చివరివరకూ కూర్చోబెట్టడం కష్టం కనుక ఎవరూ ఆ ప్రయత్నం చేయరు.
ఆ నేపథ్యంలో ఈ సినిమా విజయం సాధించింది. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. రామ్ జగదీశ్ ఎంతో లోతుగా రీసెర్చ్ చేసి, చట్టంతో పాటు, కోర్టు వాతావరణం, లాయర్లు కేసుల్ని డీల్ చేసే విధానం చాలా సహజంగా తీశాడు. తెలుగుకి ఒక మంచి దర్శకుడు దొరికాడు.
ఆర్టిస్టుల్లో ప్రియదర్శి చాలా బాగా చేసాడు. అతని స్ట్రెంగ్త్ – అండర్ ప్లే – ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది. కొద్దిగా గమనిస్తే ప్రియదర్శి చాలా జాగ్రత్తగా మంచి సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మల్లేశం, బలగం, 35, ఇప్పుడు కోర్ట్ – అతను తన పాత్రలతోనే సినిమాలని పెద్ద ప్రభావం చూపే సినిమాలు ఎంచుకుని చేస్తున్నట్టుంది.
తెలుగులో అలాంటి ఆర్టిస్టులు అదీ హీరో పాత్రలు చేసే కేటగిరీలో లేరు. మంచి సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు, దర్శకులకి ప్రియదర్శి మంచి ఆప్షన్. అలాగే ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శివాజీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈ సినిమా ద్వారా మంచి ప్రతిభ ఉన్న రామ్ ని పరిచయం చేయడం ద్వారా నాని మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.
లాయర్ అనేది బ్రిటిష్ కాలంలో మంచి గుర్తింపు ఉన్న వృత్తి. బ్రిటీష్ వాళ్ళు 1857 తర్వాత ఈ దేశంలో చట్టాలు చేసి వాటి గురించి జనానికి అవగాహన లేని విషయం గుర్తించి లా కాలేజీలు, డిగ్రీలు ఏర్పాటు చేయడంతో అప్పటి సమాజంలో లా కి ఉన్న క్రేజ్ మామూలు కాదు.
సముద్రం దాటడం నిషేధం ఉన్న కుటుంబాలు కూడా తమ పిల్లల కెరీర్ కోసం సంఘాన్ని ధిక్కరించి మరీ లా చదవడానికి లండన్ పంపించేవారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కూడా అలాగే లండన్ లో చదివి దక్షిణాఫ్రికాలో లాయర్ వృత్తి కోసం విదేశాలకు వెళ్లి, మహాత్ముడై తిరిగి వచ్చాడు, దేశ స్వాతంత్ర పోరాటాన్ని నడిపించాడు.
స్వతంత్రం వచ్చిన తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్ లాంటి కోర్సులకున్నంత ఆకర్షణీయ జీవితం లాయర్లకి లేకపోవడంతో ఆధునిక యువతరంలో లా చదువు పట్ల మక్కువ లేదు. ఫలితంగా స్వతహాగా తెలివైన విద్యార్థులు పాపులర్ కోర్సులకి వెళ్లిపోగా, ఎక్కడా సీటు దొరకని వారు డిగ్రీ పట్టా కోసం ఎంచుకునే కోర్సు గా లా డిగ్రీ మిగిలిపోయింది.
దీనివల్ల నష్టపోతోంది విద్యార్థులే కాదు, సమాజం కూడా. డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే కాదు, సమాజానికి మంచి లాయర్లు కూడా అవసరం. సరైన దృక్పథం ఉన్న లాయర్ తన కెరీర్ మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి ఉపయోగ పడగలడు. దీనికి ప్రభుత్వాలతో పాటు సామాజిక సంస్థలు, మీడియా కూడా బాధ్యత తీసుకుని ప్రజలకి అవగాహన కల్పించాలి. లాయర్ వృత్తి మీద గౌరవం పెంచిన సినిమా ఇది. మంచి ప్రయత్నం………. Ravikumar Vinnakota
Share this Article